2014 నుంచే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సబర్మతీ ఆశ్రమంపై పడిందనే విషయం తెలిసిందే. కానీ, గుజరాత్ ముఖ్యమంత్రిగా గాంధీనగర్‌లో మహాత్మా మందిర్ పేరిట గాంధీజీకి ప్రత్యామ్నాయ స్మారక చిహ్నాలను సృష్టించాలన్న ప్రయత్నం, సబర్మతీ నది ఒడ్డున ఉన్న కస్తూరీబా, బాపుల నివాసమైన సబర్మతీ ఆశ్రమం నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్న మోదీ ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయి. గుజరాత్‌ను సందర్శించే దేశ విదేశాల అధినేతలను ఆయన మహాత్మా మందిరానికి బదులుగా బలవంతంగా సబర్మతీ ఆశ్రమానికి తీసుకురావాల్సి వస్తున్నది. కాబట్టి, దాన్ని స్వాధీనం చేసుకొని దాని స్థానంలో తన కోసం ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించుకోవాలనే ఎత్తుగడ. తమ హయాంలో తమ కోసం స్మారక సమాధులను నిర్మించుకున్న ఈజిప్ట్ ఫారో (పాలకులు) వలె. స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరిట ఆయన చేసినట్టుగా. పైకి చూడటానికి, అది సర్దార్ పటేల్‌కు నివాళియే. కానీ, నిజానికి, దాని సృష్టికర్త నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆత్మౌన్నత్యతా భావనకు అది చిహ్నం.
Sabarmati Ashram | అహ్మదాబాద్‌లోని కోచ్రాబ్ ఆశ్రమంలో తమతో పాటు నివసించాలని దళిత కుటుంబాలను బాపు ఆహ్వానించగా, బాపుతో పాటు అతని సహచరులపై స్థానికులు నిషేధం విధించడంతో సబర్మతీ ఆశ్రమం పురుడుపోసుకున్నది. స్వీయ అస్తితం, స్వావలంబన, స్వయం సమృద్ధితో కూడిన సంప్రదాయేతర, అందరినీ కలుపుకొనిపోయే, ప్రజాస్వామిక సూత్రాల ఆదర్శవంతమైన సమాజాన్ని సృష్టించాలనుకుంటే.. ఈ నియంత్రణల బస్తీకి దూరంగా వెళ్లిపోవాలని బాపు గ్రహించారు. అనేకచోట్ల శోధనల తర్వాత సబర్మతీ నది తీరానికి సమీపంలోని బీడు భూమిని బాపు ఎంచుకున్నారు. రాళ్లతో కూడిన ఆ ప్రదేశం శ్మశానవాటిక, కారాగారానికి మధ్యలో ఉన్నది. ప్రభుత్వం, పాలకులకు వ్యతిరేకంగా పోరాడే క్రమంలో పర్యవసానాలను ఎదుర్కోవడం లేదా గమ్యాన్ని చేరుకునే క్రమంలో మరణించడం తన లక్ష్యం కాబట్టి, ఇది సత్యాగ్రహికి ఆదర్శవంతంగా నిలుస్తుందని బాపు అన్నారు.
120 ఎకరాలకు పైగా ఉన్న ఆశ్రమ భూమిని బాపు తన వ్యక్తిగత డబ్బుతో పాటు తాను స్వీకరించిన విరాళాలతో కొనుగోలు చేశారు. ఆశ్రమ యాజమాన్య హక్కులు బాపు, అతని సోదరుడి కుమారుడి పేరిట నమోదయ్యాయి. తర్వాత అతను ఒక ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారు. భూమి యాజమాన్య హక్కులు ఆ ట్రస్టుకు బదిలీ అయ్యాయి. బాపు ఇక్కడ నిజమైన ప్రజాస్వామ్య సమాజాన్ని స్థాపించారు. తీసుకున్న ప్రతి నిర్ణయంపై ఏడు రోజుల వ్యవధిలో చర్చ జరిగేది. మెజారిటీ ఓట్ల ప్రకారం ఆమోదం పొందేది, లేదా తిరస్కరణకు గురయ్యేది. అంతేకాదు, ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటు వేసినవారు కూడా సమాన గౌరవం పొందేవారు. అందరికీ ఒకటే వంటశాల, అందరితో కలిసి భోజనం చేయాలనే ఆలోచనను బాపు అమలుచేయడం అందుకు ఒక ఉదాహరణ. ఆశ్రమంలో అన్ని నిర్ణయాలు నిజమైన ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీసుకున్నారు. నిజమైన భాగస్వామ్యంతో కూడిన ప్రజాస్వామ్య అభ్యాసకులుగా మారడానికి బాపు ప్రజలకు శిక్షణ ఇచ్చే మార్గం ఇది.
చౌరీ చౌరా వద్ద కొంతమంది సత్యాగ్రహులు పోలీసులను హత్య చేసిన కారణంగా విజయం అంచున ఉన్నదని చాలామంది విశ్వసించిన ఆందోళనను, తన సహచరులకు ఇష్టం లేకపోయినా సాహసోపేతమైన రీతిలో బాపు ఉపసంహరించుకున్నారు. దేశద్రోహ నేరం కింద సబర్మతి ఆశ్రమం నుంచి బాపును అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి, శిక్ష కూడా విధించారు. విడుదలైన తర్వాత మళ్లీ బాపు అక్కడికి వెళ్లారు. అక్కడే స్వదేశీ, గ్రామ పరిశ్రమ నమూనా అభివృద్ధి జరిగింది. ఖాదీ వస్త్రం పునరుద్ధరణ జరిగింది, ఆ తర్వాత అది ప్రజాదరణ పొందింది కూడా ఇక్కడి నుంచే.
దక్షిణాఫ్రికా, కొచ్రాబ్ ఆశ్రమాల తర్వాత సబర్మతీ ఆశ్రమంలోని నిరాడంబరమైన హృదయ్ కుంజ్‌లో గాంధీ కుటుంబం ఒక దశాబ్దానికి పైగా నివసించింది. 1930లో స్వాతంత్య్ర ఉద్యమాన్ని, సత్యాగ్రహాన్ని పునరుద్ధరించాలని బాపు నిర్ణయించుకున్నారు. అప్పటి వైస్రాయ్‌తో బాపు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. హోమ్ రూల్, ఉప్పు పన్ను, నిషేధం రద్దు వంటి డిమాండ్లతో కూడిన చార్టర్‌ను అతనికి బాపు పంపారు. అంతేకాదు, వైస్రాయ్‌కు ఇచ్చే అధిక జీతం, అతని ఆడంబరమైన జీవనశైలిపై విమర్శలు గుప్పించారు. నిర్ణీత తేదీలోగా తన డిమాండ్లను నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం చేపడతానని హెచ్చరిస్తూ వైస్రాయ్‌కు బాపు అల్టిమేటం ఇచ్చారు. బాపు డిమాండ్లను పట్టించుకోకూడదని వైస్రాయ్ నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత జరిగిన చరిత్ర తెలిసిందే.
మార్చి 12 తెల్లవారుజామున 78 మందితో కలిసి సబర్మతీ ఆశ్రమం నుంచి బాపు బయల్దేరారు. 1930 ఏప్రిల్ 6న ఉదయం బాపు సముద్రపు తీరంలో పిడికెడు మట్టిని తీసుకొని ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. 1930ల ప్రారంభంలో బ్రిటిష్ వలస ప్రభుత్వం ఉప్పు సత్యాగ్రహాన్ని కఠినంగా అణచివేసిన తీరుకు నిరసనగా ఆశ్రమాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాలని బాపు నిర్ణయించుకున్నారు. చాలా సేపు అనునయించి, అలా చేయవద్దని బాపును అతని సహచరులు ఒప్పించగలిగారు. చివరగా, ఆశ్రమాన్ని హరిజన సేవక్ సంఘ్‌కు అప్పగించాలని బాపు నిర్ణయించుకున్నారు. దళిత కుటుంబాలను స్థిరపరచడానికి, సమాజ సంక్షేమం కోసం ఒక సంస్థను సృష్టించడానికి ఆశ్రమాన్ని ఉపయోగించాలని సూచిస్తూ ఆయన అలా చేశారు.
మోదీ ఒక నిరంకుశుడు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఉపయోగించి అధికారాన్ని చేజిక్కించుకొని, ఆ తర్వాత దాన్ని అతను వదులుకుంటాడు. తన నిరంకుశ పాలనా శైలిపై విధించిన ఆంక్షలను అతను ద్వేషిస్తాడు. తన పదవీ కాలమంతా ప్రజాస్వామ్య విధానాలను తెలివిగా విధ్వంసం చేసి బలహీనపరిచాడు. అందుకే, ఈ పరిస్థితుల్లో సబర్మతీ ఆశ్రమం అవసరం. భారత ప్రజాస్వామ్యపు నర్సరీగా దాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. మొదటి సహాయ నిరాకరణ ఉద్యమానికి బాపు ఇక్కడినుంచే నాయకత్వం వహించారు.
ఆ తర్వాత ఆశ్రమాన్ని విడిచిపెట్టారు. తాను ప్రేమించిన ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చేంతవరకు ఆశ్రమంలో అడుగుపెట్టబోనని శపథం చేశారు. మధ్య భారతదేశంలోని విదర్భలో ఉన్న వార్ధా సమీపంలో సేవాగ్రామ్ ఆశ్రమాన్ని స్థాపించేంత వరకు కస్తూరీబా కూడా మరోసారి నిరాశ్రయులయ్యారు. కస్తూరీబా తన జీవితంలో చివరి రోజులను అక్కడే గడిపారు. ఇది సబర్మతీ ఆశ్రమ చరిత్ర. కస్తూరీబా, బాపు స్మారక చిహ్నంగా.. బాపు నేతృత్వంలో ప్రారంభమైన స్వాతంత్య్ర ఉద్యమానికి చిహ్నంగా సబర్మతీ ఆశ్రమానికి ఉన్న ప్రాముఖ్యం ఇది. అందుకే దాన్ని సహజమైన స్థితిలో సంరక్షించాలి.
బాపు హత్య తర్వాత అనేక మార్పులు జరిగాయి. ఆశ్రమం అనేక చేతులు మారింది. ఒక సంస్థ నుంచి మరొక సంస్థకు బదిలీ అయింది. హరిజన సేవక్ సంఘ్, రాష్ట్రీయ గాంధీ స్మారక్ నిధి, సబర్మతీ ఆశ్రమ పరిరక్షణ మెమోరియల్ ట్రస్ట్, ఇతర సంస్థలు ఆశ్రమ భూములకు సంరక్షకులుగా మారాయి. ఎక్కువమంది వంటగాళ్లుంటే పులుసు చెడిపోతుందన్న సామెత నిజమే. ఈ సంస్థలు కూడా అదే చేశాయి. ఆశ్రమానికి ముప్పు ఏర్పడినప్పుడు వారు నిద్రపోతున్నట్టు నటించారు. సబర్మతీ ఆశ్రమానికి చట్టబద్ధమైన సంరక్షకుడు ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.
బాపు నిర్ణయమే తుది నిర్ణయమనుకుంటే.. హరిజన సేవక్ సంఘ్ అసలైన సంరక్షకుడిగా ఉండాలి. బాపు ఆదేశాలకు, హెచ్చరికలకు అనుగుణంగా అది నడుచుకోవలసి ఉంటుంది. అన్ని మార్పులను పరిగణనలోకి తీసుకుంటే అనేక ట్రస్టులు సంరక్షక బాధ్యత తమదేనని క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడే కష్టాలు మొదలవుతాయి. గాంధేయ సంస్థలు ఒకదానితో మరొకటి సఖ్యంగా ఉండవనేది తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో పక్షం మధ్యలో దూరి, సంస్థను స్వాధీనం చేసుకోవడం చాలా సులభతరమవుతుంది. సబర్మతీ ఆశ్రమంతో ప్రధానమంత్రి, అతని అనుచరులు చేసిందిదే. భయపడే, స్వప్రయోజనాలు కోరుకునే ట్రస్టీలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వ చర్యలకు సహకరించారు. ఆశ్రమ సంరక్షకుల నుంచి కొంతవరకు ప్రతిఘటన ఉంటుందని ప్రభుత్వం భావించింది. కానీ, అటువంటిదేమీ వారికి ఎదురు కాలేదు.
గాంధీ స్మారక చిహ్నాలకు ప్రభుత్వం ఏనాడూ సాయం చేయలేదని కాదు. అవసరమైనప్పుడల్లా, అన్ని గాంధీ స్మారక చిహ్నాల వద్ద మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం నిధులు సమకూర్చింది. అలా చేసే క్రమంలో ఇప్పటికే ఉన్న సంరక్షకులను పక్కనపెట్టాలని ప్రభుత్వం ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, దాని సంరక్షకులను పక్కనపెట్టాలని ఆదేశించడం ఇదే మొదటిసారి. ఇదీ నరేంద్ర మోదీ, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ తీరు.
ఈ ధోరణి చాలా ప్రమాదకరమైనది.
ఆశ్రమ స్వయం ప్రతిపత్తిని కాపాడే ప్రయత్నంలో నేను గుజరాత్ హైకోర్టును ఆశ్రయించాను. దురదృష్టవశాత్తూ సబర్మతీ ఆశ్రమ్ ప్రిజర్వేషన్ అండ్ మెమోరియల్ ట్రస్ట్ (ఎస్ఏపీఎంటీ) ధర్మకర్తలు ఆశ్రమం, దాని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి తాము మద్దతు ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు. అంతేకాదు, కూల్చివేత, పునర్నిర్మాణ కార్యకలాపాలను నిర్వహించేందుకు కూడా అనుమతిస్తున్నట్టు అఫిడవిట్ సమర్పించారు. స్వప్రయోజనాల కోసం ఎస్ఏపీఎంటీ, హరిజన్ ఆశ్రమ్ ట్రస్టుల సభ్యులు బాపు ఆశ్రమానికి ద్రోహం తలపెట్టారు. అంతేకాదు, బాపు వారసత్వాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మేశారు. నా అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు సులువుగా కొట్టివేయడానికి ఇది మార్గం సుగమం చేసింది.
మోదీ ఒక నిరంకుశుడు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఉపయోగించి అధికారాన్ని చేజిక్కించుకొని, ఆ తర్వాత దాన్ని అతను వదులుకుంటాడు. తన నిరంకుశ పాలనా శైలిపై విధించిన ఆంక్షలను అతను ద్వేషిస్తాడు. తన పదవీ కాలమంతా ప్రజాస్వామ్య విధానాలను తెలివిగా విధ్వంసం చేసి బలహీనపరిచాడు. అందుకే, ఈ పరిస్థితుల్లో సబర్మతీ ఆశ్రమం అవసరం.
ఈ ఏడాది సెప్టెంబర్‌లో గాంధీ స్మృతి వద్ద ఏర్పాటు చేసిన ఫలకం ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. అందులో ఒక మూలన బాపు చిన్న ఫొటో, ఫలకంపై ఆధిపత్యం చెలాయించేలా ప్రధానమంత్రి పెద్ద ఫొటో ఉన్నది. గాంధీ స్మృతి వద్ద ఉన్న వెయిటింగ్ రూమ్ గోడకు సావర్కర్ పెద్ద ఫొటోను తగిలించినట్టు నేను గతంలో చెప్పాను. దురదృష్టవశాత్తు, మా కస్తూరీ బా, బాపుల వారసత్వాన్ని అణచివేయడానికి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రణాళికలకు కొంతమంది సహకరిస్తున్నారు. అహ్మదాబాద్‌లో సబర్మతీ ఆశ్రమాన్ని గాంధీ ఆశ్రమమని పిలుస్తారు. భవిష్యత్తులో అది మోదీ ఆశ్రమంగా ప్రసిద్ధి చెందుతుంది. హే రామ్!
-తుషార్ గాంధీ
(మహాత్మా గాంధీ ముని మనుమడు)