బుధవారం 25 నవంబర్ 2020
Rangareddy - Aug 17, 2020 , 00:27:37

ఏక‌ధాటిగా...

ఏక‌ధాటిగా...

  •  రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 31.1 మి.మీ వర్షపాతం అత్యధికంగా శంకర్‌పల్లిలో 49.9 మి.మీ
  •  నిండుతున్న చెరువులు, కుంటలు, పారుతున్న వాగులు  వికారాబాద్‌ జిల్లాలో దెబ్బతిన్న 51ఇండ్లు 
  • అలుగుపారుతున్న కోట్‌పల్లి, కాకరవేణి ప్రాజెక్టులు
  • అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులనియామకం సహాయక చర్యల కోసం కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూంల ఏర్పాటు
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్డి గ్రామ స్థాయి వరకు అప్రమత్తంగా  ఉండాలని అధికారులకు ఆదేశాలు

మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వానతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో చెరువులు, వాగులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలు ఇండ్లకే పరిమితమవగా, పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అక్కడక్కడా పంట పొలాలు నీటమునిగాయి. మరోవైపు ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయంలో సాయం కోసం రెండు కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇరిగేషన్‌, విద్యుత్‌, మున్సిపల్‌ శాఖలు అప్రమత్తమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా శంకర్‌పల్లిలో 49.9 మి.మీ, వికారాబాద్‌ జిల్లాలో పూడూరు మండలంలో 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మంత్రి సబితారెడ్డి రెండు జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ సూచనలు ఇస్తున్నారు.      

  - రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/వికారాబాద్‌, నమస్తే తెలంగాణ 


రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/షాబాద్‌ : అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో రంగారెడ్డి జిల్లా తడిసిముద్దయింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వం కలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలోని చెరువుల్లోకి వరదనీరు వచ్చి చేరుతున్నది. పం ట పొలాలు అక్కడక్కడ నీటమునిగాయి. పట్టణాలు, పల్లెల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. జిల్లా వ్యా ప్తంగా 50 వరకు ఇండ్లు కూలినట్లు సమాచారం. ఈసీ వాగు పారుతున్నది. ఐదు రోజులుగా జిల్లా వ్యాప్తంగా 3 సెం.మీ లకు పైగా సగటు వర్షపాతం నమోదైంది. 

ఇండ్లకే పరిమితమైన జనాలు

కరోనాకు తోడుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా యంత్రాంగం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసింది. కలెక్టర్‌ కార్యాలయంలో 040-23230813/ 23230817 అనే ఫోన్‌ నెంబర్లను ఏర్పాటు చే శారు. ఏదైనా అత్యవసర అవసరాలకు పై నెంబర్లకు ఫోన్‌ చే యాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ వెల్లడించారు. రుతుపవనాలు చురుకుగా ఉండడంతో మరో 12గంటల పాటు వానలు ఇలాగే కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాకాలం ఆరంభంలో వానలు ముఖం చాటేయడంతో జిల్లాలో 15 మండలాల్లో లోటు వర్షపాతం ఏర్పడింది. జూన్‌ చివరి వారం నుంచి ఆగస్టులో ఇప్పటి వరకు వర్షాలు అనుకున్న స్థాయిలో పడడంతో 23 మండలాల్లో అత్యధికంగా, 4 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నాలుగు సబ్‌ డివిజన్ల పరిధిలోని 2031 చెరువులకుగాను 42 పూర్తిగా నిండగా, మిగతా వాటిలో 25-75 శాతం నీరు చేరింది. 

నిరంతరం అధికారుల పర్యవేక్షణ...

కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆయా శాఖల అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇరిగేషన్‌ అధికారులు నిరంతరం చెరువులు, కాల్వలను పర్యవేక్షిస్తూ కట్టలు తెగకుండా చూసుకుంటున్నారు. ముందస్తుగా ఇసుక బస్తాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. విద్యుత్‌శాఖ అధికారులు కిందిస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తున్నారు. జిల్లాలోని 15 మున్సిపాలిటీల కమిషనర్లు, 560 పంచాయతీల గ్రామ కార్యదర్శులు, 27 మండలాల ఎంపీడీవోలు, తాసిల్దార్లు, వ్యవసాయాధికారులు, ఐదు డివిజన్ల ఆర్డీవోలు తమ సిబ్బందితో ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న డ్రైనేజీల్లో చెత్తను తొలగించి, డ్రైనేజీలు పొంగకుండా చూస్తున్నారు. 

రంగారెడ్డిజిల్లాతో పాటు జిల్లాలోని జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రెస్క్యూ బృందాలతో పాటు రెవెన్యూ, పోలీసు, హెచ్‌ఎండీఏ, విద్యుత్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. 

జిల్లాలో వర్షపాతం

ఆమనగలేకల 15.6మి.మీ, యాచారం 30.9మి.మీ, తలకొండపల్లి 26.8మి.మీ, నందిగామ 32.5మి.మీ, కొందుర్గు 35.7మి.మీ, కందుకూరు 27.1మి.మీ, అబ్దులాపూర్‌మెట్‌ 17.9మి.మీ, హయత్‌నగర్‌ 35.7మి.మీ, కడ్తాల్‌ 26.8మి.మీ, బాలాపూర్‌ 46.1మి.మీ, ఫరూఖ్‌నగర్‌ 30.2మి.మీ, మంచాల్‌ 39.7మి.మీ, శంషాబాద్‌ 36.3మి.మీ, రాజేంద్రనగర్‌ 41.7 మి.మీ, సరూర్‌నగర్‌ 36.4మి.మీ, మహేశ్వరం 42.1మి.మీ, షాబాద్‌ 26మి.మీ, ఇబ్రహీంపట్నం  33.4మి.మీ, కేశంపేట్‌ 6.0మి.మీ, మొయినాబాద్‌ 29.0మి.మీ, మాడ్గుల 28.2 మి.మీ, కొత్తూర్‌ 25.7మి.మీ, శేరిలింగంపల్లి 35.0మి.మీ, గండిపేట్‌ 40.8మి.మీ, చౌదరిగూడ 32.3మి.మీ, చేవెళ్ల 20.4 మి.మీ, శంకర్‌పల్లి 49.9మి.మీ.

వర్షాలతో ముందస్తు చర్యలు

వికారాబాద్‌, నమస్తే తెలంగాణ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.ఇప్పటికే జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేసిన అధికారులు, అనుకోని ప్రమాదాలు జరిగినప్పటికీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 51 ఇండ్లు దెబ్బతిన్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌ వెల్లడించారు. అయితే, జిల్లాలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఏ ఒక్కరికి కూడా ప్రమాదం సంభవించలేదన్నారు. అదేవిధంగా భారీ వర్షాల దృష్ట్యా  కలెక్టర్‌ నోడల్‌ అధికారితో పాటు అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎక్సైజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌ను జిల్లా నోడల్‌ అధికారిగా నియమించారు. మండలాలకు ప్రత్యేకాధికారులుగా... పూడూరుకు జిల్లా వ్యవసాయాధికారి గోపాల్‌, దోమ డీఆర్‌డీవో కృష్ణన్‌, పెద్దేముల్‌ జిల్లా మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్‌, పరిగి డీపీవో రిజ్వానా, కులకచర్ల  జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వినయ్‌కుమార్‌, మోమిన్‌పేట్‌ బాబు మోసెస్‌, నవాబుపేట్‌ జిల్లా సంక్షేమ అధికారి లలితాకుమారి, వికారాబాద్‌ వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ధారూర్‌ డీఈవో రేణుకాదేవి, మర్పల్లి డీహెచ్‌ఎస్‌వో సంజీవ్‌, బంట్వారం డీసీవో లక్ష్మీనారాయణ, దౌల్తాబాద్‌ భూగర్భజల శాఖ అధికారి రామారావు, కొడంగల్‌ కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, తాండూరు పౌరసరఫరాల శాఖ డీఎం విమల, బొంరాసుపేట్‌ జిల్లా బీసీ సంక్షేమాధికారి పుష్పలత, బషీరాబాద్‌ జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి సబిత, యాలాల జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి విజయలక్ష్మి, కోట్‌పల్లి  డీఎస్‌వో రాజేశ్వర్‌, వికారాబాద్‌ డీఎఫ్‌వో వేణుమాధవ్‌, తాండూరు మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా డీవైఎస్‌వో హనుమంత్‌రావు, పరిగి మున్సిపాలిటీకి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, కొడంగల్‌ మున్సిపాలిటీకి పీఆర్‌ ఇఇ మనోహర్‌లను నియమించారు. 

అలుగుపారుతున్న ప్రాజెక్టులు...

జిల్లాలో  మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లా ప్రధాన ప్రాజెక్టులైన కోట్‌పల్లి, కాకరవేణి ప్రాజెక్టులు అలుగు పారుతున్నాయి. మరోవైపు తాండూరులో కాగ్నా నదితోపాటు నవాబుపేట్‌ మండలంలో మూసీ నదులు పొంగిపొర్లుతున్నాయి. చాలా చెరువులు ఇప్పటికే నిండగా, మరికొన్ని చెరువులు అలుగుపారుతున్నాయి. 

జిల్లాలోని ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం 

మర్పల్లి 27.4 మి.మీ, మోమిన్‌పేట్‌ 31 మి.మీ, నవాబుపేట్‌ 27.4 మి.మీ, వికారాబాద్‌ 39.4 మి.మీ, పూడూరు  49.2 మి.మీ, పరిగి 19.4 మి.మీ, కులకచర్ల 48.2 మి.మీ, దోమ 31 మి.మీ, ధారూరు 25.8 మి.మీ, బంట్వారం 31.4 మి.మీ, తాండూరు 22.4 మి.మీ, యాలాల 20 మి.మీ, పెద్దేముల్‌  26.2 మి.మీ, బషీరాబాద్‌ 26 మి.మీ, బొంరాసుపేట్‌ 16 మి.మీ, కొడంగల్‌ 20.8 మి.మీ, దౌల్తాబాద్‌ 21.2 మి.మీ. 

కోట్‌పల్లి ప్రాజెక్టులోకి పర్యాటకులకు అనుమతి రద్దు

ధారూరు : మూడు నాలుగు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు ఆదేశించారు. ఆదివారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్‌, దోర్నాల్‌ వాగు వంతెన రోడ్లను అదనపు కలెక్టర్‌ మోతీలాల్‌, వికారాబాద్‌ ఆర్డీవో ఉపేందర్‌రెడ్డిలతో కలిసి పరిశీలించారు. వర్షాలకు కొట్టుకుపోయిన రుద్రారం-నాగసముందర్‌ వాగు వంతెన, స్టేషన్‌ ధారూరు- దోర్నాల్‌ మధ్య ఉన్న కాగ్నానది వంతెన వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు మాట్లాడుతూ  వర్షాలకు కొట్టుకుపోయిన దోర్నాల్‌ వాగు  వంతెనపై ఇసుకతో బ్యాగులు నింపి తాత్కాలికంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని ఆధికారులను ఆదేశించారు. నాగసముందర్‌ వాగులో ఎక్కువ నీరు ప్రవహిస్తున్నందున నీరు తగ్గిన తర్వాత మరమ్మతులు చేపట్టాలన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టులో భారీగా నీరు ఉండడంతో నాలుగు రోజుల పాటు ప్రాజెక్టులోకి ఎవరిని అనుమతించరాదని ఆదేశించారు. దోర్నాల్‌ కాగ్నా నది వద్ద విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. ముంపు గ్రామాలు ఉంటే వారిని వేరే ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వీరి వెంట ఈఈ సుందర్‌, ధారూరు ఎంపీడీవో అమృత, తాసిల్దార్‌  భీమయ్యగౌడ్‌, నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్‌అండ్‌బీ అధికారులు ఉన్నారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు మరమ్మతులు

కలెక్టర్‌ ఆదేశించిన వెంటనే దోర్నాల్‌ కాగ్నా నది తాత్కాలిక వంతెన పనులను అధికారులు ప్రారంభించారు. తాత్కాలికంగా రవాణా సౌకర్యానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ తాత్కాలిక వాగు వంతెన పనులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. వాగు వద్ద విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు.

శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించాలి 

పహాడీషరీఫ్‌ : శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో ఎవరూ లేకుండా చూడాలని మంత్రి సబితారెడ్డి వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. రెండు రోజులుగా నిరవధికంగా కురుస్తున్న వర్షాలకు జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని  బిస్మిల్లాకాలనీలో రెండు రేకుల ఇండ్ల గోడలు కూలాయి. ఈ సందర్భంగా ఆదివారం  మంత్రి ఆ కాలనీలో పర్యటించి కూలిన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబానికి రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించాలన్నారు. వారు ఇండ్లలో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కూలిన ఇండ్ల బాధితుల ఆధార్‌కార్డు సేకరించి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ జి. పి కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. లోతట్ట ప్రాంతాలలో, చెరువు పరివాహక ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసుశాఖలకు ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తగ్గేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.