శనివారం 29 ఫిబ్రవరి 2020
పల్లెల్లో ప్రచార హోరు..

పల్లెల్లో ప్రచార హోరు..

Feb 13, 2020 , 23:38:08
PRINT
పల్లెల్లో ప్రచార హోరు..

సహకార సంఘం ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం ఎన్నికలు జరుగనుండడంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలుస్తూ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. మహిళా రైతు ఓట్లు కూడా అధికంగా ఉండడంతో వారినీ ప్రసన్నం చేసుకునేందుకు శ్రమిస్తున్నారు. తమ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారు. చైర్మన్‌ అభ్యర్థులు సైతం తమ అనుకూల డైరెక్టర్లను గెలిపించుకోవడం కోసం అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. మరోవైపు క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. పలుచోట్ల ఏకగ్రీవమైన డైరెక్టర్లతో పాటు ఓటర్లనూ క్యాంపులకు తరలించి రాచమర్యాదలు చేస్తున్నారు. పోలింగ్‌ రోజున నేరుగా తీసుకువచ్చి ఓటు వేసేలా చూసుకుంటున్నారు. ఇక, ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇచ్చేందుకు మంత్రులు సబితారెడ్డి, మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.


సహకార ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే విజయం

-  సర్పంచ్‌ల సంఘం      మండలాధ్యక్షుడు సంతోశ్‌నాయక్‌

-సంఘం ఎన్నికలకు ముమ్మరంగా ప్రచారం


కొత్తూరు: సహకార సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుభీ మోగిస్తుందని సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు సంతోశ్‌నాయక్‌ అన్నారు. సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా మండలంలోని కొడిచర్ల, కొడిచర్లతండా, ఖాజీగూడతండాల్లో మేకగూడ సహకారం సంఘం 7వ, 8వ, 9వ వార్డుల అభ్యర్థులు బల్వంత్‌రెడ్డి, కొర్ర తౌర్య, సీహెచ్‌ నారాయణరెడ్డిలకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ అమృత మోహన్‌నాయక్‌, నాయకులు దన్నాడ జంగయ్యయాదవ్‌, బిచ్చ్యనాయక్‌, గోపాల్‌నాయక్‌, రఘునాయక్‌, దేవ్యనాయక్‌ పాల్గొన్నారు. 

నందిగామలో

మండలంలోని చేగూరు, మేకగూడ, నందిగామ గ్రామాల్లోని సహకారం సంఘాల్లో డైరెక్టర్లకు 15న ఎన్నికలు జరుగుతున్నాయి. డైరెక్టర్‌ పదవులకు నామినేషన్లు వేసిన అభ్యర్థులు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గురువారం ఆయా గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓటర్లు వివరిస్తూ టీఆర్‌ఎస్‌ మద్దతుదారులకు ఓటేసి గెలిపించాలని కోరారు. 

కేశంపేట

మండలంలోని కొత్తపేట సింగిల్‌విండో ఎన్నికల ప్రచారాన్ని అభ్యర్థులు ముమ్మరంగా సాగిస్తున్నారు. వార్డుల్లో తమ మద్దతుదారులతో కలిసి రైతుల ఇండ్లకు వెళ్లి తమకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. అన్ని వార్డుల్లో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం కొనసాగిస్తున్నారు. గురువారం ఎన్నికల ప్రచారానికి చివరిరోజు కావడంతో అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మద్దతుదారులతో పాటు రైతులు పాల్గొన్నారు. 


పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత 

- ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో      భాగస్వాములు కావాలి 

-ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ 

షాద్‌నగర్‌టౌన్‌: పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యతని, మున్సిపాలిటీలో చేపడుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ అన్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా మున్సిపాలిటీలోని 3వ వార్డులో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను మున్సిపల్‌ చైర్మన్‌ కొందూటి నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌తో కలిసి పరిశీలించారు. మున్సిపల్‌ కార్మికులతో కలిసి పిచ్చి మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల్లో రోజు వారీగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, స్థానికులు, యువత, అందరూ పాల్గొని, కాలనీలను శుభ్రం చేసుకోవాలన్నారు. కాలనీల్లో ఎక్కడా ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాలనీవాసులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డులోని చెత్తం తొలగింపు, పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వీధులు, మురుగుకాల్వలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం చేపడుతున్నట్లు అందరూ గ్రహించాలన్నారు.

ఆదర్శ మున్సిపాలిటే ధ్యేయం 

షాద్‌నగర్‌ను ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడమే ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలతో షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని ప్రతి వార్డు సుందరంగా మారుతుందన్నారు. మున్సిపల్‌ కార్మికులు కాలనీలను శుభ్రం చేయాలని, కాలనీల్లో ఎక్కడా ఎలాంటి చెత్త లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. మున్సిపల్‌ కార్మికులతో కలిసి పిచ్చి మొక్కలు తొలగించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు, టీఆర్‌ఎస్‌ నాయకులు నారాయణరెడ్డి, సుదర్శన్‌, రాజు, వెంకటయ్య, జంగయ్య పాల్గొన్నారు.  


logo