వికారాబాద్, జనవరి 13 : తాండూరు ఆర్టీసి డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వస్తూ అనంతగిరి ఘాట్ వద్ద అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ చాకచర్యంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన టీఎస్34టీఏ6363 నెంబర్ గల బస్సు శనివారం హైదరాబాద్, వికారాబాద్ మీదుగా తాండూరు వెళ్తున్నది. మధ్యాహ్నం 92 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు వికారాబాద్ అనంతగిరి ఘాట్ రోడ్డు వద్ద బ్రేకులు ఫెయిలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రఫీ చాకచక్యంతో ప్రయాణికులను కాపాడేందుకు బస్సును రోడ్డు దింపి పొదల్లోకి తీసుకెళ్లి నిలిపాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాయపడ్డ వారిని 108లో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మొత్తం 9 మంది గాయపడగా, ఐదుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. మిగతా నలుగురు దవాఖానలో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రయాణికులను వేరే బస్సులలో గమ్యస్థానాలకు చేర్చారు.