వికారాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): జిల్లా కలెక్టరేట్లో ఓ కీచక అధికారి బాగోతం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఆడిట్ కార్యాలయ అధికారి లైంగికంగా వేధిస్తున్నాడని ఆ శాఖలోనే పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగిని ఆరోపిస్తున్నారు. సెలవు కావాలంటే.. పర్సనల్‌గా కలవాలంటూ.. అసభ్య ప్రవర్తనతో లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత ఉద్యోగిని ‘నమస్తే తెలంగాణ’కు తన ఆవేదనను వెల్లబోసుకున్నది. సదరు అధికారి చాంబర్‌కు వెళ్లాలంటేనే అధికారులు హడలిపోతున్నారు. సాక్షాత్తు కలెక్టరేట్లోనే మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోవడం గమనార్హం.
కాగా, ఐదు నెలల కిందట జిల్లా ఆడిట్ కార్యాలయ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఓ అధికారి ఉద్యోగులను వేధిస్తున్నాడని ఫిర్యాదులొస్తున్నాయి. మూడు నెలల కిందట ఆ శాఖలోనే ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని సెలవు విషయమై ఆ అధికారికి ఫోన్ చేయగా..ఫోన్లో కాదు, నన్ను పర్సనల్‌గా కలవాలంటూ వేధింపులకు గురి చేయడం, చాంబర్‌కు పిలిచి చెప్పకుండా సెలవు ఎందుకు పెట్టావంటూ దబాయించి అసభ్య పదజాలంతో దూషించడంతో విసుగు చెందిన ఆ బాధిత ఉద్యోగిని కలెక్టరేట్లోని ఆడిట్ కార్యాలయంలోనే ఉద్యోగులందరి సమక్షంలో అరిచి పరువు తీసినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడం గమనార్హం. ఇటీవల మరోసారి లైంగికంగా వేధించడంతో తట్టుకోలేకపోయిన ఆమె ఉద్యోగులందరికీ ఆ విషయాన్ని చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.
అంతేకాకుండా ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్ నుంచి వికారాబాద్‌కు ప్రతిరోజూ రైల్లో రాకపోకలు సాగించే జిల్లా ఆడిట్ కార్యాలయ అధికారి…ట్రైన్లో వచ్చే మహిళా ఉద్యోగినులతోనూ మీతో పర్సనల్‌గా మాట్లాడాలి.. మీ పర్సనల్ ఫోన్ నంబర్ ఇవ్వాలంటూ వేధింపులకు గురిస్తున్నారని పలువురు మహిళా ఉద్యోగినులు ఆరోపిస్తున్నారు. అయితే, సదరు అధికారి గతంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో పనిచేసిన సమయంలోనూ అక్కడ మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధించడంతోనే సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో పనిచేసిన సమయంలో లుంగీతోనే కార్యాలయంలో ఉంటూ మహిళా ఉద్యోగినులతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం అప్పట్లో హల్చల్ అయింది.
జిల్లా ఆడిట్ కార్యాలయ అధికారిపై సంబంధిత శాఖ ఉద్యోగులందరూ ఆగ్రహంతో ఉన్నారు. అక్కడ పని చేసే ఉద్యోగులందరినీ బూతులు తిడుతున్నారనే ఆరోపణలున్నాయి. చంపుతా.. నా కొడుకా.. అనే ఊత పదాన్ని ఊపయోగిస్తూ ఉద్యోగులందరినీ వేధిస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. సార్.. మీ ప్రవర్తన మార్చుకొండని కొందరు ఉద్యోగులు సూచిస్తే, నేను స్పీకర్ మనిషిని అంటూ, స్పీకర్ సిఫారసుతోనే ఇక్కడికి వచ్చానని, కలెక్టర్ కూడా నాకు దగ్గరంటూ.. మీరేం చేసుకుంటారో చేసుకొండంటూ ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
ఆ అధికారి బూతు పురాణాన్ని తట్టుకోలేక అతడుంటే ఇక్కడ మేము పనిచేయలేమంటూ రెండు రోజుల కిందట సంబంధిత శాఖ డైరెక్టర్‌కు ఉద్యోగులందరూ వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నేడో, రేపో స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టికీ జిల్లా ఆడిట్ అధికారి బాగోతాన్ని తీసుకెళ్లనున్నట్లు తెలిసింది.