ఆదిబట్ల, ఏప్రిల్ 24 : అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మినీ టీచర్స్‌కు మే నెల సెలవులను వెంటనే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కార్యదర్శి కవిత మాట్లాడుతూ.. ఎండాకాలం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ఒకపూట బడిని నిర్ణయిస్తూ సర్క్యులర్‌ను జారీ చేసినందుకు రాష్ట్ర కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపామన్నారు.
మంత్రి హామీ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే సెలవులు మంజూరు చేయాలన్నారు. ఇప్పటికే మే నెల సమయం దగ్గర పడుతుండటంతో ఇంకా ప్రభుత్వం మే నెల సెలవులపై నిర్ణయం చేయలేదన్నారు. ఇప్పటికే ఎండలు మండిపోతుండటంతో అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అంగన్వాడీ సెంటర్లలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. సమస్యలను పరిశీలించి పరిష్కారం చేయాలని.. సెలవుల నిర్ణయాన్ని వెంటనే ప్రకటించాలని వారు కోరారు. అనంతరం జిల్లా అంగన్వాడీ అధికారికి వినతిపత్రం అందజేశారు.
సమస్యలు పరిష్కరించాలి
వికారాబాద్ : అంగన్వాడీ సెంటర్లకు మే నెల మొత్తం సెలవులు ఇవ్వాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భారతి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ టీచర్లు ధర్నా చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌కు సీఐటీయూ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులను ఆపాలని కోరారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు, సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మహిపాల్, ఉపాధ్యక్షులు, అంగన్వాడీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.