నీటి నిర్వహణలో వైఫల్యం, జలవిద్యుత్తును నిర్లక్ష్యం చేయడం, థర్మల్ ప్లాంట్ల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించకపోవడం, పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌కు తగిన ప్రణాళిక లేకపోవడం-ఇవే నేటి విద్యుత్తు సంక్షోభానికి కారణాలా? తెలంగాణలో విద్యుత్తు పరిస్థితి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యుత్తు పంపిణీ సంస్థలు సుమారు 7,300 మెగావాట్ల గ్రీన్పవర్ను కొనుగోలు చేసేందుకు విద్యుత్తు నియంత్రణ మండలి ఆమోదం కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం ప్రస్తుత పరిస్థితికి మరో ఉదాహరణగా నిలుస్తున్నది. అయితే అసలు ప్రశ్న ఏందంటే-కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో పెద్దగా కనిపించని విద్యుత్తు కష్టాలు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నాయి?
రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి సరిపడా విద్యుత్తు సరఫరా కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు ఆరు గంటలకు మించి విద్యుత్తు సరఫరా కావడం లేదని, వచ్చిన ఆ కొద్దిపాటి విద్యుత్తు కూడా నిరంతరాయంగా ఉండటం లేదని చెప్తున్నారు. తరచూ ట్రిప్పింగ్, లోడ్ పెరుగడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామిక వేత్తలు తమ విద్యుత్తు అవసరాలకు జనరేటర్లను వాడుతున్నారు. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పంట పొలాల వద్ద కాపలా కాస్తున్నారు. విద్యుత్తు కోసం రైతులు రోడ్లపైకి రావడం, సబ్స్టేషన్లను ముట్టడించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
24 గంటల ఉచిత విద్యుత్తు ఎక్కడ?
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు అందించారు. రైతులు తమ పంటలకు అవసరమైన నీటిని బోర్ల ద్వారా అందించుకునేందుకు గత సర్కార్ నిరంతర విద్యుత్తు సరఫరా కల్పించడాన్ని వ్యవసాయ రంగానికి కీలకమైన మద్దతుగా భావించింది. అయితే ఇప్పుడు రైతులు విద్యుత్తు కోసం ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇది కేవలం విద్యుత్తు ఉత్పత్తి సమస్యగా చూడటం సరిపోదు. నీటి నిర్వహణ, విద్యుత్తు ఉత్పత్తి, జలవిద్యుత్తు వినియోగం, థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి, భూగర్భజలాల వినియోగం, పంపింగ్ అవసరాలు, పంపిణీ వ్యవస్థ సామర్థ్యం-ఇవన్నీ పరస్పరం అనుసంధానమైన అంశాలు.
శ్రీశైలం నీటిని ఎందుకు వినియోగించలేదు?
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ జెన్కో శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటిమట్టం అందుబాటులో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయగల జలవిద్యుత్తు కోసం నీటిని వినియోగించారు. నీరు తక్కువ ఉన్నప్పుడు ఖర్చుతో కూడుకున్నదైనా రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని వినియోగించుకుని జలవిద్యుత్తు ఉత్పత్తి చేశారు. జలవిద్యుత్తుకు అందుబాటులో ఉన్నప్పుడు దానిని వినియోగించడం ద్వారా ఖరీదైన ప్రత్యామ్నాయ విద్యుత్తు కొనుగోళ్ల అవసరాన్ని తగ్గించవచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్‌కు అవసరమైన నీటిని తరలించేందుకు సహకరిస్తున్నదనే విమర్శలు ఉన్నాయి. శ్రీశైలం నీటిని తగిన స్థాయిలో వినియోగించి జలవిద్యుత్తు ఉత్పత్తి చేయలేదనే ఆరోపణ కూడా ఉన్నది. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన కృష్ణా నీటిని ఎత్తిపోసి నిల్వ చేయకపోవడం వల్ల కూడా పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందనే వాదన ఉన్నది. దీని ఫలితంగా భూగర్భజలాలు మరింత అడుగంటిపోయి, రైతులు పంటలను కాపాడుకోవడానికి బోరుబావులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీరు భూమిలో లేకపోతే బోర్లు మరింత లోతుకు వెళ్లాలి. ఇదే జరిగితే నీటిని పైకి తోడేందుకు మరింత విద్యుత్తు అవసరం. విద్యుత్తు వినియోగం పెరిగితే పంపిణీ వ్యవస్థపై మరింత భారం పడుతుంది. ఇది ఒక దుష్చక్రంగా మారుతుంది.
గోదావరి జలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్న సమయంలో వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు పంప్‌హౌస్‌ల ద్వారా విద్యుత్త్తు వినియోగ డిమాండ్ లేనప్పుడు ఎత్తిపోసి, రిజర్వాయర్లు, చెరువులను నింపి ఉంచినట్లయితే రైతులు బోర్లపై అంతగా ఆధారపడాల్సిన అవసరం ఉండేది కాదనే వాదన ఉన్నది. నీటిని ముందుగానే నిల్వ చేసుకుని ఉంటే భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గేది. బోరుబావుల వినియోగం తగ్గితే వ్యవసాయ పంపింగ్‌కు వినియోగించే విద్యుత్తు కూడా తగ్గే అవకాశం ఉండేది. అంటే నీటి నిర్వహణలో తీసుకునే నిర్ణయాలు చివరికి విద్యుత్తు డిమాండ్‌ను కూడా ప్రభావితం చేస్తాయి.
పూర్తి సామర్థ్యంతో ఎందుకు వాడరు?
తెలంగాణకు మరో ముఖ్యమైన విద్యుత్తు వనరు థర్మల్ విద్యుత్తు. కేసీఆర్ సర్కార్ విద్యుత్తు అవసరాల కోసం ఏర్పాటు చేసి, ఇప్పటికే అందుబాటులో ఉంచిన థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను సక్రమంగా నిర్వహించి, వాటి స్థాపిత సామర్థ్యాన్ని సాధ్యమైనంత సమర్థవంతంగా వినియోగించుకుని ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. అందుకు ముఖ్యంగా నాణ్యమైన బొగ్గు నిరంతరాయంగా అందుబాటులో ఉండాలి. నాణ్యత లేని లేదా తగిన ప్రమాణాలు లేని బొగ్గును ఉపయోగించడం వల్ల ప్లాంట్ల సామర్థ్యం తగ్గడం, యంత్రాలపై ఒత్తిడి పెరుగడం, నిర్వహణ సమస్యలు రావడం, విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం పడిపోవడం వంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నది. కనుక థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలి. నాణ్యమైన బొగ్గు సరఫరా, ప్లాంట్ల సమర్థ నిర్వహణ, అవసరమైన నిర్వహణ పనులను ముందుగానే పూర్తి చేయడం, సాంకేతిక లోపాలను వెంటనే పరిష్కరించడం, ఇవన్నీ విద్యుత్తు ఉత్పత్తి స్థిరత్వానికి కీలకం. ఒకవైపు రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయగల విద్యుత్తును పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయకుండా, మరోవైపు బయటి నుంచి అధిక ధరలకు విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వస్తే ఆ అదనపు భారం చివరికి వినియోగదారులపైనే పడుతుంది. అందువల్ల కొత్త విద్యుత్తు కొనుగోళ్లపై మాత్రమే ఆధారపడకుండా, ఇప్పటికే ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ఎంతమేరకు సమర్థవంతంగా ఉపయోగిస్తున్నామనేది ప్రజలకు వివరించాలి.
ఎల్ నినోను ఎందుకు పట్టించుకోలేదు?
ఎల్ నినో ప్రభావంతో తీవ్రమైన కరువు ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. కరువు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నీటి నిల్వలు, సాగునీటి ప్రణాళిక, తాగునీటి అవసరాలు, భూగర్భజలాల పరిరక్షణ, విద్యుత్తు డిమాండ్ వ్యవసాయ పంపింగ్ అవసరాలపై ముందస్తు ప్రణాళిక అవసరం. అది లేకపోతే కరువు వచ్చిన తర్వాత రైతులు బోర్లపై ఆధారపడటం, బోర్ల వినియోగంతో విద్యుత్తు డిమాండ్ పెరుగడం సహజమే.
భారం వినియోగదారులపైనేనా?
ఇప్పటికే విద్యుత్తు సరఫరా సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలపై మరో భారం ట్రూ-అప్ చార్జీల రూపంలో పడే పరిస్థితి ఏర్పడకూడదు. విద్యుత్తు పంపిణీ సంస్థలు ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రూ-అప్ పిటిషన్లను సకాలంలో విద్యుత్తు నియంత్రణ మండలి ముందు దాఖలు చేయాలి. అనేక సంవత్సరాలపాటు ట్రూ-అప్ పిటిషన్లను పెండింగ్‌లో ఉంచి, తర్వాత ఒకేసారి భారీ మొత్తాలను క్లెయిమ్ చేయడం సరైన విధానం కాదు.
ముఖ్యంగా పంపిణీ సంస్థలు కోరిన మొత్తాన్ని మొత్తం ఆమోదించాల్సిన అవసరం లేదు. వాస్తవ ఆదాయం, వాస్తవ వ్యయం, అనుమతించదగిన ఖర్చులు, సమర్థత తదితర అంశాలను పరిశీలించిన తర్వాత కమిషన్ ట్రూ-డౌన్ చేయవచ్చు. గతంలో కూడా పంపిణీ సంస్థలు ట్రూ-డౌన్ అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ట్రూ-అప్ పిటిషన్లు దాఖలు చేసిన సందర్భాల్లో, కమిషన్ చైర్మన్, సభ్యులు వివిధ అంశాలను పరిశీలించి కోరిన మొత్తాన్ని యథాతథంగా ఆమోదించని సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ట్రూ-అప్ అనేది పంపిణీ సంస్థలు కోరిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి తప్పనిసరిగా వసూలు చేసుకునే హక్కు కాదు.
భారం కిరాయిదారు ఎందుకు చెల్లించాలి?
ట్రూ-అప్ ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల ఎదురయ్యే మరో సమస్య అద్దె ఇండ్ల విషయంలో ఉంటుంది. ఒక ఇంట్లో ఐదేండ్ల క్రితం ఒక కిరాయిదారు నివసించాడు. ఆ కాలంలో వినియోగించిన విద్యుత్తుకు సంబంధించిన అదనపు భారం ఏండ్ల తర్వాత ట్రూ-అప్ రూపంలో వస్తే, అప్పటికి ఆ ఇంట్లో నివసిస్తున్న ప్రస్తుత కిరాయిదారుపై ఆ భారాన్ని మోపడం న్యాయసమ్మతమా? ప్రస్తుత కిరాయిదారు చెల్లించడానికి నిరాకరిస్తే ఆ భారం ఇంటి యజమానిపై పడే అవకాశం ఉంటుంది. చివరికి బకాయి పేరుతో విద్యుత్తు సరఫరా నిలిపివేసే పరిస్థితి కూడా రావచ్చు. పంపిణీ సంస్థల పరిపాలనా ఆలస్యానికి వినియోగదారులు ఎందుకు మూల్యం చెల్లించాలి? ఇది విద్యుత్తు నియంత్రణ మండలి కూడా తీవ్రంగా పరిగణించాల్సిన అంశం.
ఏఆర్‌ఆర్‌లోనే లెక్కలు తేల్చాలి
ఆలస్యమైన ట్రూ-అప్‌లను కొన్నేండ్ల తర్వాత ప్రత్యేక పిటిషన్ల ద్వారా క్లెయిమ్ చేయడం కంటే, సంబంధిత సంవత్సరాల ఏఆర్ఆర్ (Annual Revenue Requirement)లోనే అవసరమైన క్లెయిమ్‌లను చేర్చి కమిషన్ పరిశీలనకు పెట్టడం సముచితమైన విధానం. ప్రతి సంవత్సరం లెక్కలు పూర్తి చేసి, వాస్తవ ఆదాయంవ్యయాలను సమర్పించి, అవసరమైన సర్దుబాట్లను అదే సమయంలో చేయాలి.సంస్థల ఆలస్యం ప్రజలపై ఆర్థిక శిక్షగా మారకూడదు. రాబోయే ఆరు నెలలు అత్యంత కీలకం. తెలంగాణలో నీటి కొరత మరిం త తీవ్రమయ్యే అవకాశం ఉన్నది. తాగునీటి అవసరాలను తీర్చడం కూడా సవాల్‌గా మారే పరిస్థితి ఏర్పడవచ్చు. కృష్ణా, గోదావరి జలాలను అవసరమైన స్థాయిలో ఎత్తిపోతల ద్వా రా వినియోగించుకోకపోవడం, అందుబాటులో ఉన్న నీటిని ముందుగానే నిల్వ చేసుకోకపోవడం వల్ల భూగర్భజలాలపై ఆధారపడటం పెరుగుతుం ది. భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లే కొద్దీ బోర్ల నుం చి నీటిని పైకి తీసుకురావడానికి ఎక్కు వ విద్యు త్తు అవసరమవుతుంది. అప్పుడు నీటి కొరత – బోర్లపై ఆధారపడటం – విద్యుత్తు డిమాండ్ పెరుగడం – పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి – ట్రాన్స్ఫార్మర్లపై భారం – ట్రిప్పింగ్ – విద్యుత్తు అంతరాయాలు అనే దుష్చక్రం మరింత తీవ్రం కావచ్చు.
కృష్ణా, గోదావరి జలాలను అవసరమైన స్థాయిలో ఎత్తిపోతల ద్వారా వినియోగించుకోకపోవడం, అందుబాటులో ఉన్న నీటిని ముందుగానే నిల్వ చేసుకోకపోవడం వల్ల భూగర్భజలాలపై ఆధారపడటం పెరుగుతుంది. భూగర్భజలాలు మరింత లోతుకు వెళ్లే కొద్దీ బోర్ల నుంచి నీటిని పైకి తీసుకురావడానికి ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది. అప్పుడు నీటి కొరత – బోర్లపై ఆధారపడటం – విద్యుత్తు డిమాండ్ పె రుగడం – పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి – ట్రాన్స్ఫార్మర్లపై భారం – ట్రిప్పింగ్ – విద్యుత్తు అంతరాయాలు అనే దుష్చక్రం మరింత తీవ్రం కావచ్చు.
చిన్న పరిశ్రమలకు మరో శాపంగా మారకూడదు
ఇప్పటికే చిన్న కంపెనీలు, పరిశ్రమలు ముడిసరుకు ధరలు, వడ్డీ భారం, మార్కెట్ పోటీ, ఉత్పత్తి వ్యయాల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ట్రూ-అప్ చార్జీల రూపంలో అదనపు భారం పడితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు’గా, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న పరిశ్రమలు మరింత అప్పులపాలయ్యే ప్రమాదం ఉన్నది. ఉత్పత్తి వ్యయం పెరిగి పోటీ సామర్థ్యం తగ్గవచ్చు. చివరికి కొన్ని పరిశ్రమలు మూతపడే పరిస్థితి కూడా రావచ్చు. ఇది కేవలం పరిశ్రమల సమస్య కాదు. పరిశ్రమలు మూతపడితే ఉద్యోగా లు తగ్గుతాయి. ఉత్పత్తి తగ్గుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుంది. విద్యుత్తు సమస్యను కేవలం మరింత విద్యుత్తు కొనుగోలు చేయాలి అనే విధానంతో పరిష్కరించడం సా ధ్యం కాదు.
ప్రభుత్వం ముందుగా కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్ల పూర్తి సామర్థ్యాన్ని ఎందుకు వినియోగించలేకపోతున్నాం? నాణ్యమైన బొగ్గును నిరంతరాయంగా అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అందుబాటులో ఉన్న జలవిద్యుత్తును ఎంతమేరకు వినియోగిస్తు న్నాం? కృష్ణా, గోదావరి నీటిని ఎంతమేరకు సమర్థవంతంగా నిల్వ చేసి వినియోగిస్తున్నాం? భూగర్భజలాలపై రైతులు ఆధారపడటాన్ని ఎలా తగ్గించబోతున్నారు? విద్యుత్తు పంపిణీ వ్యవస్థను ఆధునీకరించడానికి ఏ చర్యలు తీసుకుంటున్నా రు? పంపిణీ సంస్థలు సకాలంలో ట్రూ-అప్ పిటిషన్లు ఎందుకు దాఖలు చేయలేదు? వినియోగదారులపై అదనపు భారం పడకుండా ట్రూ-డౌన్‌ను ఎలా అమలు చేయబోతున్నారు? గ్రీన్ పవర్ కొనుగోళ్ల ఖర్చు ఎంత? ఉత్పత్తి చేయగల విద్యుత్తును సమర్థవంతంగా వినియోగించడం ఎంత చౌక? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం ప్రజల ముందు పారదర్శకంగా సమాధానం ఇవ్వాలి.
తెలంగాణకు విద్యుత్తు కొరత సహజంగా వచ్చిన సమస్య కాదు. నీటి నిర్వహణ, విద్యుత్తు ఉత్పత్తి, జలవిద్యుత్తు వినియోగం, థర్మల్ విద్యు త్తు ప్లాంట్ల సామర్థ్యం, నాణ్యమైన బొగ్గు సరఫరా, పంపిణీ వ్యవస్థ సామర్థ్యం, భూగర్భజలా ల వినియోగం-ఇవన్నీ సమర్థవంతంగా నిర్వహించలేకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులు. ఒకవైపు రైతులకు సరిపడా విద్యుత్తు అందకపోవ డం, మరోవైపు పరిశ్రమలు అధిక విద్యుత్తు ఖర్చులతో ఇబ్బందిపడటం, ఇంకోవైపు వినియోగదారులపై ట్రూ-అప్ చార్జీల భారం పడే పరిస్థితి రావడం-ఇది ఆరోగ్యకరమైన విద్యుత్తు విధానానికి సంకేతం కాదు.
ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లపై మాత్రమే ఆధారపడకుండా, రాష్ట్రంలోని థర్మల్ ప్లాంట్లను పూర్తి సామర్థ్యంతో నడుపాలి. నాణ్యమైన బొగ్గును సమయానికి అందించాలి. అందుబాటులో ఉన్న జలవిద్యుత్తును సమర్థవంతంగా వినియోగించాలి. కృష్ణా, గోదావరి జలాలను ప్రణాళికాబద్ధంగా వినియోగించి భూగర్భజలాలపై ఒత్తిడిని తగ్గించాలి. అదే సమయంలో పంపిణీ సంస్థలు తమ లెక్కలను సకాలంలో పూర్తిచేసి ట్రూ-అప్ పిటిషన్లు దాఖలు చేయాలి. సంస్థల పరిపాలనా ఆలస్యానికి వినియోగదారులను బాధ్యులను చేయకూడదు.
ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు కావాలి
రైతులకు 24 గంటల నమ్మకమైన విద్యుత్తు కావాలి-మధ్యలో ట్రిప్ అయ్యే సరఫరా కాదు. పరిశ్రమలకు స్థిరమైన విద్యుత్తు ధరలు కావాలి-అనూహ్యమైన అదనపు భారాలు కాదు. వినియోగదారులకు పారదర్శకమైన లెక్కలు కావాలి-ఏండ్ల తర్వాత వచ్చే షాక్ బిల్లులు కాదు. చివరికి ప్రశ్న ఒక్కటే-విద్యుత్తు వ్యవస్థలో జరిగిన తప్పులకు ప్రజలు మూల్యం చెల్లించాలా? లేదా బాధ్యత వహించాల్సింది పాలనా వ్యవస్థేనా? ప్రజలు ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం కోరుతున్నారు.
(వ్యాసకర్త: తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్)
తన్నీరు శ్రీరంగారావు