వికారాబాద్, ఆగస్టు 2 : ప్రజల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు అధికారులు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ఐదు రోజుల పాటు రోజువారీగా చేపట్టాల్సిన పనులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు నిర్వహించి వారిని భాగస్వాములను చేయాలన్నారు. ఇందులో భాగంగా వ్యక్తిగత పరిశుభ్రత, సీజనల్ వ్యాధులు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, అంగన్వాడీలు, వసతి గృహాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్ స్టాప్‌లో పారిశుధ్య పనులను చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు తాగునీటిని సరఫరా చేయాలన్నారు. గ్రామాల రహదారులకు స్వాగతం, ధన్యవాదాలు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మురుగు కాలువలు, నీరు నిలిచిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్వచ్చధనం-పచ్చదనంపై విద్యార్థులకు వ్యాస రచన, పద్య గేయాలలో పోటీలు నిర్వహించి మొదటి బహుమతి, రెండో బహుమతుల కింద నగదు పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు.
గోడలపై పెయింటింగ్ పనులు చేపట్టాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఇంటికీ 6 మొక్కల చొప్పున అందించాలన్నారు. విద్యుత్తు సమస్యలను పరిష్కరించడంతో పాటు ఒరిగిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లను సరి చేయాలని విద్యుత్తు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమాహారతి , డీఆర్డీవో శ్రీనివాస్ , డీపీవో జయసుధ, డీఎంహెచ్‌వో పల్వన్ కుమార్, డీఈవో రేణుకాదేవి, పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్, పశుసంవర్ధక శాఖ అధికారి పూర్ణ చంద్రరావు, మెప్మా పీడీ రవికుమార్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.