ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 15 : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకూ చేరుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రశాంత్కుమార్రెడ్డి నిర్వహిస్తున్న ప్రగతి నివేదనయాత్రలో భాగంగా మంగళవారం రాత్రి మండల పరిధిలోని రాయపోల్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరువతో వందలకోట్ల నిధులతో నియోజకవర్గంలో అందమైన రోడ్లు, ఐటీ, పారిశ్రామికరంగ సంస్థలు, ఎరోస్పేస్ సంస్థలు, రక్షణ రంగ సంస్థలతో పాటు మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటంతో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కాలికి గాయమైనప్పటికీ పాదయాత్రలో ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ముందుకు సాగటం అభినందనీయమన్నారు. దేశంలో బీఆర్ఎస్ రానున్న రోజుల్లో బలమైన శక్తిగా ఎదగటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రశాంత్కుమార్రెడ్డి పాదయాత్ర నిర్వహించటం అభినందనీయమన్నారు. బుధవారం ఉదయం ముకునూరు గ్రామంలో కొనసాగిన పాదయాత్ర సాయంత్రం దండుమైలారం గ్రామానికి చేరుకుంది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తువెంకటరమణారెడ్డి, ఎంపీపీ కృపేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, సహకార సంఘం చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, చీరాల రమేవ్, సర్పంచ్ గంగిరెడ్డి బల్వంత్రెడ్డి, ఎంపీటీసీలు అచ్చన శ్రీశైలం, జ్యోతి పాల్గొన్నారు.