పొద్దుగాల పొద్దుగాలనే
బజాట్ల కలిసిన యాదగిరి ఒకమాట అన్నడు..
ఎన్ని చెప్పినా ఉగాది పచ్చడి ఉగాది పచ్చడే
దానికి జవాబ్ లేదు!
అంగట్ల కల్యమాకు కొంటాంటే
సంచిల మామిడాకులు దోపుకుంటా
శివయ్య అన్నడు…
ఉగాది పచ్చడి లెక్క ఏది ఉండదు
బస్టాండ దగ్గర పేపర్ చదువుతాంటే
సమ్మక్క ఎదురుపడి చెప్పింది..
ఎన్నిచూసినా ఉగాది పచ్చడి
ముకాబిల ఏదీరాదు
చౌరస్తాల గుడిసె హోటల్ల చాయ్ తాగుతాంటే
ఇడ్లీ తిందామనచ్చిన కొమురెల్లి కండ్ల బడి అన్నడు…
ఎన్ని ఇకమతులు వడ్డా
ఉగాది పచ్చడి జరూరుగా తినాలె
ఇదంతా నాకు తెలవదా ఏందీ?
కనీ ఈ పండుగ పూట గా మాట చెప్తే
వాళ్ల పానానికి అదొక తృప్తి
గీ వీళ్లంతా మొన్న సంక్రాంతికి
సకినాల గురించి చెప్పిండ్రు.. ఆవలి మొన్న దీవిలికి
అరిసెల గురించి చెప్పిండ్రు.. అంతకుముందు
బతుకమ్మప్పుడు మక్కజొన్న సత్తుపిండిని
గీ కామనంగనే చెప్పిండ్రు..
గాయాల్ల బోనాలప్పుడు కూడా
శనగ గుడాలు మజాగా ఉంటయని చెప్పిండ్రు…
అందుకనే ఏ పండుగప్పుడు
ఆ పండుగ ముచ్చట్లు చెప్తే
నేను నిమ్మలంగా ఇంట
ఎదురు చెప్పకుండ గట్లనే
తియ్యి అని అంట…
మనకు పండుగకొక్క తరీఖా ఉన్నట్టు
తీరొక్క వంట సుతా ఉన్నది కదా…
కొత్త సాల్ నాడు
జిందగీని కొత్తగ షురూ చెయ్యాలి కదా
మరి జిందగీ అంటే
అన్ని కలిసి ఉంటాయి కదా
యాదగిరీ… శివయ్యా…
సమ్మక్కా… కొమురెల్లీ…
ప్రతి యేడు లెక్కనే ఇప్పుడు సుతం
జామకాయ , మామిడికాయ, చింతపండు,
యాప పువ్వు, బెల్లం కలిపి
కొత్త పటువల పచ్చడి చేద్దాం…
అందరం పంచుకుంట ఈ ఉగాదిని షురూ చేద్దాం…
కాలమా… బహురూపివి నువ్వు
బహు పేర్లు నీకు
ఈసారి నీ పేరు శోభకృతు
నీ రూపం ఎంతో గమ్మతు…
ఏం చెప్పకున్నా, మా జిందగీ
ఓ ఉగాది పచ్చడి!
రేపటి సంబురం
అలుగు దుంకిన మత్తడి!!
-డాక్టర్ మామిడి
హరికృష్ణ