చేనేత బీమా పునరుద్ధరణ ఎప్పుడు?
నేతన్న కుటుంబాలకు భరోసా ఏది? బీమా గడువు ముగిసి నెలలు గడుస్తున్నా పునరుద్ధరణ లేదు. చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందడంలేదు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసిన చేనేత బీమా పథకం నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేద చేనేత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.
నేతన్న కుటుంబాలకు భరోసా ఏది? బీమా గడువు ముగిసి నెలలు గడుస్తున్నా పునరుద్ధరణ లేదు. చనిపోయిన నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందడంలేదు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేసిన చేనేత బీమా పథకం నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పేద చేనేత కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న చేనేత కార్మికుడు అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బీమా పథకం ఆగిపోవడం విచారకరం. గతంలో ఎంతోమంది పేద చేనేత కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ఈ పథకం ప్రస్తుతం అమల్లో లేకపోవడంతో బాధిత కుటుంబాలు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
గతంలో అమలు చేసిన చేనేత బీమా పథకం ద్వారా అర్హత గల చేనేత కార్మికుడు మరణిస్తే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందేది. కుటుంబ పెద్దను కోల్పోయిన విషాద సమయంలో అంత్యక్రియల ఖర్చులు, కుటుంబ పోషణ, పిల్లల చదువులు, అప్పుల చెల్లింపులు వంటి అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే కుటుంబాలకు ఈ మొత్తం ఎంతో ఆసరాగా ఉండేది. ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని చేనేత కుటుంబాలకు ఈ పథకం భరోసాగా నిలిచింది. వాస్తవానికి చేనేత బీమా పథకం గడువు ఈ ఏడాది ఆగస్టు 26తో ముగిసింది. ఆ తర్వాత ఈ పథకం గడువును పెంచకపోవడంతో మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు బీమా పరిహారం అందని పరిస్థితి నెలకొన్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బీమా సంస్థల మధ్య ప్రీమియం చెల్లింపులు, బాధ్యతలపై స్పష్టత లేకపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 59 ఏండ్లలోపు మరణించిన చేనేత కార్మికులు 45 మందికి పైగా ఉండగా, 60 ఏండ్లు దాటిన తర్వాత మరణించినవారు 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తున్నది. అంటే దాదాపు 95కి పైగా చేనేత కార్మికుల కుటుంబాలు ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి.
మరోవైపు 59 ఏండ్ల వయసు దాటి, మరణించిన చేనేత కార్మికుల కుటుంబాలకు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఎక్స్గ్రేషియా జీవో గడువు కూడా ఈ ఏడాది ఆగస్టుతో ముగిసింది. కానీ ఆ జీవోను పునరుద్ధరించకపోవడంతో వయోపరిమితి దాటిన కార్మికుల కుటుంబాలు కూడా ప్రభుత్వ సహాయానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.చేనేత వృత్తిలో జీవితాంతం శ్రమించి, వయస్సు పైబడిన తర్వాత అనారోగ్యంతో లేదా ఇతర కారణాలతో మరణించిన కార్మికుల కుటుంబాలకు కనీస ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
ఒకవైపు బీమా పథకం నిలిచిపోవడం, మరోవైపు ఎక్స్గ్రేషియా జీవో పునరుద్ధరణ జరుగకపోవడంతో చేనేత కుటుంబాలను మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నది. ప్రభుత్వం వెంటనే స్పందించి నిలిచిపోయిన చేనేత బీమా పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలి. గతంలో అమలులో ఉన్న రూ.5 లక్షల బీమా పరిహారాన్ని అర్హులైన కుటుంబాలకు అందించాలి. బీమా పథకం నిలిచిన కాలంలో మరణించిన అర్హులైన కార్మికుల కుటుంబాలకు ప్రత్యేక పరిహారం అందించాలి. 59 ఏండ్లు పైబడిన చేనేత కార్మికుల కోసం గతంలో జారీ చేసిన ఎక్స్గ్రేషియా జీవోను వెంటనే పునరుద్ధరించాలి. నేతన్న మరణిస్తే ఆ కుటుంబానికి జీవనాధారం కూడా ఆగిపోతుంది! చేనేత కార్మికుడు బతికున్నంతకాలం తన కుటుంబం కోసం మగ్గం మీద నిరంతరం శ్రమిస్తాడు.
నూలు ధరలు, రంగులు, రసాయనాల ధరలు, పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, యాంత్రీకరణ పోటీ వంటి సమస్యల మధ్య ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ కుటుంబాన్ని పోషిస్తాడు. అలాంటి కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఆదాయం ఆగిపోవడమే కాకుండా, అప్పులు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ వంటి సమస్యలు చుట్టుముడతాయి. అలాంటి సమయంలో బీమా సొమ్ము అందడం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. అది ఆ కుటుంబానికి ఆపన్నహస్తం, పిల్లల భవిష్యత్తుకు భరోసా, మళ్లీ నిలబడేందుకు ఒక అవకాశం. మగ్గం ఆగితే ఒక కుటుంబం జీవనం ఆగుతుంది. నేతన్న మరణిస్తే ఆ కుటుంబం భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందుకే చేనేత బీమా పథకం పునరుద్ధరణ ఇక ఆలస్యం కాకూడదు. నేతన్న కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించాలి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
అవ్వారి భాస్కర్
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

