న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్లయిన కొవిషీల్డ్, కొవాగ్జిన్లతో రక్తం గడ్డకట్టే ముప్పేమీ లేదని అత్యున్నత ప్రభుత్వ ప్యానెల్ ఒకటి స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ల వల్ల రక్తం గడ్డ కడుతోందంటూ వాటిపై పలు యురోపియన్ దేశాలు నిషేధం విధించిన నేపథ్యంలో ఈ ప్యానెల్ నివేదికకు ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అటు యురోపియన్ వైద్య నియంత్రణ సంస్థ కూడా ఈ వ్యాక్సిన్ పూర్తి సురక్షితమైనదని తేల్చడంతో ఆస్ట్రాజెనెకాను మళ్లీ వాడతామని ఆయా దేశాలు ప్రకటించాయి. ఇండియాలో ఈ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్నే కొవిషీల్డ్ పేరుతో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది.
ఈ వ్యాక్సిన్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీ విచారణ జరిపింది. వ్యాక్సినేషన్ తర్వాత కొంతమంది ఎదుర్కొన్న తీవ్ర పరిణామాలపై ఈ కమిటీ అధ్యయనం జరిపింది. ఇలాంటి 400 కేసులను విశ్లేషించిన తర్వాత ఈ వ్యాక్సిన్ల వల్ల రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటివి జరగడం లేదని తమ నివేదికలో కమిటీ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని నిర్ణయించింది. గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వ్యాక్సిన్‌కు క్లీన్చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ దేశంలో 5 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఇచ్చారు. జులైలోపు 30 కోట్ల మందికి వ్యాన్సిన్ ఇవ్వాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.