శనివారం 28 నవంబర్ 2020
Rangareddy - Aug 11, 2020 , 00:10:25

ఫార్మాసిటీ భూ సేకరణ వేగవంతం

 ఫార్మాసిటీ భూ సేకరణ వేగవంతం

- తుది దశకు చేరుకున్న సేకరణ

- భూములు సర్వే చేస్తున్న అధికారులు

కందుకూరు, ఆగస్టు 10 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మండల పరిధిలోని ముచ్చర్ల కేంద్రంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. కాగా భూసేకరణ కోసం రైతులను ఒప్పించి పనుల్లో వేగం పెంచారు అధికారులు. పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరువతీసుకొని ఫార్మాసిటీ ఏర్పాటు విషయంలో కృషి చేస్తున్నారు. త్వరగా భూ సేకరణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడంతో అధికారులు వేగంగా కదులుతున్నారు. రైతులను ఒప్పించి వారికి నష్ట పరిహారం చెల్లిస్తున్నారు. సేకరించిన భూములను సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం ఫార్మాకు నిమ్జ్‌ హోదాను కల్పించడంతో పనుల్లో దూకుడు పెంచారు. కందుకూరు మండల పరిధిలోని మీర్‌ఖాన్‌పేట్‌, ముచ్చర్ల, పంజగూడ, యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద, తాడిపర్తి, కడ్తాల్‌ మండల పరిధిలోని చరికొండ, అల్మాస్‌గూడ, తదితర గ్రామాల్లో దాదాపుగా 20వేల ఎకరాల్లో ఫార్మాను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లో 10వేల ఎకరాలకు పైగా సేకరించి టీఎస్‌ఐఐసీకి అప్పగించారు. ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలను పటాపంచలు చేసి ఫార్మాను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. మీర్‌ఖాన్‌పేట్‌ సమీపంలో మోడల్‌ ఫార్మాసిటీని ఏర్పాటు చేయడానికి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శ్రీశైలం హైదరాబాద్‌ జాతీయ రహదారి వరకు రోడ్డును ఏర్పాటు చేస్తున్నారు. 33/11విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. పట్టా, అసైన్‌మెంట్‌ భూములకు ప్రభుత్వం ఖరారు చేసి ధరను రైతులకు ఇస్తుండడంతో వారు ఆనంద పడుతున్నారు.  కాలుష్యం లేకుండా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. దీంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతుండడంతో ప్రజలు ఆనంద పడుతున్నారు.

కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటునియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషి వల్ల కాలుష్య రహిత ఫార్మాసిటీ ఏర్పాటు కానుంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఫార్మాసిటీ రావడంతో స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. జాతీయస్థాయిలో గుర్తింపు వస్తుంది. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ప్రజలు రుణపడి ఉంటారు. త్వరలో మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ఫార్మాసిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారు.

- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి 

ముమ్మరంగా భూ సేకరణ..

భూ సేకరణ ముమ్మురంగా చేస్తున్నాం. రైతులను ఒప్పించి నష్ట పరిహారం చెల్లించి టీఎస్‌ఐఐసీకి అప్పగిస్తున్నాం. రైతుల భూములను సేకరించి మోడల్‌ ఫార్మాసిటీ వరకు రోడ్డు వేస్తున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

- రవీందర్‌రెడ్డి, ఆర్డీవో కందుకూరు

నిమ్జ్‌ హోదా తీసుకువచ్చా..

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు కేంద్రంతో మాట్లాడి ముచ్చర్ల ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదాను తీసుకువచ్చాను. ఫార్మా ఏర్పాటు ద్వారా 4.2లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఫార్మాసిటీకి సంబంధించి ప్రభుత్వం అన్ని అవసరమైన అనుమతులు తీసుకుంది. త్వరలో భూ సేకరణ పూర్తవుతుంది. ఫార్మా సిటీ రావడం ప్రజల అదృష్టం.

- గడ్డం రంజిత్‌రెడ్డి, ఎంపీ చేవేళ్ల