బుధవారం 25 నవంబర్ 2020
Peddapalli - Jun 06, 2020 , 01:01:41

‘గిర్నాటి’ సోదరుల

‘గిర్నాటి’ సోదరుల

ఆకుకూరల సేద్యం

ముప్పైఏళ్లుగా నలుగురు అన్నదమ్ముల సేంద్రియ సాగు

తలా 25గుంటల్లో సీజన్‌బట్టి పంటలు

నెలకు 20వేలపైనే ఆదాయం

అందరూ ఒకే పంట వేసి మార్కెట్లో డిమాండ్‌ లేక తండ్లాడుతున్న రోజుల్లో సంప్రదాయ సేద్యంలో రాణిస్తున్నారీ పెద్దపల్లి మండలం బంధంపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములు. పుష్కలమైన నీటి వనరులున్నా వాణిజ్య పంటల వైపు వెళ్లకుండా 30 ఏండ్లుగా సేంద్రియ విధానంలో ఆకు కూరలు సాగు చేస్తూ లాభాల పంట పండిస్తున్నారు. వారసత్వంగా వచ్చింది తలా 25 గుంటల స్థలమే అయినా తమకున్న తెలివితో ఒక్కొక్కరు నెలకు 20వేలపైనే సంపాదిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

- పెద్దపల్లి రూరల్‌

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది బంధంపల్లి. ఆ గ్రామంలో ఆకుకూరలకు ఫేమస్‌ గిర్నాటి రాయమల్లు, ఓదెలు, రాజయ్య, రాజేశం అన్నదమ్ములు. 30 ఏళ్ల క్రితం తమ తల్లిదండ్రుల నుంచి వచ్చిన 2.5 ఎకరాల భూమిని పంచుకోగా, తలా 25 గుంటలు వచ్చింది. అప్పటి సంది ఆ భూమిలో లాభాల పంట పండిస్తున్నారు. నలుగురు అన్నదమ్ములు వేర్వేరుగా ఉంటూ, ఏడాది పొడువునా తమ కుటుంబాలతో కలిసి సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. సీజన్‌ను బట్టి తోట కూర, పాలకూర, కొత్తిమీర, మెంతి, తదితర ఆకు కూరలు వేస్తున్నారు. పూర్తిగా సేంద్రియ సేద్యం చేస్తున్నారు. పంటకు పశువుల పేడ, మూత్రంతో తయారు చేసిన ఎరువులను మాత్రమే వినియోగిస్తారు. 

నెలకు 20వేల పైనే ఆదాయం.. 

వీరు ఏడాది పొడవునా ఆకు కూరలను సాగు చేస్తున్నారు. ఎప్పుడూ చేతినిండా పనితో బిజీగా ఉంటారు. తమ కుటుంబ సభ్యులతో ఉదయాన్నే చేనుకుపోయి పంటను చూసుకుంటారు. సాయంత్రం ఆకు కూరలు కోసి కట్టలుగా కట్టి, పెద్దపల్లి, గోదావరిఖని, ఎన్టీపీసీ, రామగుండం ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న ఆకుకూరలు కావడంతో మార్కెట్లో డిమాండ్‌ ఉంటుంది. ఒక్కో కుటుంబానికి నెలకు 20వేలకుపైనే ఆదాయం వస్తున్నది.