సాగునీటి కోసం అర్ధరాత్రి జాగారం
పంట చేతికొచ్చే దశలో సాగునీటి కొరత అన్నదాతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రాత్రిపూట వచ్చే కొద్దిపాటి నీటికోసం రైతులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాలువల వెంట జాగారం చేస్తున్నారు.
- వంతుల వారీగా నీటి కోసం కాలువల వద్ద పడిగాపులు
- మంచిర్యాల జిల్లా తాళ్లపేటలో రైతుల దుస్థితి
దండేపల్లి, నవంబర్ 16 : పంట చేతికొచ్చే దశలో సాగునీటి కొరత అన్నదాతలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. రాత్రిపూట వచ్చే కొద్దిపాటి నీటికోసం రైతులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాలువల వెంట జాగారం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట సమీపంలో డిస్ట్ట్రిబ్యూటరీ-22 వద్ద తాళ్లపేట, రాంపూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతులు గజగజ వణికే చలిని సైతం లెక్క చేయకుండా కాలువల వద్ద చలిమంట కాచుకుంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పొలాలకు నీరందించే కాలువల్లో నీటి ప్రవాహం తగ్గడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రి 10 నుంచి తెల్లవారుజాము వరకు నీటి కోసం టార్చ్లైట్లు, కర్రలు పట్టుకొని కాలువల గట్లపై కాపలా కాస్తున్నారు. తమవంతు ఎప్పుడు వస్తుందోనని, ఇతరులు నీటిని మళ్లించుకుంటే చేతికొచ్చిన పంటలు ఎండిపోతాయనే భయంతో అర్ధరాత్రి వేళ పొలాల వద్దే ఉండిపోతున్నారు.
విషసర్పాలు, వణికించే చలిలో..
రాత్రి వేళల్లో పొలాల వద్దకు వెళ్లడం వల్ల విష సర్పాలు, ఇతర జంతువుల బారిన పడే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు గజగజ వణికించే చలిలో రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. కష్టపడి వేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే చూడలేకపోతున్నామని.. అందుకే ఎంతటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాత్రంతా కాలువల దగ్గరే కావలి కాస్తున్నామని తిమ్మాపూర్‌కు చెందిన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరిపంట పొట్ట దశలో ఉన్నప్పుడు నీటి సరఫరాను ఆపేయడం వల్ల పంటలపై తీవ్ర ప్రభావం పడిందని రైతులు అంటున్నారు. ఎండిన పంటలను తడిపేందుకు ఇప్పటికైనా నీటిపారుదల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో సాగు నీటిని అందించాలని కోరుతున్నారు. తూముల వద్ద అక్రమంగా నీటిని మళ్లించకుండా నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

