పలుకుబడులు – తను(లు)గు ఉందని బర్రెను కొన్నట్టు
కొంత ఉన్నా చాలు.. ఎంతో ఉన్నట్టు అతి చేస్తుంటారు. ఉన్నదాన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం తెలియక.. తప్పుడు నిర్ణయాలతో తలకు మించిన ఖర్చులు చేస్తుంటారు.
కొంత ఉన్నా చాలు.. ఎంతో ఉన్నట్టు అతి చేస్తుంటారు. ఉన్నదాన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం తెలియక.. తప్పుడు నిర్ణయాలతో తలకు మించిన ఖర్చులు చేస్తుంటారు. అలాంటివారిని ఉద్దేశించి పెద్దలు చెప్పిన సామెతే ఇది. తనుగు అనేది పశువులను కట్టేసే తాడు. తన దగ్గర ఓ తనుగు ఉంది కాబట్టి, అప్పులు చేసి, వడ్డీలకు డబ్బులు తెచ్చి ఏకంగా బర్రెను కొన్నాడట ఓ వ్యక్తి. తాడు విలువ వందల్లో ఉంటే.. బర్రె విలువ వేలల్లో ఉంటుంది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో డబ్బు వృథా చేసేవారు ఎంతోమంది. ఇలాంటి అర్థాన్నే ఇచ్చే సామెతలు.. ‘గుండి దొరికిందని అంగి కుట్టించుకున్నాడట’, ‘నాడ దొరికిందని గుర్రం కొన్నట్టు’, ‘చారాన కోడికి బారాన మసాలా’, ‘మొగులు చూసి బిందె పారపోసినట్టు’. అందుకే ఏ పనిచేసినా మనకు, మన కుటుంబానికి, మనచుట్టూ ఉన్న సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనే కోణంలోనే ఆలోచించాలని చెబుతారు పెద్దలు.
మన సామెతలు – యసనం ఏడూళ్ల ప్రయాణం మార్చుకోలేని
అలవాటు ఏదైనా యసనం (వ్యసనం) కిందికే వస్తుంది. దానిలోనే మునిగి తేలేవారు, దాని కోసమే పరితపించేవారు, అదే జీవితంగా బతికేవారు .. తాము కోరుకున్నది సమయానికి దక్కకపోతే నానా హైరానా పడుతుంటారు. అది ఫలానా చోట మాత్రమే దొరుకుతుందని తెలిస్తే.. క్షణం కూడా ఆలోచన చేయకుండా అటువైపు పరుగులు తీస్తుంటారు. అలాంటి వ్యక్తుల గురించి, ఆ బానిస తత్వాన్ని గురించి సవివరంగా చెప్పిన సామెత ‘యసనం (వ్యసనం) ఏడూళ్ల ప్రయాణం’. మనసుకు నచ్చింది మందైనా, మత్తుపదార్థమైనా, ఆహారమైనా.. పిచ్చిగా అలవాటుపడితే వ్యసనంగానే భావించాల్సి ఉంటుంది. నచ్చింది ఎక్కడున్నా సరే.. వెతుక్కుంటూ వెళ్తారు. ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, బాధలు పలకరించినా, చివరికి ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినా లెక్కచేయరు. ఆ మోజులోపడి.. కన్నవారిని, బంధుమిత్రులను సైతం మర్చిపోతారు. ఇప్పటికీ ఎంతోమంది యువత అలాంటి తీరొక్క మైకంలో తలమునకలై ఉండటం బాధాకరం.
పదబంధం – కాలుగాలిన పిల్లి
‘ఎప్పుడు సూడు.. కాలుగాలిన పిల్లిలా తిరుగుడే. ఆడ అంటిచ్చుడు.. ఈడ ముట్టించుడు.. ఛీ ఛీ’ – ఇలాంటి పదబంధాలు ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయ్యాయి. అక్కడి మాటలు ఇక్కడికి.. ఇక్కడి మాటలు అక్కడికి చేరవేసి కయ్యాలు పెట్టే మనుషులు వీధికొక్కరు. ఇలాంటివారిని ‘కాలు కాలిన పిల్లి’తో పోల్చారు జానపదులు. పనీపాటా లేకుండా ఊరికే అటూ ఇటూ పక్కలెగరేస్తూ తిరిగే వ్యక్తి అన్నమాట. ఇలాంటివారికి సొంతపని అంటూ ఉండదు. కాబట్టి, అనవసర ప్రసంగాలు చేస్తుంటారు. అటు మాటలు ఇటు చెబుతుంటారు. దీనికొక కథ ఉంది. నలుగురు అన్నదమ్ములు ఓ పిల్లిని పెంచుకున్నారు. దానిపైన ప్రేమతో తలో కాలూ పంచుకున్నారు. అయితే ఓ కాలికి దెబ్బ తగలడంతో ఓ తమ్ముడు దానికి నూనెరాసి, కట్టుకట్టాడట. అది అటూ, ఇటూ తిరిగే క్రమంలో నూనెరాసిన కాలికి నిప్పు అంటుకుందట. ఆ బాధలో ముగ్గురు అన్నదమ్ములు దాచుకున్న పత్తిలో పరిగెత్తిందట పిల్లి. ఇంకేముంది.. సర్వనాశనం అయిపోయింది. ఎప్పటికైనా పనిలేని సోమరి పదిమందితో కబుర్లాడక తప్పదు. విన్నమాటలను నలుగురికీ చెప్పకా తప్పదు. మాట నోరు దాటితే.. ప్రపంచాన్ని చుట్టినట్టే. అందుకే ఏ పనీ లేకుండా అటూ ఇటూ తిరిగేవారితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పెద్దలు చెబుతుంటారు.
అర్థ వివరణ
పొడ్సుకచ్చుడు = తన్నుకురావడం (ఏమ్రో.. రోషం పొడ్సుకొత్తాంది. డబ్బులు తీసుకున్నప్పుడు ఉండాలె ఈ రోషం. అంత దమ్మున్నోడివైతే.. నా పైసలిచ్చి మాట్లాడు)
సావుమర్నం = తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు, చచ్చినట్లు అవడం (వామ్మో.. నువ్జేసే పనులు చూస్తుంటె నాకు సావుమర్నం అచ్చినట్లే ఉంది)
మూలమంచ = అలగడం (మొన్నట్నుంచి జూస్తున్నా పొద్దుగాల మూలమంచమేసుడు.. మాపటేల పిత్తిందాక తినుడు. ఈ నప్పతట్ల యవ్వారాలే అద్దనేది)
వంగలేనోడు = పని చేతకానోడు, పని ఇష్టంలేనోడు (ఎన్కటికి ఒకడు.. నీలాంటోడే వంగలేక దొంగల్లో కల్సిండట. పన్జేయడం నేర్చుకోవాలె. అదే ఎప్పటికైనా బతికిస్తది)
చెంగలిచ్చుడు = ఆనందంతో ఎగరడం, గంతులేయడం, ఉరకడం (తనుగు ఇడ్వంగనే చెంగలిచ్చుకుంట ల్యాగ ఎట్ల అస్తుందో చూడు. పొదుగుల పెట్టిన మూతి తియ్యనే తియ్యదు)
-డప్పు రవి
Read Today's Latest Palukubadulu News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?




