దోమ, సెప్టెంబర్ 25 : చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం దోమ మండల పరిధిలోని దోర్నాల్‌పల్లి, బాస్పల్లి గ్రామాల్లో వాసన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చిరుధాన్యాలు, ఆర్గానిక్ పత్తి పంటను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల్లో దృఢత్వం రావాలంటే పూర్వ కాలంలో సాగు చేసే చిరు ధాన్యాల వైపు రైతులు మొగ్గు చూపాలని తెలిపారు.
సామలు, కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్న తదితర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఈ పంటలు సాగు చేసే రైతులను ఆదుకునేలా జిల్లాస్థాయిలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకురావాలన్నారు. అనంతరం బాస్పల్లిలోని పాఠశాలలో మధ్యాహ్నభోజన శాలను, తాగునీటి సదుపాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్ధార్ పురుషోత్తం, ఏవో ప్రభాకర్‌రావు, ఎంపీడీవో మహేశ్‌బాబు, మాజీ సర్పంచ్ యాదయ్య, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.