సోమవారం 06 ఏప్రిల్ 2020
Rangareddy - Jan 31, 2020 , 01:01:11

సహకార పోరుకు సన్నద్ధం

సహకార పోరుకు సన్నద్ధం
  • ఎన్నికల షెడ్యూల్‌ విడుదల
  • ఫిబ్రవరి 3న నోటిఫికేషన్‌.. 15న ఎన్నికలు
  • రంగారెడ్డి జిల్లాలో 37 పీఏసీఎస్‌లు మొత్తం 82,627 మంది ఓటర్లు
  • 481 మంది డైరెక్టర్ల ఎన్నికకు 37 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు
  • మేడ్చల్‌ జిల్లాలో 9 సహకార సంఘాలు
  • మొత్తం11,586 మంది ఓటర్లు

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ :  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 15న ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు ఎన్నికలు, అదే రోజు మధ్యాహ్నం నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు. రంగారెడ్డి జిల్లాలో 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) పరిధిలో 82,627  మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 481 మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 9  సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటి పరిధిలో 116 వార్డులుండగా, సుమారు 11,586  మంది ఓటర్లున్నారు. 


సహకార సంఘాల ఎన్నికలకు  నగారా మోగింది. షెడ్యూల్‌ విడుదల కావడంతో సహకార శాఖ యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ ప్రక్రియలో భాగంగా సహకార సంఘాల ఓటర్ల(రైతుల) జాబితా ప్రకటించారు. గతేడాది ఫిబ్రవరిలో పీఏసీఎస్‌ల పదవీ కాలం ముగియగా... సాధారణ ఎన్నికలు తదితర కారణాల నేపథ్యంలో ప్రభుత్వం రెండుసార్లు పదవీ కాలాన్ని పొడిగించింది.


37 సొసైటీల పరిధిలో 1.56 లక్షల సభ్యులు

జిల్లాలో మొత్తం 38 పీఏసీఎస్‌లు ఉండగా.. మామడిపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పనితీరు సక్రమంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో మిగతా 37 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి సహకార సంఘ కార్యాలయంలో ఒకటి చొప్పున మొత్తం 37 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటి పరిధిలో ఓటర్లుగా ఉన్న రైతులు 481మంది డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. జిల్లాలో 37 సొసైటీల పరిధిలో ఇప్పటి వరకు 1.56 లక్షల మంది రైతులు సభ్యులుగా నమోదయ్యారు. వీరిలో 87,627మంది సభ్యు లు మాత్రమే ఓటు వేయడానికి అర్హులని సహకార శాఖ అధికారులు వెల్లడించారు. 


పీఏసీఎస్‌కు 18 మంది ప్రతినిధులు... 

ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం ప్రతి పీఏసీఎస్‌కు 13 మంది ప్రతినిధులను ఎన్నుకుంటారు. ఎస్సీ-1, ఎస్సీ మహిళ-1, ఎస్టీ-1, బీసీ-2, ఓసీ-7, ఓసీ మహిళ-1 ఎన్నికల ద్వారా ఎన్నుకోబడుతారు. ఆ తర్వాత నామినేటెడ్‌గా 5 మందిని మహిళ-2, మైనార్టీ-1, అధికారులు-2 రిజిస్టర్‌ నామినేట్‌ చేస్తారు. మొత్తం ఒక సంఘంలో 18 మంది పాలక వర్గ సభ్యులు ఉండనున్నారు. 


4న అధికారులకు శిక్షణ 

సొసైటీ ఎన్నికలకు సంబంధించి వచ్చేనెల 4న ఎన్నికల అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు అక్షరమాల ప్రకారం బ్యాలెట్‌ పే పరు ఉండనున్నది. పరోక్ష పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికల ఉంటుంది.


మేడ్చల్‌ జిల్లాలో..

మేడ్చల్‌ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : మేడ్చల్‌ జిల్లాలో మొత్తం సహకార సంఘాలకు ఎన్నికలు జరుగనున్నాయి. వీటి పరిధిలో 116 వార్డులుండగా, వీటి పరిధిలో అర్హత కలిగిన సుమారు 11,586  మంది ఓటర్లున్నారు. 


15వ తేదీన ఎన్నికలు...

 ఫిబ్రవరి 3వ తేదీన జిల్లా ఎన్నికల నిర్వహణ బాధ్యులు ఎన్నికల నోటీసును విడుదల చేస్తారు. అర్హులైన సభ్యుల నుంచి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నామినేషన్స్‌ స్వీకరిస్తారు. 9వ తేదీన నామినేషన్‌ పరిశీలన, 10వ తేదీన నామినేషన్ల ఉప సంహరణ ఉంటుందని, అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయిస్తారు. ఫిబ్రవరి 15వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌, అదేరోజు మధ్యాహ్నం నుంచి ఓట్ల లెక్కింపును పూర్తిచేసి ఫలితాలను కూడా వెల్లడించనున్నారు. ఎన్నికల అధికారి ఫలితాలపై డిక్లరేషన్‌ ప్రకటించిన మూడు రోజుల్లో ఆఫీస్‌ బేరర్లను నియమించనున్నారు. logo