తాండూరు, మే 1: ఎంపీ ఎన్నికల్లో భాగంగా గురువారం సాయంత్రం 5 గంటలకు యాలాల మండల పరిధిలోని లక్ష్మినారాయణపూర్ సమీపంలో యాలాల, బషీరాబాద్ మండలాల బీఆర్ఎస్ ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తెలిపారు. బుధవారం సభ ఏర్పాట్లను రోహిత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బైండ్ల విజయకుమార్ స్థానిక నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. యాలాల, బషీరాబాద్ మండల పరిధిలోని బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ధారూరు, మే 1: బీఆర్ఎస్ పార్టీ మండల సమావేశం గురువారం పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఉదయం 10.30 గంటలకు మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాలులో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కాసాని జ్ఙానేశ్వర్, పార్టీ ముఖ్యనాయకులు హాజరవుతున్నారని తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.