బొంరాస్‌పేట, ఏప్రిల్ 8 : వన్ డే క్రికెట్ అయినా, ధనాధన్ పరుగుల ఆటగా ప్రసిద్ధికెక్కిన టీ20 అయినా మైదానంలో చీర్ గర్ల్స్‌కు ఎనలేని ప్రాధాన్యం ఉంటుంది. ఆటగాడు ఫోర్, సిక్స్ బాదినా, వికెట్ తీసినా, క్యాచ్ పట్టినా ఆటగాళ్లను, జట్టును మరింత ప్రోత్సహించేలా చీర్ గర్ల్స్ చేసే నృత్యాలను మైదానంలో ఉన్న ప్రేక్షకులేగాక టీవీలలో క్రికెట్‌ను వీక్షించే లక్షలాది మంది అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటి ఆసక్తికర సన్నివేశాలకు ఐపీఎల్ మ్యాచ్‌లలో కొదువేలేదు. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈసారి తమ జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ గ్రామీణ కళారూపమైన ఒగ్గుడోలు ప్రదర్శనకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున ఒగ్గుడోలు ప్రదర్శనలో పాల్గొనే అవకాశం వికారాబాద్ జిల్లా కళాకారులకు దక్కడం గమనార్హం.
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకుండే క్రేజీ అంతాఇంతా కాదు. మ్యాచ్‌లను చూడటానికి అభిమానులు పోటెత్తుతారు. ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు గ్రామీణ మట్టి కళారూపం ఒగ్గుడోలు ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఆడే మ్యాచ్‌లలో ఒగ్గుడోలు ప్రదర్శన ఇవ్వడానికి కళాకారులకు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఒగ్గు కళాకారులను ప్రభుత్వం ఎంపిక చేయగా, వీరిలో వికారాబాద్ జిల్లా నుంచి ఐదుగురు ఒగ్గు కళాకారులకు అవకాశం లభించింది. బొంరాస్‌పేట మండలం నాందార్‌పూర్ గ్రామానికి చెందిన శ్రీ మల్లికార్జున ఒగ్గుకళా సమితి నుంచి బీరప్ప, శివ, రఘు, బషీరాబాద్ మండలం నవాల్గ నుంచి ప్రవీణ్, బంట్వారం మండలం నుంచి భద్రయ్యలకు అవకాశం లభించింది. ఈ నెల 2వ తేదీ ఆదివారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒగ్గు కళాకారులు తమ ఒగ్గుడోలుతో విన్యాసాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. జట్టు టాస్ గెలిచినప్పటి నుంచి మ్యాచ్ ముగిసే వరకు కళాకారులు తమ డోలుతో ప్రేక్షకులు, ఆటగాళ్లను ప్రోత్సహించే విధంగా ప్రదర్శనలు ఇస్తున్నారు.
హైదరాబాద్ జట్టు తరఫున ఆడే క్రీడాకారుడు బౌండరీ, సిక్స్ కొట్టినప్పుడు, ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ సమయంలో ఆటగాళ్ల వికెట్లు తీసినప్పుడు వీరు డోలుతో అదరగొడుతున్నారు. చీర్‌గర్ల్స్ చేసే నృత్యాలకు భిన్నంగా ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఒగ్గుడోలు ప్రదర్శన ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటుంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒగ్గుడోలు కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కూడా వీరు పాల్గొని తమ సత్తా చాటారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పండుగ, పబ్బం జరిగినా, పెండ్లిళ్లు పేరంటాలు, బోనాల ఉత్సవాలు జరిగినా, విజయోత్సవ ఊరేగింపులు జరిగినా అక్కడ ఒగ్గుడోలు ప్రదర్శన తప్పక ఉంటుంది. అంతటి ప్రాముఖ్యం సంతరించుకున్న గ్రామీణ కళారూపానికి ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రదర్శించే అవకాశం రావడం పట్ల జిల్లా ప్రజలు, కళాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 9, 18, 24, మే4, 13, 18వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల్లో ఒగ్గుడోలు ప్రదర్శనలు ఉంటాయని కళాకారుడు బీరప్ప తెలిపారు.
గొప్ప అవకాశం లభించింది
ఇప్పటి వరకు తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఒగ్గుడోలు ప్రదర్శనలు ఇచ్చాం. మొదటిసారిగా ఐసీఎల్ క్రికెట్ మ్యాచ్‌లో తమ ఒగ్గుకళను ప్రదర్శించే అవకాశం ప్రభుత్వం తమకు కల్పించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున హైదరాబాద్‌లో ఆడే అన్ని మ్యాచ్‌ల్లో తాము ఒగ్గుడోలు ప్రదర్శన ఇస్తాం. ఐపీఎల్లో ఒగ్గుడోలు కళా ప్రదర్శనకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, సన్‌రైజర్స్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
–బీరప్ప, ఒగ్గు కళాకారుడు,నాందార్‌పూర్, బొంరాస్‌పేట మండలం