ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 4 : దేవుడు, గురువు పక్కనే ఉంటే… నేను మొదట గురువుకే నమస్కరిస్తా.. అన్నాడు.. ఓ మహానుభావుడు కబీర్దాస్. ఎందుకంటే భగవంతుడున్నాడని తనకు గురువే ముందు చెప్పాడని వివరించాడు. సమాజంలో గురువుకు ఉన్న స్థానం అంత గొప్పది. మనిషిలో అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞాన దీప్తిని వెలిగించేవాడు గురువు. అలాంటి గురువును దైవం కంటే మిన్నగా ఆరాదించే సంస్కృతి మనది. ఏటా సెప్టెంబర్ 5న అందుకే ఉపాధ్యాయదినోత్సవంగా నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా గురువు గొప్పదనం ఉపాధ్యాయ దినోత్సవం నాడు తెలుసుకోవటం ఆనవాయితీగా వస్తుంది. భారతరత్న, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. అప్పటి కేంద్ర ప్రభుత్వం రాధాకృష్ణ పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి గౌరవిస్తున్నది.
గురువుకు ప్రాముఖ్యత..
మారుతున్న సమాజానికనుగుణంగా ప్రభుత్వాలు గురువుకున్న ప్రాముఖ్యతను గుర్తించి సమాజంలో వారికున్న గౌరవాన్ని గుర్తించి తగిన వేతనాలు అందిస్తూ మంచి గుర్తింపులోకి తీసుకువచ్చాయి. పరిస్థితులు మారుతున్నప్పటికీ గురువులకు ఆదరణ అంతేస్థాయిలో లభిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రైమరీస్కూల్, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక్క అప్పర్ప్రైమరీస్కూల్, ఐదు కిలోమీటర్లకు ఒక్క హైస్కూల్ ఏర్పాటు చేసింది. పాఠశాలల ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కూడా అంతేస్థాయిలో కల్పించింది. మరోవైపు పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ పాఠశాలలకు మంచి ఆదరణ లభించింది. విద్యను ప్రైవేటులో కొనలేనివారికి ప్రభుత్వ పాఠశాలలు ఎంతగానో ఉపయోగపడుతున్నది.
ప్రస్తుతం విద్యలేనివారు మహాఅరుదు..
గతంలో పాఠశాలలు అందుబాటులోలేక…తగినంతమంది ఉపాధ్యాయులు లేక…ఆర్థిక వెనుకబాటు వంటి పరిస్థితుల్లో అనేకమంది విద్యకు నోచుకోలేకపోయారు. పదోతరగతి పూర్తిచేయటమే గతంలో గగనంగా ఉండేది. ఆ పరిస్థితి నుంచి నేడు ప్రతి ఇంటి నుంచి తమ పిల్లలను పాఠశాలల్లో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. పిల్లలను పాఠశాలలో చేర్పించటంలో ఉపాధ్యాయుల కృషి ఎంతోఉంది. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులు, మెరుగైన విద్య, మధ్యాహ్న భోజనం తదితర సౌకర్యాలతో విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నది.
ఉత్తములుగా తీర్చిదిద్దేది గురువులే..
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దటం, వారిలో నైపుణ్యతను పెంచటం, వారిని సన్మార్గంలో నడిపించటం ఉపాధ్యాయుల కృషి మరువలేనిది. అలాంటి ఉపాధ్యాయుడు కనబడగానే వారికి నమస్కారం చేసి గౌరవించుకుంటాం. ఉపాధ్యాయులను గురువులతో సమానంగా భావించి సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక
పరిగి, సెప్టెంబర్ 4 : జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు వికారాబాద్ జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాస్థాయిలో 75 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేశామన్నారు. జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సోమవారం 10.30 గంటలకు వికారాబాద్‌లోని జిల్లా సమీకృత కలెక్టరేట్లో సన్మానించనున్నట్లు డీఈవో పేర్కొన్నారు.
ఉపాధ్యాయులతో సమ సమాజ నిర్మాణం
మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయుడు సమాజానికి దగ్గర కావల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక యుగంలోనూ గురువును దైవంగా భావిస్తున్న తరుణంలో ఆ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి ఉపాధ్యాయులు పనిచేయాలి. ప్రస్తుత పాలకులు ప్రతిఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించటానికి పెద్ద ఎత్తున పాఠశాలలు ఏర్పాటు చేసి మౌలిక వసతులు కల్పిస్తూ అవసరమైనంత మంది ఉపాధ్యాయులను అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో ఉపాద్యాయుడు నాణ్యమైన విద్యను అందించటంతో పాటు వారిని సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.
– వర్కాల పరమేష్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత
ఉపాధ్యాయ వృత్తిలోకి రావటం గర్వంగా ఉంది
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనది. గతంలో పాఠశాలలకు వెళ్లాలంటే సైకిళ్లపై కిలోమీటర్ల దూరం వెళ్లేవాళ్లం. గ్రామంలో కూడా ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు ఉండేది. అప్పట్లో వసతులు, ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ మంచి విద్యనందించాం. ప్రస్తుతం మారిన పరిస్థితుల వలన పాఠశాలల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ఉపాధ్యాయులు కూడా పెరిగారు. మారుతున్న సమాజంలో కూడా ఉపాధ్యాయుడికి వస్తున్న గౌరవం వెలకట్టలేనిది.
– బుగ్గరాములు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు