షాబాద్, మే 15: జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి కలెక్టర్ శశాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద డే స్కాలర్స్, రెసిడెన్సియల్ పాఠశాలల్లో 1వ తరగతిలో డే స్కాలర్స్గా ప్రవేశం కోసం 5 నుంచి 6 సంవత్సరాల లోపు అనగా 01-07-2018 నుంచి 30-06-2019 వరకు పుట్టిన, 5 తరగతిలో రెసిడెన్సియల్ స్కూల్లో ప్రవేశం కోసం 9 నుండి 10సంవత్సరాల లోపు అనగా 01-07-2014 నుంచి 30-06-2015 వరకు పుట్టిన షెడ్యూల్డ్ కులాల బాలబాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు రంగారెడ్డి జిల్లా వాస్తవ్యులై ఉండాలన్నారు.
అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు గ్రామీణ ప్రాంతాల్లో, రూ.2లక్షల లోపు పట్టణ ప్రాంతాల వారికి ఉండాలన్నారు. ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం ద్వారా డే స్కాలర్, రెసిడెన్సియల్ పాఠశాలల్లో అవకాశం కల్పించబడుతుందన్నారు. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు మీ సేవ ద్వారా పొంది ఉండాలని చెప్పారు. బాలుర బాలికల పాఠశాలలో ప్రవేశానికి ఫారాలు 18-05-2024 నుంచి 07-06-2024 వరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, రంగారెడ్డి కలెక్టర్ కాంప్లెక్స్ కొంగరకలాన్, ఇబ్రహీంపట్నం మండలంలో లభిస్తాయన్నారు. జిల్లాలో ఎన్నికల కాబడిన పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
హోలీస్పిరిట్ ఉన్నత పాఠశాల, షాబాద్, ప్రజ్ఞా ఉన్నత పాఠశాల ఆమనగల్లు, బ్రిలియంట్ గ్రామర్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపట్నం, బ్రిలియంట్ గ్రామర్ ఉన్నత పాఠశాల, సరూర్నగర్, చంపాపేట్, ఎస్వీవీఆర్ కాన్వెంట్ స్కూల్, కందుకూర్, విజేత ఉన్నత పాఠశాల, వెల్జాల్, తలకొండపల్లి మండలం, ప్రగతి ఉన్నత పాఠశాల, కడ్తాల్, న్యు లిటిల్ స్కాలర్స్ ఉన్నత పాఠశాల కిస్మత్పూర్, రాజేంద్రనగర్, కేఎన్ఆర్ ఉన్నత పాఠశాల తోల్కట్ట, మొయినాబాద్ మండలం, హయత్నగర్ ఉన్నత పాఠశాల, హయత్నగర్ రంగారెడ్డి జిల్లాలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను తీసుకొని పరిశీలన కోసం జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయం, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో పోస్టు ద్వారా గాని, నేరుగా గాని 07-06-2024న సాయంత్రం 5గంటల లోపు అందజేయాలన్నారు. ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని పేర్కొన్నారు.