కేశంపేట, జూలై 10: కారులో మంటలు చెలరేగి కాలి బూడిదైనా ఘటన కేశంపేట (Keshampet) పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని గంట్లవెల్లి గ్రామానికి చెందిన మిద్దె కృష్ణ తన కారులో కేశంపేట మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ నుంచి తన గ్రామానికి బయలుదేరారు. కారులో సాంకేతిక లోపం తలెత్తడంతో ఒక్కసారిగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.
గమనించిన కృష్ణ.. కారు డోరును తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే అది తెరచుకోకపోవడంతో అప్రమత్తమై బలంగా తన్నడంతో ఓపెన్ అయినట్లు తెలిపారు. అనంతరం కేశంపేట పోలీస్ స్టేషన్‌తోపాటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేసినట్లు వివరించారు. ఘటనాస్థలానికి కేశంపేట పోలీసులు పరిశీలించగా ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.