శుక్రవారం 30 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Sep 17, 2020 , 02:52:34

ఉప్పొంగిన వాగులు, వంకలు

ఉప్పొంగిన వాగులు, వంకలు

గంగాధర: మండలంలోని ఆయా గ్రామాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. గట్టుభూత్కూర్‌, గర్శకుర్తి, కాసారం, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్‌ చెరువులు మత్తడి దుంకుతున్నాయి.  హిమ్మత్‌నగర్‌-గట్టుభూత్కూర్‌, తాడిజెర్రి-గట్టుభూత్కూర్‌, గర్శకుర్తి-కాసారం, కురిక్యాల-ఉప్పరమల్యాల, గంగాధర-లక్ష్మీదేవిపల్లి గ్రామాల మధ్య రోడ్లపై వరద నీరు ప్రవహించడంతో ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.  మల్లాపూర్‌లో పలు ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో సామగ్రి తడిసింది.  పంట చేలు నీట మునిగాయి. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ నుంచి బల్వంతాపూర్‌ వెళ్లే కాలువ నిండుగా ప్రవహిస్తుండగా,  అక్కడక్కడ గండి పడే అవకాశం ఉండడంతో ఎస్‌ఐ తాండ్ర వివేక్‌ ఆధ్వర్యంలో రైతులు బండలు, మట్టి పోశారు. 

రామడుగు: మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రామడుగు శివారులోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పైనుంచి వస్తున్న వరదతో వెలిచాల పెద్ద చెరువు, చిన్న చెరువు అలుగు పారుతుండగా కొత్తపల్లి, వెలిచాల మధ్య రొడ్డాం నిండుగా ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. గుండి చెరువు మత్తడి దుంకుతున్నది. గుండి-గోపాల్‌రావుపేట మధ్య కల్వర్టుపై నుంచి నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.