‘తెలంగాణలో పౌరుషానికి ప్రతీక మోతుకు పువ్వు’ అంటుంటారు జాన పదులు. అన్ని కాలల కవులు, రచయితలు.. తమ కథలు, కవితలు, నవలలతో పాటు తెలంగాణ విప్లవ సాహిత్యంలోనూ మోతుకుపువ్వు ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ పదబంధంలో మోతుకు పువ్వు అంటే మోదుగుపువ్వు. తెలంగాణ గ్రామీణ జీవితాల్లో మోదుగాకు, తునికాకు, టేకాకు ఓ భాగం. ప్రాంతాలనుబట్టి ఈ పువ్వును గోగు పువ్వు/ బసంతం/ మోత్క పువ్వు/ మోదుగ పువ్వు/ గొలంగరి పువ్వు అని పిలుస్తుంటారు. రసాయన రంగులు లేని కాలంలో హోలీ ఆడాలంటే మోదుగు పువ్వుదే సంబురం. వీటి ఆకులతో ఇస్తర్లు, డొప్పలు కుడతారు. మోదుగు చెట్టు కాముని పున్నమికి పూలు పూస్తుంది. చెట్టు మీద అన్ని ఆకులూ రాలిపోయి నిండా పూలు మాత్రమే ఉంటాయి. దూరం నుంచి చూస్తే చెట్టు నుంచి అగ్ని కీలలు ఎగసిపడుతున్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ చెట్టును ఇంగ్లిష్లో ‘Flame of the Forest’ అంటారు.