షాబాద్, జనవరి 1:రాష్ట్రం రాక ముందు కరెంట్ వచ్చే పాయే అన్నట్టుగా ఉండేది. ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతుందో అర్థం కాని పరిస్థితి. రాత్రి ఉంటే.. పగలుండకపోయేది.. కొందరైతే ఇండ్లలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా అవుతున్నది. రాత్రిళ్లూ ఇంటింటా కరెంట్ కాంతులే. లో ఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు అదనపు ట్రాన్స్ఫార్మర్లను బిగించడంతో నాణ్యమైన విద్యుత్తు అందుతున్నది. జిరాక్స్ సెంటర్లు, వడ్రంగి, ఫొటో స్టూడియోలు తదితర చిరువ్యాపారుల పనులు సాఫీగా సాగుతున్నాయి. 24 గంటలు కరెంట్ సరఫరా అవుతుండడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ప్రతి ఇంటికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిరంతర విద్యుత్ సరఫరాతో ప్రజలకు కరెంట్ కష్టాలు దూరమయ్యాయి. గత పాలకుల హయాంలో కరెంట్ సక్రమంగా లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పగటి పూట నాలుగు గంటల కరెంట్ మాత్రమే సరఫరా చేయడంతో ప్రజలు ఉక్కపోతతో తిప్పలు పడేవారు. రాత్రిపూట సైతం విద్యుత్ కోతలు ఉండేవి. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న ఇండ్లల్లో కరెంట్ లేకపోవడంతో అవస్థలు పడేవారు. ప్రజల కష్టాలను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని ప్రతి ఇంటికీ నిరంతరాయంగా 24గంటల కరెంట్ సరఫరా చేయాలని నిర్ణయించారు. నిమిషం కూడా కరెంట్ కోత లేకుండా చర్యలు చేపట్టారు. దీంతో ప్రజలకు కరెంట్ కష్టాలు తీరాయి. రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా నేడు ప్రతి గ్రామంలో ఇండ్లకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది. తమ రాష్ర్టానికి 24గంటల కరెంట్ అందించడంతో పాటు ఇతర రాష్ర్టాలకు కూడా తెలంగాణ నుండి కరెంట్ ఇచ్చే స్థాయికి తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఆమనగల్లు(కల్వకుర్తి), శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లోని 558 గ్రామ పంచాయతీల్లో తెలంగాణ ప్రభుత్వం 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుంది. దీంతో ఇండ్లలో టీవీలు, ఫ్యాన్లు, కూలర్లు, కంప్యూటర్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. గత పాలకుల హయాంలో పగటి పూట ఇచ్చే నాలుగు గంటల కరెంట్‌తో తాము ఎన్నో ఇబ్బందులు పడేవారమని ప్రజలు చెబుతున్నారు. ఇండ్లలో రూ.వేలు ఖర్చు చేసి ఇన్వర్టర్లు, బ్యాటరీలు ఏర్పాటు చేసుకునేవారు. ప్రస్తుతం వాటి అవసరం లేకుండా పోయింది. అదే విధంగా గ్రామాల్లో కరెంట్‌తో చేసే పలు రకాల పనులు కూడా సాఫీగా సాగుతున్నాయి. ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తూ ప్రజల కష్టాలను దూరం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా గృహాలకు విద్యుత్ కనెక్షన్లు 2,46,342..
పరిగి, జనవరి 1 : ప్రతిరోజు కరెంటు ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుందనేది తెలియని పరిస్థితి నుంచి 24 గంటలు గృహావసరాలకు కరెంటు సరఫరాతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరెంటు విషయంలో సీఎం కేసీఆర్ పాలనకు ముందు, కేసీఆర్ పాలన నుంచి అనే విషయం స్పష్టంగా కండ్లకు కనిపిస్తుంది. గతంలో గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ కరెంటు కష్టాలు వెంటాడేవి. ఒక్కోసారి ఉదయం సమయంలో కరెంటు సరఫరా నిలిచిపోతే మంచినీటి గోస ఉండేది. ఓవైపు విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు ఇబ్బందులు పడేవారు. అలాంటిది అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కరెంటు ఉత్పత్తి, సరఫరాపై సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానంతో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గతంలో పగలు సమయంలో గ్రామాల్లో సింగిల్ ఫేజ్ కరెంటు విడతల వారీగా ఇచ్చేవారు.
తద్వారా లో వోల్టేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇక పట్టణ ప్రాంతాల్లో గంటల తరబడి కరెంటు కట్ ఉండడంతో గృహ వినియోగదారులతోపాటు చిరు వ్యాపారులు సైతం నానా కష్టాలు ఎదుర్కొనేవారు. ప్రధానంగా జిరాక్స్ మిషన్ మొదలుకొని వడ్రంగి, ఫొటో స్టూడియోలు ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న పరిశ్రమల వారు కరెంటు కోతలతో అల్లాడేవారు. పనులు జరుగక, తమ దగ్గర పనిచేసే వారికి వేతనాలు ఇవ్వాలంటే సైతం నానా కష్టాలు ఎదుర్కొనే వారు. అలాంటిది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కొద్ది నెలల కాలంలోనే కరెంటు ఉత్పత్తి పెంచడంతోపాటు సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తూ సబ్ స్టేషన్లలో అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో గృహావసరాలకు సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు 2లక్షల 46వేల 342 ఉన్నాయి. నేడు ప్రతి ఇంటా విద్యుత్ కోసం ఎదురుచూపులు లేకుండా నిరంతర సరఫరా అందుతుంది. తద్వారా ప్రజలు తమ పనులు నిరాటంకంగా చేసుకునేందుకు కరెంటు ఇబ్బందులు లేకుండాపోయాయి.
పూర్తిగా తగ్గిన ఇన్వర్టర్ల వ్యాపారం..
గతంలో మిగతా రోజులతో పోలిస్తే వేసవిలో పగలు సమయంలో సైతం కరెంటు ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి నెలకొనేది. అసలే ఉక్కపోత, కరెంటు పోయిందంటే ఇబ్బందులు మరిన్ని ఉండేవి. దీంతో గ్రామాల్లో మధ్యతరగతి వారు, పట్టణాల్లో కనీసం 50శాతం మంది తమ ఇండ్లలో ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించుకునేవారు. కరెంటు ఎప్పుడు పోయినా కనీసం ఫ్యాన్ వేసుకోవచ్చు అనే విధంగా ఒక్కొక్క కుటుంబం వారు ఇన్వర్టర్, బ్యాటరీ ఏర్పాటుకు కనీసం రూ.20వేలు నుంచి ఖర్చు చేసేవారు. కుటుంబంలో సభ్యుల సంఖ్య అధికంగా ఉండి, విద్యుత్ వినియోగం అధికంగా ఉంటే మరింత ఎక్కువ సామర్థ్యం గల ఇన్వర్టర్లు ఏర్పాటు చేయించుకునేవారు. అలాంటిది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం గృహావసరాలకు నిరంతరం, నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తుండడంతో ఇన్వర్టర్లు కొనుగోలు చేసేవారు లేకుండాపోయారు. తద్వారా ఇన్వర్టర్లు, బ్యాటరీలు విక్రయించే దుకాణాల్లో వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోయాయి. వారు ఇతర వ్యాపారాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తగ్గిన ఇన్వర్టర్ల వ్యాపారం
గతంతో పోలిస్తే ప్రస్తుతం ఇన్వర్టర్ల వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ఇన్వర్టర్లు కొనుగోలు చేసేవారు లేరు. గతంలో కరెంటు సరఫరా సరిగ్గా ఉండకపోవడంతో వేసవి కాలంలో ఇన్వర్టర్లు, బ్యాటరీలు కొనుగోలు వ్యాపారం బాగా నడిచేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సరఫరా నిరంతరం చేస్తుండడంతో ఇన్వర్టర్లు, బ్యాటరీలు కొనుగోలు చేసేవారు చాలా తగ్గిపోయారు. కేవలం వాహనాలకు బ్యాటరీలు విక్రయాలే జరుగుతున్నాయి.
– ఎన్ కృష్ణ, ఇన్వర్టర్లు, బ్యాటరీల దుకాణం, పరిగి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక నిరంతరం విద్యుత్ ఉండడంతో ఇంట్లో సంతోషంగా ఉంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీటికి మాటికి కరెంటు పోవడంతో ఇంట్లో ఏపనులు చేయలేక విసుగు వస్తుండే. వేసవికాంలో కరెంటు లేక ఫ్యాన్లు నడవకపోవడంతో ఉబ్బరానికి, దోమలతో చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్లం. ఇప్పుడు విద్యుత్ 24 గంటలు ఉండడంతో ఇంటి, వంటపనులు సంతోషంగా చేసుకుంటున్నాం. రైతులకు కూడా చాలా మేలు జరుగుతుంది. 24 గంటల విద్యుత్‌ను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– సజిత, తాండూరు
24 గంటల కరంటు అత్యద్భుతం
తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతున్నది. స్వరాష్ట్రంలో 24 గంటల కరెంటు అత్యద్భుతం. దీంతో ఇంటి అవసరాల్లో ఎలాంటి ఇబ్బందులు రావడం లేదు. కరెంటుతోనే అన్ని పనులు సులభంగా చేసుకోగలుగుతున్నాం. ఒకప్పుడు కరెంటు ఎప్పుడు వస్తదా.. పనులు ఎప్పుడు చేసుకోవాలి అని ఎదురుచూస్తుండేవాళ్లం. ఇప్పుడు నిరంతరాయంగా కరెంటు ఉండడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగడం లేదు. విద్యుత్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– విజయలక్ష్మి, తాండూరు
రాత్రిపూట విద్యుత్ కోతలు ఉండేవి
గత ప్రభుత్వాల హయాంలో పగటి పూటతో పాటు రాత్రిపూట సైతం విద్యుత్ కోతలు ఉండేవి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు గంటల మాత్రమే ఇచ్చేవారు. అది కూడా పలుమార్లు పోయి వస్తుండేది. వేసవికాలం వచ్చిందంటే పగటిపూటతో పాటు రాత్రిపూట నాలుగు గంటలు కరెంట్ కోతలు విధించేవారు. దీంతో ఇండ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు చీకట్లో ఉక్కపోతతో ఇబ్బందులు పడేవారు. తెలంగాణ వచ్చినంకా ప్రజల కష్టాలు గుర్తించిన సీఎం కేసీఆర్ సార్ 24గంటలు కరెంట్ అందించడం హర్షనీయం.
– సింగప్పగూడెం నర్సింహులు, కుమ్మరిగూడ(షాబాద్)
భారతదేశానికే సీఎం కేసీఆర్ ఆదర్శం
ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ కష్టాలతో ఇబ్బందులు పడ్డ ప్రజల సమస్యను స్వరాష్ట్రం ఏర్పాటయిన కొద్ది రోజుల వ్యవధిలోనే పరిష్కరించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. ప్రతి ఇంటికీ 24గంటల కరెంట్ అందించే రాష్ట్రం తెలంగాణ తప్ప దేశంలో ఎక్కడా కూడా లేదు. నేడు ప్రతి ఇంటికి, ప్రభుత్వ కార్యాలయాలకు, పరిశ్రమలకు నిరంతర కరెంట్ అందిస్తున్నారు. ఇతర రాష్ర్టాలకు కరెంట్ అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడం గొప్ప పరిణామం. యావత్ భారతదేశానికి సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారు.
–గంగిడి భూపాల్‌రెడ్డి, హైతాబాద్(షాబాద్)