(తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌పై ఏఐసీసీ అధ్యక్షుడికి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రవణ్ దాసోజు బహిరంగ లేఖ)
గౌరవనీయులైన మల్లికార్జున్ ఖర్గేజీ,
చేవెళ్ల సభలో మీ పార్టీ ప్రకటించిన ఎస్సీ/ఎస్టీ డిక్లరేషన్‌కు ప్రతిస్పందనగా, రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వ్యూహాల గురించి మీకు కనువిప్పు కలగాలని ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దళితుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని మీరు ఈ డిక్లరేషన్‌ను ప్రకటించి ఉండొచ్చు. కానీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లుగా దళితులు, గిరిజనుల సాధికారత కోసం అనేక పథకాలను నిబద్ధతతో అమలు చేస్తున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మీరు చేవెళ్ల సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఈ లేఖలో ఇస్తున్నాను. నేనడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను.
1. కేసీఆర్ ప్రభుత్వం 2014-2023 మధ్య ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతి కోసం రూ.1,81,462 కోట్ల నిధులు ఖర్చు చేసింది. మీ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం ఎంత ఖర్చు చేశారో తెలియజేయగలరా?
2. పాలనలో అంబేద్కరిజాన్ని అనుసరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపునకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. మాలాగా మీ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై తీర్మానాలు చేస్తామని హామీ ఇవ్వగలరా?
3. ఆదివాసీలకు సీఎం కేసీఆర్ 4 లక్షల ఎకరాలకు పైగా పోడు భూములను పంపిణీ చేశారు. భూమి లేని పేద ఎస్సీ మహిళలకు 3 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నది. ఇలాంటి పథకాన్ని మీ పాలనలోని రాష్ర్టాల్లో చూపించగలరా?
4. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వందలాది గురుకుల పాఠశాలలను, కళాశాలలను నెలకొల్పింది. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తున్నది. ఈ విషయంలో ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా తెలంగాణకు సరితూగగలదా? తెలంగాణలో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ సాయంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు.
5. బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న దళిత బంధు పథకాన్ని మీ పార్టీ గతంలో ఖండించి ఇప్పుడు సిగ్గు లేకుండా అలాంటి పథకం ద్వారా మేము ఇచ్చే దాని కన్నా రూ.2 లక్షలు ఎక్కువ సాయం అందిస్తామని అనడం మీ పార్టీ సొంత వైఖరికి విరుద్ధం కాదా? మీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రోత్సాహకాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాపీ చేసినవే! ఈ విషయం తప్పని అనగలరా?
6. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బోరాపూర్, జంగూబాయి, నాచారం జాతరలను నిర్వహిస్తున్నది. మేడారం జాతరకు రూ.354 కోట్లు ఖర్చు చేస్తున్నది. గతంలో ఏ కాంగ్రెస్ ప్రభుత్వమైనా గిరిజన సంస్కృతికి, పండుగలకు కేసీఆర్ ఇచ్చినంత ప్రాధాన్యత ఇచ్చిందా?
7. జలయజ్ఞం, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం 2013 వరకు లక్షల ఎకరాల అసైన్డ్ భూములను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సహేతుకమైన పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కుంది. కానీ కేసీఆర్ ఆ క్రూరమైన వ్యవహారానికి స్వస్తి పలికి ప్రభుత్వం సేకరించిన భూములకు మార్కెట్ రేటు చెల్లించిన మాట వాస్తవం కాదంటారా?
8. ఉమ్మడి రాష్ట్రంలో మీ పార్టీ ప్రభుత్వం గిరిజనులు, ఎస్సీల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కేసీఆర్ ప్రారంభించిన ప్రభుత్వ ప్రసూతి దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచిన మాట తప్పని నిరూపిస్తారా? కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ప్రతి మూలన పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు అందుబాటులోకి వచ్చి ప్రజారోగ్యం, వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఈ విషయాన్ని పరిశీలిస్తే మంచిది.
9. మీరు ఓట్ల కోసం ప్రజా గాయకుడు గద్దర్‌కు నివాళులు అర్పించడం ప్రజలను మభ్య పెట్టడమే!
10.బీఆర్ఎస్ సర్కారు పేదలకు ఇచ్చిన 4 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎక్కువ మంది వెనకబడిన వర్గాల వారే. ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనా కనీసం ఒక్క రెండు పడక గదుల ఇంటినైనా పేదలకు పంపిణీ చేసిందా?
11. రేవంత్‌రెడ్డి, అతడి వర్గం మీ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ నాయకులను అవమానాలకు గురి చేస్తున్న విషయం గమనించండి.
12. రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ తమ ప్రచార కార్యక్రమాల్లో మిమ్మల్ని కూడా అవమానించింది! సోనియా గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌ను సందర్శిస్తే వారి పోస్టర్లు, కటౌట్లను నగరమంతా ప్రదర్శిస్తారు. మీరు ఎస్సీ కాబట్టి మీపై తక్కువ ఆదరణ చూపిస్తున్నారు!
13. మీ పార్టీకి జాతీయ విధానం ఉందా? ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టడం, కేసీఆర్‌ను విమర్శించడం మాని కేసీఆర్ కంటే మెరుగ్గా పనిచేయడానికి ప్రయత్నించండి.
డియర్ ఖర్గేజీ.. మీ నకిలీ, నిస్సారమైన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ దళితులు, గిరిజనులని మభ్య పెట్టలేదని తెలుసుకోండి. ప్రజల అండ ఉన్న కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావడాన్ని మీరు ఆపలేరని గుర్తుంచుకోండి!
ఇట్లు భవదీయుడు
డాక్టర్ శ్రవణ్ దాసోజు