సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ): డబుల్ బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతుల కల్పనపై బల్దియా మీనమేషాలు లెక్కిస్తున్నది. దీంతో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు అవస్థలు తప్పడం లేదు. మౌలిక వసతులు కల్పించాలంటూ..లబ్ధిదారులంతా గడిచిన పది నెలలుగా జీహెచ్ఎంసీ ప్రజావాణిలో మొర పెట్టుకుంటూ వస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 66వేలకు పైగా లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు దాటినా.. ఆ ఇండ్ల సముదాయాల్లో మౌలిక వసతులు కల్పించలేదని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇండ్లలో లిఫ్టులు పనిచేయడం లేదని వాపోతున్నారు.
ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లల చదువులకు ఆటంకం ఏర్పడుతున్నదని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని డబుల్ ఇండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ.. లబ్ధిదారులు ఇందిరాపార్కు, జోనల్ కార్యాలయాల ఎదుట ఆందోళన సైతం చేపట్టారు. స్పందించిన అప్పటి కమిషనర్ ఆమ్రపాలి మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే నీటి సరఫరా, డ్రైనేజీ, లిఫ్టులు, కరెంట్, రహదారులు, ఇతర సదుపాయాల పనులకు టెండర్లు పిలుస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. ఆచరణలో మాత్రం పనులు జరుగుతున్న దాఖలాలు లేవని లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణికి లబ్ధిదారులు పెద్ద ఎత్తున వచ్చి కమిషనర్ ఇలంబర్తి ముందు తమ ఆవేదన, నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. శామీర్‌పేట వద్ద మురహరపల్లి 2 బీహెచ్‌కే లబ్ధిదారులు కమిషనర్‌ను కలవనున్నారు.
రూ.100 కోట్ల నిధులపై రాని స్పష్టత?
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 లొకేషన్లలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఉన్న చోటే 27 ప్రాంతాల్లో (ఇన్సైట్)లో 5,363 మందికి, 39 లొకేషన్లలో 63,478 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేసిన సంగతి తెలిసిందే. అలాగే 66 లొకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు. కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్, కేబుల్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఇతర మెయింటెనెన్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా కేసీఆర్ సర్కారు హెచ్ఎండీఏ నుంచి రూ. 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. నిబంధనల ప్రకారమే జీహెచ్ఎంసీ ఖజానాలోకి రూ.100 కోట్లు వచ్చి చేరాయి. కానీ నేటికి ఈ నిధులు ఖజానా నుంచి నిర్వహణకు మళ్లలేదు. పైగా డ్రైనేజీ, నల్లా కనెక్షన్ వేసిన జలమండలికి నిధులు మంజూరు చేయలేదు. డబుల్ బెడ్రూం ఇండ్లకు తాజా బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. అయితే రూ. 100కోట్ల నిధులను ఎలా సమకూర్చుకొని మౌలిక వసతుల కల్పనకు ఎలా కృషి చేస్తారన్నది స్పష్టత లేదు. మొత్తంగా మరిన్ని నెలలు లబ్ధిదారులు ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి నెలకొన్నది.