మొయినాబాద్, జనవరి 01 : చిలుకూరు ఆలయానికి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. అన్ని దారులు చిలుకూరు బాలాజీ స్వామి వారి ఆలయం వైపు ఉండటంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి వారిని దర్శించుకున్నారు.
గంటకు 20 వేల మంది
అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ అర్చకులు, నిర్వాహకులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలకు అనుగుణంగా స్వామి వారిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామి వారిని గంటకు 20 వేల మంది దర్శించుకున్నారు. భక్తులు ఆలయ గర్భగుడిలోనికి వచ్చాక స్వామి వారిని దర్శించుకోవడానికి మహిళలకు, పురుషులకు వేరువేరుగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు తాకిడి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికంగా వచ్చారు.
మెటల్ డిటెక్టర్ ఏర్పాటు..
ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించిన సైబరాబాద్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆలయంలోని భక్తులు వెళ్లేదారి లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి ప్రతి భక్తుడిని తనిఖీ చేసి ఆలయంలోనికి పంపారు. ట్రాఫి క్ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.