రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో కొన్ని నెలలుగా ఉన్నతాధికారుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వారి స్థానంలో ఇంచార్జి అధికారులు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో జైళ్లలో నిర్లక్ష్యం ఆవహిస్తున్నది. ఈ కారణంగా అటు అధికారులు, ఇటు ఖైదీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ కష్టాలను భరించలేక జైలు అధికారులు, ఖైదీలు రిజష్టర్ పోస్టు ద్వారా నమస్తే తెలంగాణకు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఇదీ…
రాష్ట్రంలోని జైళ్లలో ఇటీవల నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా మారా యి. జైళ్లలో శాశ్వత అధికారుల నియామకాలు నిలిచిపోవడంతో ఇంచార్జిల ఆధీనంలో జైళ్లు కొనసాగుతున్నాయి. దీంతో భద్రతా వ్యవస్థ క్రమం గా కుప్పకూలిపోతున్నది. ఫలితంగా ఖైదీల ఆత్మహత్యలు, పరారీలు, అనుమానాస్పద మరణాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. సిబ్బంది కొరత, పాత భవనాలు, సాంకేతిక పరికరాల నిర్వీర్యం వంటి అంశాలు జైళ్లలో ప్రమాదకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భద్రతా పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా అనేక ఘటనలు చోటుచేసుకోవడం రాష్ట్ర జైలు వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్నది. 2025, ఏప్రిల్లో డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ పూర్తయినప్పటికీ, ప్రమోషన్ ఇవ్వకుండా, పోస్టింగ్లు ఇవ్వకుండా, నేటికి ఇంచార్జిల పాలన కొనసాగిస్తుండటం హేయనీయం. ఇటీవలి కాలంలో జరిగిన పలు సంఘటనలు ఈ అవ్యవస్థకు తార్కాణంగా నిలుస్తున్నాయి.
జనగామ సబ్జైల్లో రిమాండ్ ఖైదీ మల్లయ్య (35) బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీళ్లు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు జైలు అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళన చేసినా ఫలితం లేకుండాపోయింది. నర్సంపేట మహిళా సబ్జైల్లో రిమాండ్ ఖైదీ పెండ్లా సుచరిత (28) అనారోగ్యంతో మృతిచెందింది. సహ ఖైదీ వాయిస్ క్లిప్ బయటికి రావడంతో వైద్య నిర్లక్ష్యం బహిర్గతమై, సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి సబ్జైల్లో ఖైదీ రమేష్ గోడెక్కి పారిపోయాడు. చర్లపల్లి సెంట్రల్ జైలులో పెయింటింగ్ పనులు చేస్తున్న ఖైదీ పరారయ్యాడు. అలాగే గతేడాది కూడా మూణ్నాలుగు మరణాలు నమోదయ్యాయి.
చంచల్గూడ జైల్లో నకిలీ బెయిల్ పత్రంతో ఒక ఖైదీ బయటపడిన ఘటన కలకలం రేపింది. అలాగే ఖైదీతో ములాఖత్ రీల్ సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టించింది. జగిత్యాల కోర్టు ప్రాంగణంలో రిమాండ్ ఖైదీ ప్రసాద్ తప్పించుకున్నాడు. ఇవిలా ఉంటే ఇంకా వెలుగులోకి రాని సంఘటనలెన్నో ఉన్నాయి. ఇవన్నీ జైళ్లల్లో నెలకొన్న భద్రతా వైఫల్యాలను తెలియజేస్తున్నాయి. కొంతమంది ఉన్నతాధికారులు తమ కు సన్నిహిత అధికారులను ఇంచార్జి పదవుల్లో నియమించడంతో అర్హులైన అధికారులకు అన్యా యం జరుగుతున్నది. ఈ స్నేహ ప్రీతి, అన్యాయ నియామకాలు జైలు పరిపాలనలో క్రమశిక్షణను దెబ్బతీస్తున్నాయనడంలో సందేహం లేదు.
తెలంగాణలోని చర్లపల్లి, చంచల్గూడ వంటి జైళ్లలో ఖైదీల సంఖ్య సామర్థాన్ని మించిపోయింది. అధిక జనసాంద్రత కారణంగా సరిపడా వైద్య సేవలు అందడం లేదు. ఆహార సరఫరాలో లోపాలుంటున్నాయి. వసతుల లేమి ఖైదీలను ఆందోళనకు గురిచేస్తున్నది. జైళ్లలో సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వాచ్ టవర్లలో సిబ్బంది లేకపోవడం, పర్యవేక్షణలో లోపాలు వంటి కారణాలు భద్రతకు ప్రధాన అవరోధాలుగా మారుతున్నాయి. అంతేకాదు, జైళ్లలో సైకాలజిస్టులు కూడా లేకపోవడం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది. ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థ లు, భద్రతా నిపుణులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణ చర్యలు చేపట్టాలని ఖైదీలు కోరుతున్నారు.
తెలంగాణ జైలు అధికారులు, ఖైదీలు
ఇంచార్జిలుగా ఉన్న పోస్టులు: 1. కేంద్ర కారాగారం-చర్లపల్లి, 2. పరిపాలనాధికారి కేంద్ర కారాగారం-చర్లపల్లి, 3. ఖైదీల వ్యవసాయ క్షేత్రం-చర్లపల్లి, 4. ప్రత్యేక మహిళా కారాగారం-హైదరాబాద్, 5. కేంద్ర కారాగారం-సంగారెడ్డి, 6. కేంద్ర కారాగారం-వరంగల్, 7. జిల్లా సబ్జైళ్ల అధికారి-కరీంనగర్, 8. జిల్లా సబ్జైళ్ల అధికారి-సంగారెడ్డి, 9.జిల్లా సబ్జైళ్ల అధికారి-రంగారెడ్డి, 10. జిల్లా కారాగారం-సిద్దిపేట, 11. జిల్లా సబ్జైళ్ల అధికారి-ఖమ్మం.