Telangana | కేవలం తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందున్నది. కేంద్రం ఆర్థిక ఆంక్షలు విధించినా స్పష్టమైన ప్రణాళిక, కార్యాచరణ, అంకితభావంతో పరిమిత వనరులు, అధికారాలతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం స్వయం సమృద్ధిని సాధించింది. ఈ నేపథ్యంలో మన దేశం ప్రపంచ దేశాలతో పోటీపడి అభివృద్ధి సాధించాలంటే సీఎం కేసీఆర్ దార్శనికతతో అమలుచేస్తున్న పథకాలనే దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
అన్ని దేశాల్లో కంటే భారతదేశంలోయువశక్తి ఎక్కువగా ఉన్నది. కానీ యువశక్తి తక్కువగా ఉన్న చిన్న దేశాలైన దక్షిణ కొరియా, ఖతార్ అభివృద్ధిలో మనకంటే చాలా ముందున్నాయి. జపాన్ వృద్ధుల జనాభాతో సతమతమవుతూ, యువశక్తి తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో భారత్ కంటే ఎంతో ముందున్నది. యువశక్తి సద్వినియోగం కావాలంటే ఉద్యోగాలు, ఉపాధి కల్పించడం కీలకం. ఇది జరగాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేయాలి. కొత్త పరిశ్రమలను స్థాపించాలి. సరళతర పారిశ్రామిక విధానాలతో పెట్టుబడులను ఆకర్షించాలి. ఇందుకు విరుద్ధంగా కేంద్రం నష్టాల బూచిని చూపించి దేశ సంపదను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నది. మహిళల సంపూర్ణ భాగస్వామ్యంతో అనేక దేశాలు అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటున్నాయి. ఈ వాస్తవాలను చూస్తూ కూడా మన పాలకులు జనాభాలో సగం ఉన్న మహిళా శక్తిని సద్వినియోగపరచుకోకపోవడం మన వెనుకబాటుకు ఒక ప్రధాన కారణం.
గరీబీ హటావో, ఇండియా షైనింగ్, అచ్చే దిన్, మేకిన్ ఇండియా, సబ్కా సాత్ – సబ్కా వికాస్, బేటి బచావో- బేటి పడావో లాంటివి కేవలం నినాదాలకే పరిమితమయ్యాయి. ‘అచ్చే దిన్’ కొందరు బడాబాబులకే వచ్చాయి. మేకిన్ ఇండియా బూటకమైంది. గతంలో కంటే చైనా నుంచి ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులు రెట్టింపవడమే ఇందుకు ఉదాహరణ. సబ్కా సాథ్ – సబ్కా వికాస్ కాస్త కార్పొరేట్కా సాథ్, అంబానీ-అదానీకా వికాస్ అయింది! భారతదేశ తలసరి ఆదాయం 2014-15 లో రూ.86,640 కాగా 2022-23లో రూ.1.72 లక్షలు. అదే తెలంగాణ తలసరి ఆదాయం 2014-15లో రూ.1.24 లక్షలు ఉండగా 2022-23లో 3.17 లక్షలకు పెరిగింది. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం 156 శాతం వృద్ధిని సాధించింది. దేశ వృద్ధి రేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధి రేటు 58 శాతం ఎక్కువ.
అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలు, నిరుపేద దేశాల మధ్య తేడాలున్నట్లు భారతదేశంలో కూడా రాష్ర్టాల మధ్య తేడాలున్నాయి. ఒకనాడు అట్టడుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి సమస్యలు, తాగునీటి కటకట, విద్య, వైద్యంలో అధమ స్థితి, వలసలు, ఆత్మహత్యలు, ఆకలి చావులు నిత్యకృత్యంగా ఉండేవి. దార్శనికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఈ దుస్థితి నుంచి బయటపడిన తెలంగాణ రాష్ట్రం సంక్షేమం, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, భవిష్యత్తు తరాల అవసరాలను తీర్చడంలో దేశంలోనే ముందున్నది. మానవ వనరులు, సహజ వనరులు, వైశాల్యంలో దేశంలో పెద్ద రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్ తలసరి ఆదాయం దాదాపు రూ.1 లక్ష, తలసరి విద్యుత్తు వినియోగం 663 కిలోవాట్ హవర్స్ (కేడబ్ల్యూహెచ్) కాగా మహారాష్ట్ర తలసరి ఆదాయం రూ.2.40 లక్షలు, తలసరి విద్యుత్తు వినియోగం 1588 కేడబ్ల్యూహెచ్. రాజస్థాన్ తలసరి ఆదాయం రూ.1.56 లక్షలు, తలసరి విద్యుత్తు వినియోగం 1345 కేడబ్ల్యూహెచ్; మధ్యప్రదేశ్ తలసరి ఆదాయం రూ.1.40 లక్షలు, తలసరి విద్యుత్తు వినియోగం 1232 కేడబ్ల్యూహెచ్ కాగా తెలంగాణ తలసరి ఆదాయం మాత్రం రూ.3.17 లక్షలు, తలసరి విద్యుత్తు వినియోగం 2,126 కేడబ్ల్యూహెచ్.
పదేండ్ల కిందట తెలంగాణ ఎదుర్కొన్న సమస్యలను పెద్ద రాష్ర్టాలు నేటికీ ఎదుర్కొంటూ కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ పరిస్థితులు దేశానికి శ్రేయస్కరం కాదు. ఈ దుస్థితి ఏడున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్నది. మరోవైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్ద కాలం కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన విభజన హామీలను నెరవేర్చలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, అనేక ఆర్థిక ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసే దుర్మార్గానికి పాల్పడుతున్నది. స్వశక్తితో ఎదుగుతున్న రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నా కేసీఆర్ సమర్థ పాలనలో తెలంగాణ దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే అద్భుత విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నది.
ఏ రాష్ట్రం పురోగమించినా అది ఆ రాష్ర్టానికే కాకుండా దేశానికే గర్వకారణం. అభివృద్ధి కాముక రాష్ర్టాలను అక్కున చేర్చుకొని, ఇతర రాష్ర్టాలు స్ఫూర్తి పొందేలా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ విధి. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఈ విజ్ఞత కొరవడింది. పరిమిత వనరులు, అధికారాలతో తెలంగాణలో అద్భుతాలు సాకారమైనప్పుడు సుదీర్ఘ కాలంలో అపరిమిత వనరులు, అధికారాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్ల పాలనలో సాధించినన్ని ఫలితాలు సాధించకపోవడం ముమ్మాటికీ పాలకుల పాపం. వాళ్లు అత్యంత విలువైన సమయాన్ని వృథా చేసి ప్రజలను వంచించారు.
ఇతర దేశాలు వనరుల పరంగా మనతో పోటీ పడలేవు. కానీ వనరులుండి కూడామనం అలాంటి దేశాల కంటే ఎందుకు వెనుకబడిపోతున్నాం? పాలకుల మూస ఆలోచనలు, అవగాహనా రాహిత్యమే దేశ ప్రగతికి అవరోధం. నేటి దుస్థితి భవిష్యత్తు తరాలకు సంక్రమించకూడదు. ప్రపంచ దేశాల మధ్య సాగుతున్న అభివృద్ధి పోటీలో భారత్ తన సత్తా చాటాలంటే కేసీఆర్ దార్శనికత, ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ అమలుచేస్తున్న పథకాలను అమలు చేయడమే మార్గం. తెలంగాణ అభివృద్ధి నమూనాతోనే దేశంలో సత్వర, సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది.
(సమాప్తం)
సిరికొండ మధుసూదనాచారి
(ఎమ్మెల్సీ, తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు)