తుర్కయాంజాల్, ఏప్రిల్ 9 : తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ సర్వే నంబర్ 240లో భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కమ్మగూడ సర్వే నంబర్ 240, 241, 242లోని సుమారు 10 ఎకరాల భూమి తమకు చెందినదని ఈ మే రకు కోర్టు అర్డర్ ఉందంటూ పలువురు వ్యక్తులు బుధవారం స్థలాన్ని కబ్జాలోకి తీసుకునేందుకు యత్నించారు. అందులో భాగంగా ప్లాట్ల క డీలు, ప్రీకాస్ట్ గోడలను కూల్చివేస్తున్న సమయంలో కాలనీలో నివాసం ఉంటున్న వారితో పాటు ప్లాట్ల యజమానులు వాటిని కూల్చవద్దంటూ అడ్డుకున్నారు.
ఈ క్రమంలో కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులు ప్లాట్ల యజమానులు, కాలనీ వాసులపై దాడికి పాల్పడడంతో వారు తిరిగి రాళ్లతో దాడికి దిగి కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులను తరిమికొట్టారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనానికి నిప్పు అంటించడంతో పూర్తిగా కాలిపోయింది. అనంతరం కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులు పలువురు మహిళలను ఘ టనా స్థలానికి తీసుకు రాగా కాలనీవాసులు వారిని అడ్డుకొని వారు వచ్చిన బస్సును కొంతమేర ధ్వంసం చేశారు. వివాదం చోటు చేసుకున్న గంటన్నర తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి చెదరగొట్టారు.
ఎమ్మెల్యే సమక్షంలో కొనసాగిన వివాదం
కమ్మగూడ సర్వే నంబర్ 240, 241, 242 భూ వివాదం బుధవారం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సాక్షిగా కొనసాగింది. బుధవారం ఉద యం ఘర్షణ చోటు చేసుకున్న అనంతరం కాలనీ వాసులు, ప్లాట్ల య జమానులు తొర్రూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు వినిపించడానికి వెళ్లారు. ఆ సమయంలో జీపీఏ హోల్డర్ రామకృష్ణ ఎమ్మెల్యే ఎదుటే ఉన్నాడు. దీంతో కాలనీ వాసులు, ప్లాట్ల యజమానులు ఆళ్ల రామకృష్ణ మధ్య వివాదం చోటు చేసుకున్నది. రామకృష్ణకు చెందిన పలువురు వ్యక్తులు ప్లాట్ల యజమానులను తోసివేయడంతో వివాదం జరిగింది. వివాదం అంతా ఎమ్మెల్యే సమక్షంలోనే జరగడం గమనార్షం. క్యాంపు కార్యాలయంలో ఉన్న తేనేటీగలను కొందరు వ్యక్తులు రాళ్లతో కోట్టడంతో అవి దాడి చేయడంతో పలువురు గాయపడ్డారు. ఎమ్మెల్యే సైతం అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఆస్తులు అమ్ముకొని ఇల్లు కట్టుకున్నా..
సొంత ఊరిలో భూములన్నీ అమ్ముకొని ప్లాటు కొనుక్కొని ఇల్లు నిర్మించుకున్నా. ఇప్పటి వరకు ఎలాంటి వివాదం లేదని తెలుసుకొని ప్లాటు కొనుకున్నా. ఒక్కసారిగా కొందరు వ్యక్తులు వచ్చి ఈ భూమి, ప్లాట్లు మావే అంటే భరించలేక పోతున్నాం. ఈ ప్లాటు ఇల్లు లేకపోతే నా కుటుంబం రోడ్డున పడుతుంది. కబ్జాదారులు రాత్రి సమయంలో ఇండ్ల ముందు తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోలీసులు స్పందించి గుండాల నుంచి రక్షణ కల్పించాలి.
– పద్మ, కమ్మగూడ, తుర్కయాంజాల్ మున్సిపాలిటీ