వ్యక్తులకు వ్యక్తిత్వం ఎటువంటిదో సామాజిక సమూహాలకు, ప్రాంతాలకు అస్తిత్వం అటువంటిది. వ్యక్తులు వ్యక్తిత్వాన్ని, సమూహాలు, ప్రాంతాలు అస్తిత్వాన్ని కోల్పోయినప్పుడు, ఇతరత్రా ఎంతటి సిరిసంపదలతో తులతూగినా అది ఆత్మహత్యతో సమానమే. కనుకనే వ్యక్తిత్వాలు, అస్తిత్వాల కోసం ఆదిమ జాతుల నుంచి మొదలుకొని మధ్యయుగాల మీదుగా ఈ ఆధునిక కాలం వరకు ఘర్షణలు జరుగుతూ వస్తున్నాయి. ఇదంతా రాయడం ఎందుకంటే, తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ, బలోపేతం కోసం తిరిగి ప్రయత్నాలు జరగవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
తెలంగాణ అస్తిత్వ భావనకు మూడు విధాలైన ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఒకటి, గతంలో వలెనే మళ్లీ బయటి శక్తుల నుంచి. మిగిలిన రెండు అంతకన్నా ఆందోళనకరమైనవి. వాటిలో మొదటిది, 1950ల నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు కనిపించిన ఆ స్ఫూర్తి క్రమంగా మరుగునపడుతుండటం. రాష్ట్రం ఏర్పడినందున ఇక ఆ స్ఫూర్తితో పనిలేదన్న పొరపాటు ఆలోచనలు. రెండవది, తెలంగాణ అస్తిత్వ స్ఫూర్తి కొత్త తరానికి, లేదా తెలంగాణ జెన్-జీ తరానికి ఒక సంప్రదాయంగా వ్యాపిస్తుండకపోవటం. చాప కింద నీరు వలె వ్యాపిస్తున్న ఈ మూడు ప్రమాదాలను అరికట్టకపోయినట్టయితే, మరికొంత కాలం తర్వాత పరిస్థితి ఆందోళనకరమైన స్థాయికి చేరగలదు.
ఒక ప్రాంతపు అస్తిత్వం అనేదానికి 360 డిగ్రీలలో అనేకానేక కోణాలుంటాయి. దానికి గతం, వర్తమానం, భవిష్యత్తు దృష్టులు కూడా ఉంటాయి. వాటిని స్థూలంగా విభజించాలంటే అక్కడి పరిస్థితులు, అవసరాలు, సమస్యలు, పరిష్కార లక్ష్యాలు, భవిష్యత్తు దార్శనికత అనేవి ఒక వర్గీకరణ. అవన్నీ మెటీరియల్ అంశాలు. అక్కడి చరిత్ర, సంస్కృతి, భాష, సామాజిక సంప్రదాయాలు, మతాలు, దేవతలు, ఆలోచనాధార, తమదైన ప్రత్యేక గుర్తింపు అనేవి మరొక వర్గీకరణ. ఇవి ఫిలసాఫికల్ అంశాలు. ఈ రెండింటికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. అదే సమయంలో దేని కార్యరంగం దానిదవుతుంది. అట్లా అవుతూనే రెండింటి మధ్య ఉండే సజీవ (ఆర్గానిక్) సంబంధానికి తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే ఒక దృష్టాంతం.
మలిదశ ఉద్యమంలో ఎలుగెత్తి వినిపించిన నినాదం నీళ్లు, నిధులు, నియామకాలు. ఇది తెలంగాణ సమస్యలు, అవసరాలను కేంద్రంగా చేసుకున్న మెటీరియలిస్ట్ నినాదం. వాస్తవానికి, ఆంధ్రతో విలీనం వద్దన్న 1955 నాటి నుంచి 21వ శతాబ్దారంభంలో మలిదశ ఉద్యమ ఉధృతి వరకు ఈ విధమైనది నినాద రూపంలో వినిపించకున్నా, వేర్వేరు డిమాండ్ల సారాంశం మాత్రం అదే. తిరిగి అదే కాలంలో, ఈ మెటీరియలిస్ట్ పార్శానికి సమాంతరంగా తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణ, బయటి భాషా సంస్కృతుల ఆధిపత్యంపై వ్యతిరేకత అనే పార్శం నుంచి కూడా కార్యక్రమాలు జరిగాయి. కనీసం మంద్రస్థాయిలో. ఆ రెండు పార్శాలు కలగలిసి అస్తిత్వ ఉద్యమం అయింది. అదే సమ్మిళిత ఉద్యమరూపం మలిదశ ఉద్యమవేళకు ఉధృతంగా మారింది. తొలిదశ కాలంలో కొంత మంద్రస్థాయిలో కనిపించిన భాషా సంస్కృతుల పార్శం మలిదశ వచ్చే సరికి, మెటీరియలిస్ట్ పార్శానికి తీసిపోని విధంగా భూనభోంతరాళాలను దద్దరిల్లజేసింది. తెలంగాణ తల్లి రూపకల్పన, ఆకాశమంత ఎత్తున పేర్చిన బతుకమ్మలు అందుకు ప్రతీకలై నిలిచాయి. ఆ విధంగా, తెలంగాణ అస్తిత్వమన్నది, 2014లో ప్రత్యేక రాష్ట్ర అవతరణ నాటికే రూపసారాంశాలను తీర్చిదిద్దుకున్నది.
ఇప్పుడు 2014 నుంచి పుష్కర కాలం గడుస్తున్న దశలో, మొదటిదయిన మెటీరియలిస్ట్ పార్శం సంతృప్తికరంగానే సాగుతుండగా, రెండవ పార్శానికి సంబంధించి ఆలోచించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పైన చెప్పుకున్నట్టు మూడు విధాలుగా. ఒకటి, తిరిగి అవే బయటి శక్తులు పురివిప్పుతుండటం. 1956తో మొదలై చంద్రబాబు మీదుగా ప్రయాణించి వస్తున్న అంతర్గత వలసవాద పెట్టుబడిదారీ శక్తులు పట్టువదలనివి.
ఇక్కడే కాదు ఎక్కడైనా వాటి ప్రయోజనాలు, స్వభావమే అంత. వలసవాదం తర్వాత నయావలసవాదం వలె. చరిత్రలో ఆర్థిక వలసవాదానికి సాంస్కృతిక వలసవాదం ఎప్పుడూ ఆలంబనగా నిలిచినట్టు, 1956-2014 మధ్య సీమాంధ్ర ధనిక వర్గాలు తెలంగాణపై ఈ రెండంచుల కత్తిని ప్రయోగిస్తూ వచ్చాయి. సాంస్కృతికంగా, నాగరికంగా నువ్వు తక్కువ అని నీతోనే అంగీకరింపజేస్తే, ఆ మానసిక స్థితికి గురయ్యే నువ్వు మా ఆర్థిక దోపిడీకి సిద్ధమవుతావు. వలసవాదులు ప్రపంచమంతటా అనుసరించిన నీతే ఇది.
అంతెందుకు, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అందరి కండ్లు తమ సంస్కృతిని ప్రపంచానికంతా ఎగుమతి చేయజూస్తూ, తమ నమూనా సంస్కృతినే అంతటా సృష్టించగలమని బాహాటంగా ప్రకటించటంలోని రహస్యం ఇదే. బహుశా ఈ నీతిని గ్రహించటం వల్లనే కావచ్చు తెలంగాణ సంస్కృతిని, అస్తిత్వాన్ని కించపరిచి మరుగున పడవేసే ప్రయత్నాలు 1956-2014 మధ్య చాలానే జరిగాయి. ఈ సందర్భంలో ఒక తాజా ఉదాహరణను పేర్కొంటే ఆశ్చర్యం కలుగవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నవంబర్‌లో ప్రకటించిన జాతీయ భద్రతా వ్యూహపత్రంలో యూరప్ గురించి చేసిన వ్యాఖ్య ఒకటి గమనించదగ్గది. యూరప్ ఖండం ఆర్థికంగా క్షీణదశను ఎదుర్కోవటం అట్లుండగా, అంతకుమించి ఆ నాగరికతే తుడిచిపెట్టుకుపోయే ప్రమాదంలో పడిందని వ్యూహపత్రంలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ మాట యూరోపియన్లకు ఆర్థిక క్షీణత అనే వ్యాఖ్యకు మించిన ఆగ్రహాన్ని తెప్పించింది. వారి ఆత్మగౌరవానికి భంగకరమైంది. ఎందుకంటే, అమెరికా కన్నా యూరోపియన్ నాగరికతలు ప్రాచీనమైనవి, ఘనమైనవి అనే విషయం యావత్తు ప్రపంచానికి తెలుసు. ట్రంప్‌కు తెలియదనుకోలేము. ట్రంప్ పూర్వీకులు జర్మన్ యూరోపియన్లే. కానీ, యూరప్‌ను మానసికంగా దెబ్బతీసి లొంగబరచుకునేందుకు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటం ఒక సాధనమన్నమాట.
అందువల్ల, తమ వారి బలంతో, తమ ధనసంపత్తుల బలంతో, తెలంగాణలో తమతో నేటుగానో, చాటుగానో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నవారి బలంతో, తమ ప్రయోజనాల కోసం ఉపయోగపడే మీడియా అండతో, స్వయంగా తామో, లేక తమ ఏజెంట్లు, కాంప్రడార్లో (స్థూలంగా దళారులు) తెలంగాణపై తిరిగి ఆధిపత్యం సాధించాలనే ప్రయత్నాలు ముమ్మరంగానే చేస్తున్నట్టు కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలలో స్వీయ అస్తిత్వ భావనలు, 1956-2014 మధ్యకాలపు స్ఫూర్తి ఎంతగా తగ్గితే, దళారుల ప్రయత్నాలు అంతగా నెరవేరుతాయి. అందువల్ల ఆ అస్తిత్వ స్ఫూర్తిని ఆవాహన చేసుకుని, శక్తిమంతం చేసుకుని, ఆధిపత్యశక్తుల ప్రయత్నాలను మొగ్గలోనే తుంచివేయటం తెలంగాణ ప్రజలకు ఒక తప్పనిసరి అవసరం.
అయితే పైన అనుకున్నట్టు, పొంచి ఉన్న బయటి శక్తుల నుంచి మళ్లీ వస్తున్న ప్రమాదం కన్నా, తక్కిన రెండు విధాలుగా కలిగే ప్రమాదం ఇంకా తీవ్రమైనది. ఎందుకంటే, తెలంగాణ అస్తిత్వ దుర్గాన్ని ప్రజలు అంతర్గతంగా ఎంత శక్తిమంతం చేసుకుంటే, అది అంతగా శత్రుదుర్భేద్యం అవుతుంది, తమకు రక్షణ కల్పిస్తుంది. అందుకు జరగవలసింది, ఒకవైపు తెలంగాణ ఉద్యమతరం ఇక ఆ అస్తిత్వ స్ఫూర్తితో పని తీరిపోయిందన్న పొరపాటు భావనను వదిలివేయటం. ఏ విధంగానైతే నిరంతర జాగరూకత, చైతన్యాలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగలవో, అదే విధంగా నిరంతర అస్తిత్వ స్ఫూర్తే తెలంగాణను స్వతంత్రంగా నిలిపి ఉంచగలదని, ముందుకు తీసుకుపోగలదని గుర్తెరిగి వ్యవహరించటం.
తెలంగాణ ఉద్యమతరం బాధ్యత అంతటితో తీరిపోదు.
తమ అస్తిత్వ స్ఫూర్తి సంప్రదాయాన్ని తెలంగాణ జెన్-జీ తరానికి అందించి తీరాలి. ఆ స్ఫూర్తి ఒక నిరంతర ప్రవాహంగా మారి ముందుకు సాగాలి. తెలంగాణ ఉన్నంత కాలం ఆ స్ఫూర్తి ఉండాలి. అట్లా లేనందువల్ల కలిగే అవాంఛనీయ పరిణామాలేమిటో మన భారతదేశం విషయంలోనే చూస్తున్నాము. దశాబ్దాలపాటు నడిచి విజయం సాధించిన స్వాతంత్య్రోద్యమం 1947లో గమ్యాన్ని చేరిన తర్వాత కొద్ది దశాబ్దాలు గడిచే సరికే లక్ష్యశుద్ధిని కోల్పోవటం మొదలైంది. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ఉద్యమతరం కోల్పోసాగింది. దురదృష్టవశాత్తు ఆ కోల్పోవటం వేగంగానే జరిగింది. తర్వాతి తరాలకు ఆ ఉద్యమం ఏమిటన్నది కూడా తెలియకుండాపోయింది. దాని పర్యవసానాలను భారత ప్రజలు ఏయే విధాలుగా అనుభవించారో తెలిసిందే గనుక ఇక్కడ వివరించుకోనక్కరలేదు. అటువంటి పరిస్థితి తెలంగాణకు ఏర్పడకూడదు.
ఉద్యమస్ఫూర్తిని, అస్తిత్వ స్ఫూర్తిని స్వాతంత్రోద్యమ తరమే కోల్పోవటం వల్ల దేశానికి కలిగిన హాని ఒకటైతే, ఆ స్ఫూర్తిని తర్వాతి తరాలకు ఒక సంప్రదాయంగా అందజేయకపోవటం మరింత హానికరంగా మారింది. మరింత అనటం ఎందుకంటే, గతకాలపు స్ఫూర్తిలేని తరం ఉనికిలోకి రావటం ఒకసారి మొదలైతే, ఇక తర్వాతి తరాలకు ఆ స్ఫూర్తి ఏర్పడటం కష్టం. అది అసంభవమని అనలేము కానీ తేలికకాదు. మానవ సమాజాల సుదీర్ఘ ప్రయాణంలో పరిస్థితులను బట్టి ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కానీ తెలంగాణ సమాజం అటువంటి కాకతాళీయాలపై ఆధారపడకూడదు. అందువల్ల, తెలంగాణ ప్రజానీకం అస్తిత్వస్ఫూర్తి, స్వీయపరిరక్షణాస్ఫూర్తి, స్వీయోద్ధరణ స్ఫూర్తి, స్వీయ వికాస స్ఫూర్తిని ఆవాహన చేసుకునేందుకు ఇదే సరైన సమయం.
-టంకశాల అశోక్