ఇటీవల నిషేధితపు జాబితాలో సెక్షన్ 22-A(1)(a) నుంచి (e) వరకు సంబంధించిన భూముల వివరాలపై గందరగోళ పరిస్థితి నెలకొన్నది. హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రెవెన్యూ అధికారులు జాబితా ప్రకటించలేదు. వాటిపై సరైన అవగాహన లేకపోవడంతోపాటు పాత రికార్డులను (సేత్వార్, ఖస్రాపహాణీ) ఆధారంగా చేసుకొని జాబితాను తయారు చేశారు. వాటి తర్వాత జరిగిన పరిణామాలను పరిగణించలేదు. వాటిని జిల్లా స్థాయి అధికారులు కూడా పరిశీలించకపోవడం, ప్రజల నుంచి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించకుండా, ఏకపక్షంగా భూభారతి పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. తద్వారా రైతులు అనేక బాధలకు గురవుతున్నారు. రైతుల ప్రమేయం లేకుండా, అన్యాయంగా నిషేధిత జాబితాలో చేరిన భూముల వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి.
ఇక సెక్షన్ 22-A(1) to(e) జాబితా గెజిట్ ద్వారా నోటిఫై చేసిన వాటిపై జీవో 98 ద్వారా ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సుమోటోగా అన్యాయంగా చేరిన వాటిపై డీనోటిఫై చేసే విధంగా జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు తెప్పించాలి.
రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం ఆరుట్ల జాగీర్ గ్రామం, జాగీరు చట్టంలోని సర్క్యులర్ 2 ఆఫ్ 1949 ప్రకారం రైతులు స్వయంగా సేద్యం చేసి, జాగీర్దార్‌కు పన్ను (శిస్తు) కట్టిన వారిని ’పట్టాదారు’గా చేయమన్న ఆదేశాల మేరకు వారిని పట్టదారుగా నమోదు చేశారు. అయితే ఆరుట్ల గ్రామ రికార్డులో 1967-68 వరకు ప్రభుత్వ భూమిగానే రికార్డ్ చేసినందున, రైతుల వినతి మేరకు, అప్పటి కలెక్టర్ విచారణ జరిపి సప్లిమెంటరీ సేత్వార్ జారీ చేసి, ఆ భూమి క్లాసిఫికేషన్‌ను పట్టాగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
తదుపరి అప్పటి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మెంబర్ కలెక్టర్ ఉత్తర్వులను (అప్పీల్స్‌లో) సమర్థించారు. జమాబందీలో నాజీం జమాబందీ ఆమోదం మేరకు 1968 నుంచి 2007 వరకు రెవెన్యూ రికార్డులో పట్టా భూమిగా నమోదు చేశారు. 2007 తర్వాత ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ‘లావుని’ పట్టాగా అప్పటి వీఆర్వో నమోదు చేశారు. అది ఇప్పటివరకు ’లావుని’ పట్టాగా కొనసాగుతున్నది. ఇది కేవలం ఒక వీఆర్వో తప్పిదం వల్ల అక్కడి రైతులు వాటిని పట్టాభూమిగా నమోదు చేసుకోవడానికి అనేక కష్టాలు పడుతున్నారు. అంతేకాకుండా కలెక్టర్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది మానవ తప్పిదం, రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి, పట్టాభూమిగా మార్చవచ్చు. కానీ వారు చర్యలు తీసుకోవడంలేదు. సంబంధిత ఒరిజినల్ రికార్డ్స్‌ను కోరడం శోచనీయం. రికార్డ్స్‌ను భద్రపరచే విధి రెవెన్యూ అధికారులదే.
రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్ మండలంలోని కడ్తాల్ గ్రామ సర్వే నంబర్ 927/1, 928/1, 929/1, 931/1, 932/1 ఇనామ్ భూమిగా రికార్డు అయినందున, 2001లో అప్పటి ఆర్డీవో ఓఆర్సీ జారీ చేయడం, ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్పిడి చేసుకోవడం, లేఅవుట్ అనుమతి ఇవ్వడం కూడా చేశారు.
అయితే ఆ భూమిని గెజిట్ నంబర్ 199 ద్వారా (31-12-2025) 22A (1)(e)లో చేర్చారు. సెక్షన్ 22-A(1)(e)లో కేవలం ఐటీ, ఈడీ లేదా కోర్ట్ ఉత్తర్వుల ద్వారా అటాచ్ చేసిన భూములు, భూసేకరణకు గురైన భూములు అందులో చేర్చాలి. కానీ, ఇందులో ఇనామ్ భూమిగా నోటిఫై చేయడం, దానిని తహసీల్దార్ నుంచి మొదలుకొని ఎవరూ పరిశీలించకుండా ఆర్డీవో/అడిషనల్ కలెక్టర్/కలెక్టర్ సంతకాలు చేయడమే కాకుండా భూభారతి పోర్టల్‌లో నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. దీని వల్ల ఓఆర్సీ హోల్డర్ కేవలం అధికారుల తప్పిదం వల్ల జీవోఎంఎస్ నంబర్ 98 (23-08-23) ద్వారా ఏర్పాటు చేసిన కమిటీకి అప్పీల్ చేయడం, వారికి ఖర్చుతో కూడినది, అనవసరంగా కాలయాపనయే కాకుండా, మానసికక్షోభకు గురయ్యారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నాస్కల్ గ్రామంలో సర్వే నంబర్ 202, 35లోని విస్తీర్ణం 2-22 గుంటలు భూదాన్ భూమిగా నిషేధిత జాబితాలో చేర్చారు. అసలు దానపత్రంలో కేవలం గుంజరి రామన్న S/o గుంజరి రామయ్య భూదానం చేసినట్టు, అందులో సర్వే నంబర్ లేదు. కానీ, పరిగి తహసీల్దార్ ప్రొసీడింగ్స్ నంబర్ A4/511/64(23-07-64) ద్వారా పైన పేర్కొన్న రెండు సర్వే నంబర్లు 202, 35 విస్తీర్ణం 2-22 గుంటలు భూదాన్‌లో చేర్చడం, యజమానులు సర్వే నంబర్ 202 తమ భూమిని భూదాన్ భూమి కాదని అర్జీ పెట్టుకోవడం, ఆ అర్జీని పరిష్కరించాలని డబ్ల్యూపీ నంబర్ 19814/23 (15-07-23) ఉత్తర్వుపై పరిగి తహసీల్దార్ తమ నివేదికను B/1689/05 ద్వారా (తేదీ 13-10-23) కలెక్టర్‌కు పంపగా, కలెక్టర్ భూదాన్ బోర్డుకు వారి లేఖ నంబర్ E1/2281/23 (23/10/25) ద్వారా సర్వే నంబర్ 202 తప్పుగా భూదాన్ భూమిగా నమోదు అయినందున దాన్ని డీనోటిఫై చేయాలని కోరగా, దానికి భూదాన్ అధికారులు దానపత్రంలో సర్వే నంబర్ 202 లేనప్పటికీ అప్పటి తహసీల్దార్ అనుమతి లేఖలో ఉన్నందున తదుపరి చర్య తీసుకోవాలని తిరిగి లేఖ నంబర్ టీఈవైబీ /A/641/23 తేదీ 4/12/2025 ద్వారా కలెక్టర్ కోరారు. దానిపై ఇప్పటివరకు ఎటువంటి చర్య కూడా తీసుకోకపోవడం శోచనీయం. పైన చెప్పినవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.
ప్రతి జిల్లాలోనూ ఇటువంటి భూములు అన్యాయంగా నిషేధిత జాబితాలో చేర్చారు. అందులో కొన్ని మానవ తప్పిదంతో కాకుండా, రెవెన్యూ రికార్డులను పరిశీలించకుండా జాబితాను తయారు చేశారు.
ప్రస్తుత జాబితాలోనే కాకుండా 2007లో తయారు చేసిన జాబితాల్లోనూ అనేక తప్పిదాలు జరిగాయి. వాటిని గురించి పట్టించుకోక పోవడం శోచనీయం. అవి ఇప్పటికీ నిషేధిత జాబితాలోనే కొనసాగడం గమనార్హం. వాటిని డీనోటిఫై చేసుకోవడానికి గతంలో ధరణి మాడ్యూల్, ప్రస్తుతం భూభారతి (టీఎం) మాడ్యూల్ ఆన్లైన్లో తగు రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవడం, అందులో చాలా వరకు అదనపు కలెక్టర్ లాగిన్‌లోనూ, ఇంకా కొన్ని కలెక్టర్ లాగిన్‌లో పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని కూడా క్షుణ్నంగా పరిశీలించి, అసలు ప్రస్తుతం తయారు చేసిన నిషేధిత జాబితాలో (a)to(d)లతోపాటు (e)లను కూడా గ్రామ సభల్లో వినిపించి లేదా గ్రామంలో ప్రచురించి అభ్యంతరాలను రాతపూర్వకంగా, తగిన ఆధారాలతో బాధితుల నుంచి స్వీకరించాలి. సంబంధిత తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి వచ్చిన వాటిని రికార్డుయుక్తంగా క్షుణ్నంగా పరిశీలించి, ఒక స్పీకింగ్ ఆర్డర్ ద్వారా వాటిని తొలగించడమో లేదా అలాగే కొనసాగించడమో సంబంధిత వ్యక్తులకు తెలియచేయాలి. తిరస్కరించిన వాటిపై అప్పీల్ చేసే అధికారం కూడా సీసీఎల్ఏకు అధికారం ఇవ్వాలి.
ఇక సెక్షన్ 22-A(1)to(e) జాబితా గెజిట్ ద్వారా నోటిఫై చేసిన వాటిపై జీవో 98 ద్వారా ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సుమోటోగా అన్యాయంగా చేరిన వాటిపై డీనోటిఫై చేసే విధంగా జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు తెప్పించాలి. లేదంటే కమిటీ ముందు ఉన్న అప్పీళ్లను త్వరితగతిన పరిష్కరించేలా విధంగా కమిటీ నిర్ణయం తీసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం గానీ, రెవెన్యూ అధికారులు గానీ, నిజాయితీగా, చిత్తశుద్ధితో తగిన చర్యలు తీసుకోవాలి. అన్యాయంగా నిషేధితపు జాబితాలో చేర్చిన భూములను తొలగించాలి.
పి.భవాని