తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య శ్రీవారి ఆలయంలోని ఐనా మహల్ ముఖ పండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్వపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. రాత్రి 7 గంటలకు ఆలయంలో బంగారు తిరుచ్చి ఉత్సవం, రాత్రి 8.00 నుండి 9.00 గంటల మధ్య ధ్వజావరోహణంతో శ్రీ వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగియనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన అన్ని సేవలు సఫలమై.. లోకం క్షేమంగా ఉండాలని ఈ చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారు. ఉత్సవాలు ఒక యజ్ఞమే కనుక – యజ్ఞాంతంలో అవభృథస్నానం చేస్తారు. యజ్ఞనిర్వహణంలో జరిగిన చిన్నచిన్న లోపాల వల్ల ఏర్పడే దుష్పరిణామాలు తొలగి, అన్నీ సంపూర్ణ ఫలాలు చేకూరడం కోసం చేసే దీక్షాంతస్నానం అవభృథం. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవయజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారు. విషమృత్యు నాశనం, రాజ్యపదవుల వంటి సకల ఐహిక శ్రేయస్సులు పొందుతారు. పరాంతకాలం వరకూ ఎటువంటి జనన, మరణ వికారములు లేకుండా సర్వలోకాలలో యథేచ్ఛగా విహరిస్తూ బ్రహ్మానందాన్ని పొంది శాశ్వతమైన విష్ణులోకాన్ని చేరుకొంటారు.