షాద్‌నగర్ రూరల్, ఫిబ్రవరి 17: మహాశివరాత్రి వేడుకకు ఉత్తర రామలింగేశ్వరాలయం సిద్ధమైంది. ఈ ఆలయం ఫరూఖ్‌నగర్ మండలంలోని రామేశ్వరంలో ఉన్నది. భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా.. మరో కాశీ శైవ క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న లింగేశ్వరుడిని శ్రీరాముడు ప్రతిష్ఠించడంతోనే రామలింగేశ్వరాలయంగా పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్య లో తరలివస్తారు. స్వామివారిని భక్తితో కొలిస్తే ఎం తో పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.
ఏర్పాట్లు పూర్తి
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉత్తర రామలింగశ్వరాలయంలో అన్ని వసతులు కల్పించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రామశర్మ తెలిపారు. భక్తులు సేద తీరేందుకు వీలుగా టెంట్లు, క్యూలైన్ల ఏర్పాటుతోపాటు భక్తుల సౌకర్యార్థం వలంటీర్లను నియమించామన్నారు. వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయడంతోపాటు ఆలయ సమీపంలో తాత్కాలికంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆలయానికి ఇలా చేరుకోవాలి..
షాద్‌నగర్ పట్టణం నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో ఉత్తర రామలింగేశ్వరాలయం ఉన్నది. జాతీయ రహదారి నుంచి ఈ ఆలయానికి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది. షాద్‌నగర్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు కలవు. అంతేకాకుం డా ముఖద్వారం నుంచి కూడా ప్రైవేట్ ఆటోలు రాకపోకలు సాగిస్తాయి.