‘పాలకులకు చదివే తీరిక ఉండదు. కానీ, అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు’ అన్నాడు ప్లేటో. నేడు మన దేశంలో అలాంటి ఉత్తమ పాలకులు కరువయ్యారు. భారతీయుల సుఖ జీవనం కోసం తమ ధన, మాన, ప్రాణాలర్పించి భరతమాతకు విముక్తి కల్పించారు స్వాతంత్య్ర సమరయోధు లు. కానీ, వారి ఆశయాలకు భిన్నంగా స్వతంత్ర భారతంలో సమన్యాయ పాలన జరగకపోగానేటికీ కూడు-గూడు-గుడ్డ, విద్య-వైద్యాలకు దప్పిక గొన్న భారతీయులు కోట్లలో ఉన్నారనేది చేదు నిజం.
దేశంలో నూతన ఆర్థిక విధానాలు ప్రవేశించిన 1990వ దశకం నుంచి ఆర్థిక అసమానతలు ఆకాశాన్నంటాయి. కొద్దిమంది కోటీశ్వరులు ప్రపంచ కుబేరులుగా ఎదుగుతుంటే, కోట్ల మంది పేదలు నిరు పేదలవుతున్నారు. ఉదాహరణకు.. జీఎస్టీ రీత్యా అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో ఐదో స్థానానికి ఎదిగిన భారత్.. సామాన్యుల జీవన ప్రమాణాల రీత్యా 134వ స్థానానికి దిగజారింది. ప్రపంచ కుబేరుల రీత్యా పదో స్థానానికి ఎగబాకిన భారత్ పేదరికాన్ని నిర్మూలించుకున్న దేశాల జాబితాలో 113వ స్థానంలో నిలిచింది. ప్రపంచ బ్యాంకు తదితర సంస్థల సర్వేలు, ఐరాస నివేదికలు చెప్తున్న కఠోర వాస్తవాలివి.
ఏ దేశ ప్రగతి సాధనకైనా పాలకులు పాటించాల్సిన సూచనలను రూపొందించినందుకు 2024 నోబెల్ బహుమతి అందుకున్న ఆర్థికవేత్తలు డారెన్ అసిమోగ్లు, జేమ్స్ ఏ రాబిన్సన్, సైమన్ జాన్సన్ సూచనలు పరిశీలిస్తే, వాటిలో కొన్నింటినైనా పాటించి ఉన్న దేశాలే తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధిని సాధించినట్టు స్పష్టమవుతున్నది. వాటిలో స్టాలిన్ కాలంలో రష్యా, డెంగ్ జియావో పింగ్ హయాంలో చైనా, కేసీఆర్ పాలనలో తెలంగాణ ఉన్నాయి. అధ్యయనశీలురైన నేతల ప్లానింగ్ వల్లనే అనతికాలంలో అత్యధిక ప్రగతిని సాధించగలిగాయి.
కేసీఆర్ కూడా ఇంచుమించు ఇలానే రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. అనుభవం, చూడటం, విన డం, చదవడం ద్వారా అపార రాజకీయ, ఆర్థిక పరిజ్ఞానాన్ని సముపార్జించుకున్న రాజనీతిజ్ఞుడు కేసీఆర్. డెంగ్జియాంగ్ లానే బడ్జెట్లో అత్యధిక నిధులను వ్యవసాయరంగానికి కేటాయించారు. ‘మిషన్ కాకతీయ’ ద్వారా కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు నిర్మించారు. 100 శాతం సాగునీటి వనరులను పెంపొందించుకున్న రాష్ట్రంగా ‘నీతి ఆయోగ్’ ప్రశంస అందుకున్నది తెలంగాణ. కేసీఆర్.. సాగునీటి రంగానికే పరిమితం కాలేదు. రాష్ర్టానికి వర్షాభావ పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు, 19 శాతానికి పతనమైన అడవులను ఐదేండ్లలో 27 శాతానికి పునరుద్ధరించారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, వగైరా ప్రోత్సాహకాలతో వ్యవసాయరంగాన్ని పరుగులు పెట్టించారు. కేసీఆర్ కృషి ఫలితంగా దేశంలోనే అత్యధిక వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది.
కార్పొరేట్ దవాఖానల గుత్తాధిపత్యం కొనసాగకుండా, వాటికి దీటుగా ప్రభుత్వ వైద్యరంగాన్ని మెరుగుపరిచారు కేసీఆర్. ప్రైవేటు విద్యాసంస్థల హవా కొనసాగకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రశంసనీయంగా మెరుగుపరిచారు. పదేండ్ల పాలనలో ఒక్క మత కల్లోలానికి కానీ, ఉగ్ర విధ్వంసానికి కానీ తావులేని ప్రశాంత పాలన అందించారు.
గురుకులాలు, జిల్లాకో మెడికల్ కళాశాల, ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణాల ద్వారా, మానవ వనరుల ఉత్పత్తిని గణనీయంగా పెంచారు కేసీఆర్. ఆర్టీసీని ప్రైవేటు రవాణా వ్యవస్థతో పోటీపడేలా చేసి లాభాల బాట పట్టించారు. ‘ఐటీ హబ్’ ద్వారా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించారు. ఆశ్రిత పక్షపాతానికి తావులేని పారదర్శక నియామకాల ద్వారా సంస్థలను సమర్థవంతంగా, అవినీతి రహితంగా పని చేయించారు. సమర్థుల నియామకం, టెక్నాలజీ వినియోగం ద్వారా పోలీసు వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు.
వర్తమాన భారత పాలక వర్గాలను పరిశీలిస్తే కొంద రు కమ్యూనిస్టు నేతలు మినహా జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతల్లో కేసీఆర్ వంటి అధ్యయనశీలురు లేరన్న విషయం స్పష్టమవుతుంది. బీఆర్ఎస్పైనా, కేసీఆర్‌పైనా కాంగ్రెస్, బీజేపీ కక్ష పెంచుకోవడానికి కారణం ఇదేనని అర్థం చేసుకోవచ్చు. ఈ వాస్తవాన్ని మననం చేసుకుంటూ తెలంగాణ ప్రజలు, మేధావులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
పాతూరి వెంకటేశ్వరరావు 93490 81889