ఉమ్మడి రాష్ట్రంలోని రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో నేను 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుకున్నాను. అంతేకాదు, పీజీ నుంచి పీహెచ్డీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో చదువుకున్న. దీంతో హాస్టళ్ల పరిస్థితులను దగ్గరినుంచి చూసిన అనుభవం నాకున్నది. విద్యార్థి సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసిన అనుభవం కూడా ఉన్నది. ఆ రోజుల్లో హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులుండేవి. దొడ్డు బియ్యం, గొడ్డు కారంతో అన్నం తినేవాళ్లం. ఆ అన్నంలో ప్రతి రోజూ తెల్ల, లక్క పురుగులు కనిపించేవి. పచ్చి పులుసులో నల్లగా కనిపించేవి పోపుగింజలో, లక్కపురుగులో అర్థంకాక మేం తలలు పట్టుకునేవాళ్లం. ఓ రోజు నా మిత్రుడితో కలిసి అన్నం తింటున్న. అతను అన్నంలో ఒక్కో నల్ల గింజను ఏరడం మొదలు పెట్టాడు.
‘ఏందిరా ఆవాలను ఏరి పారేస్తున్నావు’ అని నేనడిగిన. ‘అవి నీ ప్లేట్‌లోనూ ఉన్నయి, అవి ఆవాలు కాదు, లక్క పురుగులు, మంచిగ చూసి తిను’ అని చెప్పిండు. ఆ రోజు నుంచి నేను కూడా తినే కంచంలో నల్ల పురుగులు, తెల్ల పురుగులను ఏరి పక్కన పడేసి అన్నం తినేవాడిని. ఇలాంటి దురదృష్టకర పరిస్థితులను ఎవరికి చెప్పుకోవాల్నో కూడా అర్థం కాక ఏడ్చిన సందర్భాలున్నయి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్న నాకు, తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్‌తో పనిచేసే అవకాశం వచ్చింది. దీంతో విద్యార్థి సమస్యలపైన పోరాడిన.
2014 జూన్, 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, తొలి శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ విద్యార్థి నాయకులందరం కలిసి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లాం. మా చర్చల్లో భాగంగా సంక్షేమ హాస్టళ్లలో పెట్టే భోజనం గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడే హాస్టళ్లలో చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద పిల్లలకు పౌష్ఠికాహారంతో కడుపు నిండా భోజనం పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తీసుకో వడమే కాదు, తక్షణమే అమలుచేశారు. దేశంలో మొట్ట మొదటిసారిగా తెలంగాణలోని అన్ని హాస్టళ్లలోని విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నిండా బువ్వ పెట్టిన ఘనత కేసీఆర్‌ది. హాస్టళ్లలో ఉండే విద్యార్థుల సమస్యలను కేసీఆర్ ఆషామాషీగా తీసుకోలేదు. భావి పౌరులు తయారయ్యేది విద్యాలయాల నుంచే గనుక వారికి మంచి భోజనం పెట్టాలని తరచూ చెప్పేవారు. అందు లో భాగంగానే హాస్టళ్లలో ఉండే సమస్యలను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడే పరిష్కరించేవారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కేసీఆర్‌కు ఒక ప్యాషన్ అయిపోయింది. కేజీ టు పీజీ విద్యాలయాల ఏర్పాటు కూడా అప్పుడే, ఆ సమయంలోనే కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టింది . అంతేకాదు, గురుకుల పాఠశాలలు వెయ్యికి పైగా ఏర్పాటయ్యాయి. వీటన్నింటి ఫలితమే తెలంగాణలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగడం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో నేను 2018లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాను. ఆ సమయంలో సంక్షేమ హాస్టళ్లలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టే భోజనం, గతంలో నేననుభవించిన హాస్టల్ కష్టాలు నా కండ్లముందు కద లాడాయి. కేసీఆర్ హాస్టళ్లలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుంటే విద్యార్థులపై ఉన్న ప్రేమతో ఆయన ఈ పనిచేస్తున్నారనే విషయం నాకర్థమైంది. అందుకే పదేండ్ల కేసీఆర్ పాలనలో ‘గురుకులాల్లో సీటు దొరికితే బాగుండు’ అని తల్లిదండ్రులు తాపత్రయపడ్డారు. కమిషన్ చైర్మన్‌గా ఉన్న మూడేండ్ల సమయంలో నేను దాదాపు 750 మంది ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు కమిషన్ చొరవతో, ఆనాటి గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సిఫారసు చేసి గురుకులాల్లో సీట్లు ఇప్పించగలిగాను. వారిప్పుడు ఉన్నత చదువులను అభ్యసిస్తున్నారు. నాకెంతో సంతృప్తిని కలిగించిన పనులివి.
నాడు రాష్ట్రంలోని గురుకులాలు అగ్రస్థాయిలో ఉంటే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలు అధమస్థాయిలో ఉన్నాయి. గురుకులాల్లో సీటు దొరికితే చాలు అనే స్థితి నుంచి పిలిచి సీటిచ్చినా తీసుకోని పరిస్థితి దాపురించింది. విద్యార్థులకు పాఠాల సంగతి దేవుడెరుగు.. మా బిడ్డల ప్రాణాలు బాగుంటే చాలునని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం లో రూ.62 వేల కోట్ల బడ్జెట్‌ను తెలంగాణ తొలి ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లకు పెంచింది. అయి నా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నది. ఏడాది కాలంలోనే సంక్షేమ హాస్టళ్లలోని స్థితిగతులు ఇలా దిగజారి పోతే, భవిష్యత్తు కాలంలో వాటి పరిస్థితిని ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తున్నది.
కేసీఆర్ హయాంలో గురుకులాల్లో చదివే విద్యార్థుల చికిత్స కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించేది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులు అనారోగ్యానికి గురైనా పట్టించుకోడం లేదు. పైగా ‘ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లండి, ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోండి’ అని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మెస్ చార్జీలు పెంచినట్టు ప్రచారం చేసుకుంటున్నది. కానీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చలికాలం వస్తే చాలు విద్యార్థుల కోసం స్లీప్ మ్యాట్స్, రగ్గులు పంపిణీ చేసేది. అంతేకాదు, వారానికో సారి చికెన్, నెలలో ఒకసారి మటన్‌తో భోజనం పెట్టేది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రగ్గులేమో కానీ, గుడ్లు కూడా సరిగా పెట్టడం లేదు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఒకే చోట మూడుసార్లు ఫుడ్ పాయిజన్ జరగడం విడ్డూరం. అందుకే విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని స్పష్టంగా అర్థమవుతున్నది. బీఆర్ ఎస్ హయాంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణ కోసం కౌన్సిలర్లు ఉండేవారు. ఇపుడు వారు ఎక్కడికివెళ్లారో తెలియడం లేదు. ఇదిలా ఉంటే భువనగిరి హాస్టల్లో ఇద్దరు విద్యార్థినులపై అత్యాచారం జరగడం బాధాకరం. అంతటి విషాదం జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా అనిపించడం లేదు. అందుకేనే మో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడం లేదు. రాష్ట్రంలో ఇప్పుడు విద్యార్థు బాగోగులను చూసుకునే విద్యాశాఖ మంత్రి లేడు. శాంతిభద్రతలను కాపాడే హోంశాఖ మంత్రి లేడు. రాష్ట్రంలో అసలు ఏం జరు గుతున్నదో అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 28 సార్లు వెళ్లేందుకు సమయం ఉంటుంది కానీ, విద్యార్థులు చనిపోతే మాత్రం వెళ్లి పరామర్శించే సమయం లేదా?
విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలనే ఆలోచనతోనే గత ప్రభుత్వం సంక్షేమ హా స్టళ్లను అద్భుతంగా తీర్చిదిద్దింది. ఆ లక్ష్యా నికి కాంగ్రెస్ ప్రభుత్వం గండి కొడుతున్నది. నాడు రా ష్ట్రంలో విద్యా ప్రమాణాలు కూడా పెరిగితే, నేడు క్షీణి స్తు న్నాయి. ఉ మ్మడి పాలనలో కనీస వసతులు లేక సంక్షేమ హాస్టళ్లు సమస్యలతో కొట్టుమిట్టాడాయి. కేసీఆర్ నేతృత్వం లోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యావ్యవ స్థలన్నీ పురోగతి సాధిస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ హయాం లో ఉమ్మడి ఏపీ నాటి స్థితికే చేరుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ఎలక్ట్రిసిటీ, మరుగుదొడ్లు, డ్రైనేజీ, వాటర్ పైప్లైన్లు తదితర పనుల ను యుద్ధ ప్రాతిపాదికన పూర్తిచేసింది. విద్యార్థులకు యూనిఫార మ్స్, బ్యాగులు, పుస్తకాలు అందించడంతో పాటు డైట్ ఛార్జీలు పెంచి నాణ్యమైన భోజనం అందించింది. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ హాస్టళ్లలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటుచేసింది. ప్రతి రోజూ ప్రత్యేక పర్యవేక్షణతో విద్యార్థులకు రక్షణ కల్పించింది. ఇలాంటి చర్యలు కూడా తెలంగాణ హాస్టళ్లలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరగడా నికి కారణమయ్యాయి. మన గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనా కాలంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా కాలంలో గురుకుల విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇదెంత దారుణం?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి సుమా రు ఏడాది కావొస్తున్నది. అంతే, సంక్షేమ హాస్టళ్లు, సంక్షోభ హాస్టళ్లుగా మారాయి. సమస్యలకు ప్రధాన కేంద్రాలయ్యాయి. గురుకులాలు అరకొర వసతులతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. వాటిలో పరిశుభ్రత లోపించింది. చెత్త, చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. పాఠశాల నుంచి కళాశాల వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ.. ఏ హాస్టల్ చూసినా ఇలాంటి దుర్భర పరిస్థితులే ఉన్నాయి. వీటిన్నింటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అంతేకాదు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు కుక్క, పాము, ఎలుక కాట్లతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇక ఫుడ్ పాయిజన్ కేసులైతే షరామా మూలయ్యాయి. కేసీఆర్ పదేండ్ల పాలనా కాలంలో గురుకుల విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిం చారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం గురుకుల విద్యార్థులు దవాఖానల పాలవుతున్నారు. గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుండటం నిజంగా విషాదం.
ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో 916 మంది విద్యార్థులు ఆస్పత్రుల్లో షరీఖ్ కావడం దారుణం. అందులో 49 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం విషాదం. ఈ మరణాలను పరిశీలిస్తే… ఇందులో 24 మంది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకోగా, 8 మంది విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. హాస్టళ్లలో అపరిశుభ్ర వాతావరణం కారణంగా 13 మంది విద్యార్థులు అనారోగ్యంపాలై మరణించారు. మరో నలుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించారు.
ఇక సంక్షేమ హాస్టళల్లోని సమస్యలు చెప్పనలవికా నివి. నెలలకొద్దీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. నెల నెలా ఒక్కో విద్యార్థికి రావాల్సిన కాస్మొటిక్ చార్జీలు, పాకెట్ మనీ రావడం లేదు. పాఠశాల, కళాశాల హాస్టళ్లకు సంబంధించిన డైట్ చార్జీలూ బకాయి పడ్డాయి. విద్యార్థులకు యూనిఫారమ్స్ సరి గా అందడం లేదు. స్కావెంజర్ల నియామకం జరగ టం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే విద్యావ్యవస్థల్లో ని సమస్యలు కోకొల్లలు. అందుకే కాంగ్రెస్ ఏడాది పాలనలో విద్యావ్యవస్థ భ్రష్ఠుపట్టి పోయింది. విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రచారం కోసం నానా యాగీ చేశారు. ట్రాక్టర్లో వెళ్లి, కళాశాలల గోడ దూకడం లాంటి వికృత చేష్టలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తామని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని ప్రగ ల్భాలు పలికారు. కానీ, రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
ఈ ఏడాది కాంగ్రెస్ పాలనలో ధ్వంసం కాని వ్యవ స్థ రాష్ట్రంలో లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి విద్యాశాఖ సమస్యలతోపాటు, హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన తక్షణ అవసరం ఎంతైనా ఉన్నది.