పరిగి/పూడూరు, జనవరి 20 : పార్లమెంటు ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు నయా జోష్‌తో సిద్ధం కావాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి సూచించారు. శనివారం పరిగిలోని బృందావన్ గార్డెన్ల, పూడూరులలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాల న్నారు.
శనివారం బీఆర్ఎస్ పార్టీ పూడూరు మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీలకు గెలుపోటములు సహజమని, నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు, రైతు రుణమాఫీ డబ్బులు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసినందుకు రైతులు కూడా నిరాశతో ఉన్నారని పేర్కొన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు చెప్పారని, ఈసారి పరిగి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వచ్చేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాబోయే మూడు నెలలు కష్టపడి పార్టీ కోసం పనిచేయండి, ఐదేండ్లు మీ కోసం పనిచేస్తానని, ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై శ్వేతపత్రాలు పెడదామన్నారు. దేశం మరింత ముందుకు పోవాలనే తపనతోనే పార్టీని బీఆర్ఎస్గా విస్తరించారని తెలిపారు. ప్రజాతీర్పును గౌరవిస్తూ, ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా ఉంటూ పాత పద్ధతిలో పోరాటం కొనసాగిద్దామని ఎంపీ సూచించారు.
తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ప్రతి పేద ఇంటికి సంక్షేమ పథకాలు నేరుగా చేరాయని ఎంపీ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కంటే అబద్ధం గెలిచిందన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారంతో గెలిచిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో 420 హామీలున్నాయన్నారు. హామీలు అమలు చేయడం చేతకాక శ్వేతపత్రాల పేరిట కొత్త నాటకానికి ప్రభుత్వం తెర తీసిందన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో 111వ హామీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని ఉందని, జాతీయ హోదా కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్రానికి విన్నవించిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు-రంగారెడ్డి పనులను పరిశీలించిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వగా.. రూ.5వేల కోట్ల విలువ చేసే పనులకు టెండర్లు పిలువగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఎంపీ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం లైన్లో నిలబడడం ప్రారంభమైందని, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రైవేటు బస్సుల్లో రద్దీ వల్ల కేఎంపీఎల్ తగ్గిందని, తమకు పాత ధరలు సరిపోవంటూ బస్సుల యజమానులు ఆందోళన చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు రూ.3.5 లక్షల కోట్లు అవసరమన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం బీఆర్ఎస్కు లేదని, ఐదేండ్లు ప్రతిపక్షంలో ఉందామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారన్నారు. పోలీసు అకాడమీ జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఫోర్ లేన్ రోడ్డు గతంలో మంజూరవగా.. తాము మంజూరు చేయించామని ప్రస్తుత ఎమ్మెల్యే చెప్పుకోవడం విడ్డూరమన్నారు. ముందుగా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. గెలుపోటములు సహజమని, నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల కోసం, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు పోరాటం చేద్దామన్నారు. పార్లమెంటులో అత్యధికంగా ప్రశ్నలు అడిగిన ఎంపీ రంజిత్‌రెడ్డి అని, వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్ పరిధిలోకి మార్చడంలో, జిల్లాకు మెడికల్ కళాశాల రావడంలో ప్రత్యేక కృషి చేశారన్నారు. గతంలో ఎంపీలు సంవత్సరానికి ఒక్కసారన్న ఈ ప్రాంతాలకు వచ్చేవారు కారని, ఎంపీ రంజిత్‌రెడ్డి గెలిచాక ప్రతి కార్యక్రమానికి హాజరయ్యారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పరిగి నియోజకవర్గ నాయకులు రాబోయే పార్లమెంట్ ఎన్నికలో ఎంపీగా రంజిత్‌రెడ్డి గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కరణం అరవిందరావు, జడ్పీటీసీ బి.హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కె.శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.సుభాష్‌చందర్‌రెడ్డి, మేడిద రాజేందర్, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పి.వెంకటయ్య, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జి.అశోక్‌వర్ధన్‌రెడ్డి, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కె.వెంకట్రాంరెడ్డి, పార్టీ పూడూరు మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, రాష్ట్ర నాయకుడు కె.అనిల్‌రెడ్డి, రైతుబంధు సమితి కన్వీనర్ రాజేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, సొసైటీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, అనంతరెడ్డి, అజీం, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, రాజేందర్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.