అరుదైన జీవ వైవిధ్యం కలిగిన కంచె గచ్చిబౌలి అడవిపైకి ప్రభుత్వం వందలాదిగా బుల్డోజర్లు పంపి విధ్వంసం చేయౠనుకుంటే హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం (హెచ్‌సీయూ) విద్యార్థులు ఆ విధ్వంసాన్ని వీరోచితంగా ప్రతిఘటిస్తున్నారు. ఈ ప్రతిఘటనా పోరాటం దేశం దృష్టిని ఆకర్షించింది. దేశవ్యాప్తంగా వారి పోరాటానికి సంఘీభావం వ్యక్తమవుతున్నది. అయినా ప్రభుత్వం ఇవేమీ పట్టనట్టుగా తన పని తాను చేసుకుపోతున్నది. ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యం కలిగిన లక్షల ఎకరాల అడవులు, వందల, వేల జల వనరులు మాయమవుతున్న కారణంగా వాతావరణంలో, పర్యావరణంలో విపరీత మార్పులు చోటుచేసుకొని ఎన్ని అనర్థాలు సంభవిస్తున్నాయో మనకు తెలిసిందే.
ఈ పాపంలో అన్ని దేశాల పాలకులదే ప్రముఖ పాత్ర. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న పర్యావరణ విధ్వంసం అంతా ఇంతా కాదు. మన దేశ పాలకులు కూడా ఇందుకు అతీతులు కారు. మన అడవులు కుదించుకు పోవడానికి, మన నదులు మృత నదులుగా మారిపోవడానికి, మన చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కావడానికి మన పాలకుల విధానాలే కారణం. భూగోళం మీద, మన దేశంలోనూ వాతావరణంలో, పర్యావరణంలో తీవ్ర మార్పులు, వాటి పర్యవసానాల గురించి శాస్త్రవేత్తలు, నిపుణులు దశాబ్దాల తరబడి అంతర్జాతీయ వేదికలపై విస్తృతంగా చర్చిస్తున్నారు. భారత్‌లోనూ ఈ చర్చ జరుగుతున్నది.
అడవుల నరికివేత-వాతావరణ మార్పులు: రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వరుస కరువులు, అతి వరదలు సంభవించి ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ఈ మార్పులకు అనేక కారణాలున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఏటా మిలియన్ల హెక్టార్ల మేర అడవుల నరికివేత ప్రధాన కారణంగా ముందుకు వచ్చింది. 2001 నుంచి 2023 వరకు ప్రపంచవ్యాప్తంగా 488 మిలియన్ హెక్టార్ల అడవి భూమి మీదినుంచి మాయమైందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అడవుల నరికివేత ఏడాదికేడాది అనూహ్యంగా పెరిగిపోతున్నది.2001లో 13.4 మిలియన్ హెక్టార్ల అడవి మాయమైతే 2023 నాటికి అది 28.3 మిలియన్ హెక్టార్లకు పెరిగిందని పర్యావరణవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రతీ నిమిషం ఒక ఫుట్‌బాల్ మైదానం అంత అడవి అమెజాన్ అడవుల నుంచి మాయమవుతున్నదట. 2018లో సుమారు 3.60 మిలియన్ హెక్టార్ల ఉష్ణ మండల అడవులు భూమ్మీద నుంచి మాయమైనట్టు ఒక అంచనా. అడవుల నరికివేత వల్ల భూగోళంపై ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులు రుతు పవనాల గమనాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రుతు పవనాల మీద ఆధారపడిన వ్యవసాయిక దేశాలైన భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయాన్మార్ తదితర దక్షిణాసియా దేశాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పుడు వానకాలం 4 నెలల పాటు వర్షపాతం ఉండేది. ఇప్పుడు వార్షిక సగటు వర్షపాతంలో తగ్గుదల లేకపోయినా వర్షం కురిసే రోజులు సుమారు 25-30 రోజులకు పడిపోయింది.
వర్షం నెల, నెలన్నర రోజులు అసలే కురువదు. కురిస్తే రెండు, మూడు రోజుల్లో భారీ కుండపోత వర్షం కురిసి పోతుంది. కొన్ని గంటల్లోనే 60, 70 సెంటీ మీటర్ల వర్షం కురిసిన అనుభవాలు ఇటీవలే మన తెలంగాణలోనే ఉన్నాయి. అనంతరం మళ్లీ వర్షం అతా పతా ఉండదు. ఈ దోబూచులాట మనం గత కొన్నేండ్లుగా చూస్తూనే ఉన్నాం. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షం లేక కరువు పరిస్థితులను చూశాం. సెప్టెంబర్, అక్టోబర్ లో భారీ వర్షపాతం, నదుల్లో వరద బీభత్సం చూశాం. ఫిబ్రవరి నుంచి తిరిగి ఎండలు దంచి కొ ట్టే పరిస్థితులు వస్తాయి. ఈ కారణంగా దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంటున్నది. కరువులు-వరదలు దాదాపు ఏటా పునరావృతమవుతున్నాయి.
వాతావరణ పునరుద్ధరణకు మార్గాలు: వాతావరణ మార్పులను నియంత్రించి తిరిగి గాడిలో పడేయాలంటే భూగోళం మీద అడవుల నరికివేతను నియంత్రించడం, నరికివేతకు గురైన అడవులను తిరిగి పునరుజ్జీవింపజేయడం, కర్బన ఉద్ఘారాలను నియంత్రించడం తప్పనిసరి అవసరమని పర్యావరణవేత్తలు భావిస్తున్నారు. 10 వేల ఏండ్ల కిందట భూగోళం 45 శాతం అంటే 60 వేల లక్షల హెక్టార్ల అడవులతో నిండి ఉండేది. ఇప్పుడు అది 31 శాతానికి అంటే, 40 వేల లక్షల హెక్టార్లకు పడిపోయింది. కాబట్టి, భూమి మీద అడవులను పునరుజ్జీవింపజేయడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం, వాతావరణ ఉష్ణోగ్రతను పెంచే కర్బన ఉద్ఘారాలను (Carbon Emissions) తగ్గించడం మానవాళి ప్రథమ కర్త వ్యమని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లేకపోతే మానవజాతి సహా అన్ని జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడిపోతుంది.
అతిపెద్ద మానవ ప్రయత్నాలు: భూగోళంపై గ్రీన్ కవర్‌ను పెంచడానికి, కర్బన ఉద్ఘారాలను తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మానవ ప్రయత్నాలు అనేక రూపాల్లో జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇటువంటి ప్రయత్నాలు చైనా, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, ఆఫ్రికా తదితర దేశాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఇటువంటి అతిపెద్ద మానవ ప్రయత్నాల్లో చోటు సంపాదించుకున్నది. వాటి సంగతులు సంక్షిప్తంగా తెలుసుకుందాం.
గ్రేట్ గ్రీన్‌వాల్ ఆఫ్ చైనా: చైనా ఉత్తర ప్రాంతంలో ఉన్న రాష్ర్టాల్లో గోబి ఎడారి విస్తరణ ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నది. వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతం తగ్గిపోవడం వంటి పరిణామాలతో గోబి ఎడారి 1975 నుంచి ఇప్పటివరకు 55,000 చదరపు కిలోమీటర్లు విస్తరించినట్టు ఒక అంచనా. గోబి ఎడారి నుంచి వచ్చే ఇసుక తుఫానుల వల్ల 400 మిలియన్ల ప్రజలు కడగండ్ల పాలవుతున్నారు. ప్రజలను ఈ ఉత్పాతం నుంచి రక్షించడానికి గోబి ఏడారికి చెట్లతో ఒక గోడను నిర్మించాలని చైనా ప్రభుత్వం తలపెట్టింది. 1979లో గోబి ఎడారి విస్తరణను నివారించడానికి 500 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం చైనా ప్రభుత్వం అమలుచేయడం ప్రారంభించింది. దీన్ని ‘ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా’ అని పేరు పెట్టారు. 4500 కి.మీ.ల పొడవున, 3,50,000 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని 2050 వరకు పూర్తిచేయాలని సంకల్పించింది. ఇది మొక్కలు నాటడానికి చేస్తున్న అతిపెద్ద మానవ ప్రయత్నంగా ప్రసిద్ధి చెందింది.
బ్రెజిల్ అట్లాంటిక్ అడవుల పునరుద్ధరణ: బ్రెజిల్లో అట్లాంటిక్ వర్షాధారిత అడవుల పునరుద్ధరణ పెద్ద ఎత్తున జరుగుతున్నది. బొగ్గు ఉత్పత్తి, పరిశ్రమలు, గృహ నిర్మాణం, వ్యవసాయ విస్తర ణ.. తదితర మానవ అవసరాల కోసం వేలకు వేల చ.కి.మీ.అట్లాంటిక్ అడవులు నాశనమైనా యి. యూరప్ వలసవాదులు బ్రెజిల్ తూర్పు తీరం చేరిన 500 వందల ఏండ్ల తర్వాత అట్లాంటిక్ 10 లక్షల చదరపు కి.మీ. మిగిలిపోయిన అడవులు 7 శాతమే. అదే సమయంలో ప్రపంచానికే లంగ్ స్పేస్‌గా ఉన్న అమెజాన్ అడవుల్లో 19 శాతం నాశనమైనాయి. ఇప్పుడు బ్రెజిల్ తూర్పు తీరంలో అట్లాంటిక్ వర్షాధారిత అడవుల పునరుద్ధరణ కార్యక్రమం మొదలైంది. 2020 నాటికి 35 లక్షల ఎకరాల్లో అట్లాంటిక్ ఆడవుల పునరుద్ధరణ జరిగినట్టు పరిశీలకులు అంచనా వేశారు. ఈ ప్రయత్నం బ్రెజిల్‌తో పాటు మొత్తం దక్షిణ అమెరికా దేశాల వాతావరణ పునరుద్ధరణకు దోహదం చేస్తుందని శాస్త్రవేత్తల అంచనా.
తెలంగాణకు హరితహారం: అడవులను తిరిగి పునరుజ్జీవింపజేయడం తప్పనిసరి అవసరమని గుర్తించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని రూపొందించారు. జాతీయ అటవీ విధానంలో పేర్కొన్నవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 23 శాతం నుంచి 33 శాతానికి పెంచడం హరితహారం లక్ష్యం. ఐదు దశలలో 230 కోట్ల మొక్కలను నాటడం, వాటిలో 80 శాతం మొక్కలను రక్షించుకునే విధంగా 2015 జూలైలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన హరితహారం కార్యక్రమం జయప్రదంగా అమలైంది.
గడిచిన ఐదేండ్లలో హరితహారం కార్యక్రమంలో భాగంగా జనవరి 2023 వరకు 270.65 కోట్ల మొక్కలను నాటినట్టు తెలుస్తున్నది. ఇది 230 కోట్ల లక్ష్యాన్ని మించిపోయింది. హరితహారం అమలు తర్వాత రాష్ట్రంలో 2015తో పోల్చినప్పుడు 2021 నాటికి గ్రీన్‌కవర్ 6.85 శాతం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వారు 2021లో నిర్వహించిన సర్వేలో నిర్ధారించారు. హైదరాబాద్‌లో మొక్కలు నాటడం, అర్బన్ ఫారెస్ట్‌ల ఏర్పాటు తదితర కార్యక్రమాల వల్ల 148 శాతం గ్రీన్ కవర్ పెరిగినట్టు ఒక అంచనా. ఇది హరితహారం సాధించిన విజయంగా చెప్పవచ్చు. గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా ప్రాజెక్టుల తర్వాత అతిపెద్ద మానవ ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమానిదే.
మానవాళి కండ్లుతెరుస్తుందా?: ఇన్ని ప్రయత్నాలు జరుగుతున్నా మనం పర్యావరణానికి చేస్తున్న హాని పరిమాణం ముందు ఇవి చాలా చాలా చిన్న ప్రయత్నాలుగా మిగిలిపోతున్నాయి. తాత్కాలిక ప్రణాళికలు, దీర్ఘ కాల ప్రణాళికలు… చిత్తశుద్ధితో అడవుల నరికివేతను తగ్గించుకోవడం, అటవీ భూములను పునరుద్ధరించుకోవడం, పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమాలు చేపట్టడం, కర్బన ఉద్ఘారాలను గణనీయంగా తగ్గించుకోవడం, ఫాసిల్ ఇంధన వినియోగం నుంచి ఇతర రెన్యూయెబుల్ ఎనర్జీ వినియోగం వైపునకు మళ్లడం… ఈ ప్రయత్నాలు అన్ని దేశాలు ఏకోన్ముఖంగా సుదీర్ఘకాలం పెద్ద ఎత్తున జరిపితే తప్ప ప్రకృతి ప్రకోపం తగ్గే అవకాశం లేదు. మానవాళి ఇప్పుడైనా కండ్లు తెరుస్తుందా?
కంచ గచ్చిబౌలి ఫారెస్ట్ విధ్వంసం: ఒకవైపు పట్టణ అడవుల పెంపకంపై దృష్టి పెట్టవలసిన ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాగంగా ఉన్న 400 ఎకరాల్లో కంచ గచ్చిబౌలి అడవిని ధ్వంసం చేయడానికి వందల బుల్డోజర్లను పంపించింది. అపారమైన జీవ వైవిధ్యం కలిగిన ఈ అటవీ భూమిని రక్షించుకోవడానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం వారి మీద దమనకాండకు పూనుకుంటున్నది. అది విశ్వవిద్యాలయం భూమి కాదు ప్రభుత్వ భూమి అని అంటున్నది. ఆ భూమి ఎవరిదన్నది చర్చనీయాంశం కానే కాదు. ప్రాథమికంగా ఆ భూమి పలురకాల వన్య ప్రాణులకు, మొక్కలకు సహజ ఆవాస ప్రాంతం. జల వనరులకు నిలయం. అది హైదరాబాద్ నగరానికి, ముఖ్యంగా సమీప ప్రాంతాల ప్రజలకు ఒక లంగ్ స్పేస్‌గా ఉపయోగపడుతుంది. ఈ అరుదైన లంగ్‌స్పేస్‌ను, వన్య ప్రాణుల, మొక్కల సహజ ఆవాస ప్రాంతాన్ని మాయం చేయడం అమానుషం. గత ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో వీలైనన్ని అర్బన్ పార్కులను అభివృద్ధి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉనికిలో ఉన్న కంచె గచ్చిబౌలి పట్టణ అడవిని ధ్వంసం చేస్తున్నది. ఈ విధ్వంసాన్ని తెలంగాణ సమాజం ప్రతిఘటించవలసిందే. కంచ గచ్చిబౌలి అర్బన్ ఫారెస్ట్ పరిరక్షణ కోసం పోరాడుతున్న విశ్వవిద్యాలయం విద్యార్థులకు అండగా నిలవాల్సిందే.
– (వ్యాసకర్త: రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ )
శ్రీధర్‌రావు దేశ్‌పాండే