రంగారెడ్డి, మే 12 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలో పోలీసులు సోమవారం హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అడుగడుగునా బాంబు, డాగ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న అందాల పోటీలకు వివిధ దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు సోమవారం నాగార్జునసాగర్ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా వారు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా బొంగుళూరు ఎగ్జిట్ నంబర్ 12 వద్ద దిగారు. అక్కడి నుంచి బొంగుళూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మాల్, చింతపల్లి, మల్లేపల్లి, అంగడిపేట, పెద్దవురం మీదుగా నాగార్జునసాగర్‌కు వెళ్లారు.
సుమారు వంద కిలోమీటర్ల దూరం వరకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు, మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ముఖ్యమంత్రి, గవర్నర్లకు కల్పించే సెక్యూరిటీ ఇచ్చారు. సుమారు పది ఎస్కార్ట్ వాహనాల మధ్య మూడు ప్రత్యేక బస్సుల్లో వారిని నాగార్జునసాగర్‌కు తరలించారు. రోడ్డుపై వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. అదేవిధంగా తిరిగి వారు సా యంత్రం హైదరాబాద్‌కు వచ్చేవరకు ఈ బందోబస్తు కొనసాగింది. సుందరీమణుల రాకపోకల సందర్భంగా రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలను నిలిపేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారిలోని యా చారం ఠాణా సమీపంలో ఓ కల్వర్టు కింద ఓ సంచి లో పేలుడు పదార్థాలకు ఉపయోగించే వైరు సోమవారం బాంబుస్క్యాడ్ తనిఖీల్లో లభ్యమైంది. కాగా, పోలీసులు అందాల తారలు నాగార్జునసాగర్ సందర్శనకు వెళ్తున్న నేపథ్యంలో బొంగుళూరు గేటు ఓఆర్ఆర్ నుంచి నాగార్జునసాగర్ వరకు సాగర్ రహదారిలోని ప్రతి కల్వర్టును క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా ఈ వైరు ఓ సంచిలో బయటపడింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడి.. ఈ వైరు ఎక్కడిదన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బండరాళ్లను పగులగొట్టేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను ఉపయోగిస్తున్నారు.
ఆ పేలుడు పదార్థాలకు సంబంధించిన వైరా…లేక సాగర్ రహదారిపై పలువురు ప్రముఖులు రాకపోకలు సాగిస్తుంటారు.. వారిని టార్గెట్‌గా చేసి ఈ వైరును దాచిపెట్టారా..? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రపంచ సుందరి పోటీలు హైదరాబాద్‌లో జరుగుతుండగా.. ఆ పోటీలకు వచ్చిన సుందరీమణులు నాగార్జునసాగర్‌కు వెళ్తున్న క్రమంలో ఈ వైరు బయటపడడంతో పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆ వైరు లభ్యమైన పత్రాన్ని ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు, బాంబు స్వ్యాడ్ ఏసీపీలు పరిశీలించారు. ఈ కల్వర్టుతోపాటు ఈ ప్రాంతంలోని మరిన్ని కల్వర్టులు, ఇతర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.