రంగారెడ్డి జిల్లాలో..
రంగారెడ్డి, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ): జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు జిల్లాలో ప్రధానమైన మూసీ, ఈసీ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆమనగల్లు, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని పలు చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి.
మాడ్గుల మండలంలో అత్యధిక వర్షపాతం..
జిల్లాలోని మాడ్గుల మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 14 మి.మీటర్లు, కొత్తూరు 35.9 మి.మీ, నందిగామ 41.5 మి.మీ, ఫరూఖ్‌నగర్ 23.6 మి.మీ, చౌదరిగూడ 16.8 మి.మీ, కొందుర్గు 46.8 మి.మీ, షాబాద్ 41 మి.మీ, చేవెళ్ల 59.3 మి.మీ, మొయినాబాద్ 19.4 మి.మీ, మహేశ్వరం 29.1 మి.మీ, కందుకూరు 38.7 మి.మీ, కడ్తాల్ 35.6 మి.మీ, కేశంపేట 34.4 మి.మీ, తలకొండపల్లిలో 59.1 మి.మీ, ఆమనగల్లు 31.4 మి.మీ, మాడ్గుల 65.7 మి.మీ, యాచారం 27.2 మి.మీ, మంచాల 34.9 మి.మీ, ఇబ్రహీంపట్నం 36.4 మి.మీ, సరూర్‌నగర్ 9.6 మి.మీ, రాజేంద్రనగర్ 16.3 మి.మీ, గండిపేట 24.4 మి.మీ, శేరిలింగంపల్లి 14.1 మి.మీ, శంకర్పల్లి 14.6 మి.మీ, బాలాపూర్ 12.8 మి.మీ, హయత్‌నగర్‌లో 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 18 మండలాల్లో అధికంగా, 9 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జూన్, జూలై మాసాల్లో సాధారణ వర్షపాతానికి మించి 22.3 మి.మీటర్లు అధికంగా కురిసింది. జూన్‌లో సాధారణ వర్షపాతం 91.3 మి.మీ కాగా 90.3 మి.మీ, జూలైలో సాధారణం 153 మి.మీ. కాగా 315.8 మి.మీ., ఆగస్టులో సాధారణం 140.9 మి.మీటర్లు కాగా ఇప్పటివరకు 138 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈసారి కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుం టలు నిండాయి. దీంతో పంటలకు మేలు చేకూ రుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్‌లో..
జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 608.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు ఉరకలేస్తున్నాయి. పంటలు నీట మునిగాయి. కాగ్నా, కాకరవేణి, జుంటుపల్లి, లక్నాపూర్, శివసాగర్, కోట్‌పల్లి, సర్పన్‌పల్లి, శ్రీంరానగర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. చెక్‌డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. కొంపల్లి చెరువు, నందివాగు, కొడంగల్ పెద్ద చెరువు, హస్నాబాద్ చెరువు, పెద్ద నందిగామ చెరువు, ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని 14 మండలాల్లో అధికంగా, నాలుగు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
నిండిన చెరువులు..
జిల్లాలోని 18 మండలాల్లో 1196 చెరువులు ఉన్నాయి. వీటిలో 25 శాతం 242, 50శాతం 245, 75 శాతం 236, వంద శాతం 319 నిండాయి. 154 చెరువులు అలుగు పోస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. రెండు రోజుల పాటు కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతగిరి కొండల మీదుగా జలపాతం పారుతున్నది. వికారాబాద్, తాండూరు డివిజన్ల పరిధిలో కురుస్తున్న వర్షాలకు ఈసీ, మూసీ నదుల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది.
అధిక వర్షపాతం నమోదు..
జిల్లాలోని కుల్కచర్లలో 65.2 మి.మీటర్లు, దోమ 47.9మి.మీ, బంట్వారం 43.9మి.మీ, తాండూరు 37.9మి.మీ, మోమిన్‌పేట్ 32.8మి.మీ, యాలాల 30.3మి.మీ, కొడంగల్ 29.9మి.మీ, పెద్దేముల్ 29.8మి.మీ, పూడూరు 28.7మి.మీ, బషీరాబాద్ 26.9మి.మీ, కోట్‌పల్లి 26.6మి.మీ, ధారూరు 24.4మి.మీ, దౌల్తాబాద్ 22.1మి.మీ, నవాబ్‌పేట 18.7మి.మీ, వికారాబాద్ 16.8మి.మీ, మర్పల్లిలో 13.2 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 19 మండలాల్లో 484.4 మి.మీ నమోదు కావాల్సి ఉండగా 608.5 మి.మీ వర్షపాతం నమోదైంది. శనివారం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. కాల్వలు, రోడ్లు తేడా లేకుండా వర్షపు నీటితో నిండిపోయాయి.