రంగారెడ్డి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఒక్కో రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రణాళికాబద్ధంగా ప్రగతిని సాధిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. నగరంలోని ఖైరతాబాద్‌లో సోమవారం నిర్వహించిన రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు – భవనాలు, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం మంత్రి మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.
ప్రణాళికాబద్ధంగా ప్రగతి సాధిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సోమవారం జడ్పీ చైర్పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వ సభ్య సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పి.సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ చర్చలను ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, రోడ్లు-భవనాలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై, జిల్లాలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారంపై జిల్లా పరిషత్ సమావేశం కొనసాగింది. ఎజెండాలో పేర్కొన్న అంశాల వారీగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, అధికారులు ఎప్పటికప్పుడు వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. సభ్యులు తెలిపిన ప్రతి సమస్యనూ అధికారులు తమ ఎజెండాలో పెట్టుకోవాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎనిమిదేండ్ల నుంచి ఒక్కో రంగాన్ని ఎంపిక చేసుకొని ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా 12 అంశాలపై పనులు చేపట్టామని, మొదటి విడుతలో ఎంపికైన పాఠశాలల్లో పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. గ్రామ పంచాయతీల్లో, పాఠశాలల్లో రీడింగ్ తరగతి గదులను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు అన్ని సామర్థ్యాలను సాధించేందుకు తొలిమెట్లు కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధిస్తున్న ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామన్నారు. ఉపాధ్యాయులు అవసరమున్న చోట భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
వైద్యారోగ్య శాఖపై..
ముందుగా వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. కంటి వెలుగు రెండో విడుతలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3,19,451 మందికి స్క్రీనింగ్ నిర్వహించామని, 53,320 మందికి రీడింగ్ కండ్ల్లద్దాలు, 9,139 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు ఇచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్, సంబంధిత సిబ్బంది లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా డాక్టర్, ఇంకా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సభ్యులు అధికారులను కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు స్పందిస్తూ, ప్రతి ఆరోగ్య కేంద్రంలో కచ్చితంగా డాక్టర్, సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
విద్యా శాఖపై..
అనంతరం విద్యా శాఖపై చర్చ కొనసాగించారు. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొదటి విడుతలో 464 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులకు కావాల్సిన వసతులు, మరమ్మతులు చేపట్టామని, ఇందులో భాగంగానే 9 మాడల్ స్కూల్స్ ప్రారంభించినట్లు జిల్లా విద్యా శాఖ అధికారి సుశీందర్ రావు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రారంభించామని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థుల కొరత తీవ్రంగా ఉన్నదని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో రోడ్లు సరిగా లేకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారని, ప్రమాదాలు జరుగకుండా చూడాలని సభ్యులు ఆర్ అండ్ బీ, ఈఈపీఆర్ అధికారులను కోరారు. రోడ్ల మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపట్టి ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ‘రైతుబంధు’కు సంబంధించి కొందరు రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో పడడం లేదని, సమస్య ఎక్కడ ఉందో పరిష్కరించాలని సభ్యులు కోరారు. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి స్పందిస్తూ రైతుబంధుకు సంబంధించిన డబ్బులు అందరి ఖాతాల్లో పడుతాయి.. లేదంటే ఖజానాలోనే ఉంటాయి.. కాకపోతే, కొంచెం వెనకా.. ముందు జరుగుతుందని, రైతులు కాస్త సంయమనం పాటించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ప్రజా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, శాసన సభ్యులు అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, కాలె యాదయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్ ఈట గణేశ్, కో ఆప్షన్ సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
రంగారెడ్డి (నమస్తే తెలంగాణ) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి కోరారు. ఖైరతాబాద్‌లోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ అనితాహరినాథ్ రెడ్డి, జిల్లా మహిళా ప్రజా ప్రతినిధులు, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సమక్షంలో అధికారులతో మంత్రి సబితారెడ్డి కలిసి కేక్ కట్ చేసి ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు ఇప్పటికే అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని, వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలతో చేయూతనిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులను ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ అనితా హరినాథ్ రెడ్డి జిల్లా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది..
సమావేశం దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. సభ్యులు కాస్త సంయమనం పాటించాలి. చాలా మంది సభ్యులు సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. ఇది తగదు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మనది. ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్దాం. జిల్లాలోనూ కొన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ఆయా మండలాల్లో మౌలిక వసతులను ఎన్నింటినో కల్పించుకోవాలి. అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తున్నది.
– అనితాహరినాథ్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్, రంగారెడ్డి జిల్లా