డాక్టర్ రాధేలాల్ హరేలాల్ రిచారియా.. చాలామందికి పరిచయం లేని పేరిది. దేశీయ విత్తన వారసత్వానికి దృఢమైన రక్షకుడిగా నిలబడిన ఆయన ఇప్పటికీ అగ్రికల్చర్ యూనివర్సిటీలు, ఆ రంగంలోని శాస్త్రవేత్తలకు అపరిచితుడే. వివిధ పంటలపై ముఖ్యంగా వరిపై విస్తృత పరిశోధనలు చేసిన రిచారియా గురించి ఏ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పాఠ్యాంశంలోనూ ఆయన కనిపించకపోవడం విషాదం.
RH Richharia | రిచారియా 1990లో మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్ జిల్లా, నందన్వర గ్రామంలో జన్మించారు. తండ్రి స్థానిక పాఠశాలలో హెడ్మాస్టర్గా, పోస్ట్మాస్టర్గానూ పనిచేశారు. తండ్రితో కలిసి పొలానికి వెళ్లినప్పుడే ఆయనకు వ్యవసాయం ఒంటబట్టింది. తమకున్న చిన్న కమతంలోనే వివిధ రకాల కూరగాయలపై ప్రయోగాలు చేసేవారు. పొరుగునే ఉన్న గిరిజన గ్రామాల్లో అరుదైన వ్యవసాయ మొక్కలు గుర్తించేవారు. నాగ్‌పూర్‌లో బాటనీలో ఎంఎస్సీ పూర్తిచేశాక ఇంగ్లండ్‌లో పీహెచ్డీ చేయాలని అనుకునేవారు. పరిశోధనలు రైతులకు ఉపయోగపడితేనే అవి విజయం సాధించినట్టు అని చెప్పే కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ప్రొఫెసర్ పీఎస్ హడ్సన్‌ను కలవాలని కలలు కనేవారు. 1931లో నాగ్‌పూర్‌లోని ఓ కంపెనీలో ఆయిల్‌సీడ్ నిపుణుడిగా ప్రారంభమైన ఆయన జీవితంలో ఎన్నో ప్రయోగాలకు బీజం పడింది అక్కడే.
1942లో మహాత్మాగాంధీని సైతం ఆశ్చర్యపరుస్తూ అవిసె గింజల కాండాల నుంచి మొత్తని నారను తీయడంలో రిచారియా విజయం సాధించారు. ఆ సమయంలో ఆయన బీహార్‌లోని సబౌర్ అగ్రికల్చర్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి పనిచేస్తూ ఈ విజయం సాధించారు. అప్పట్లో మన దేశం విదేశాల నుంచి నారను దిగుమతి చేసుకునేది. రిచారియా ప్రయోగం తర్వాత నారను దిగుమతి చేసుకోవడం మాని ఇక్కడే తయారుచేసుకోవాలని బీహార్ చరఖా సంఘాన్ని గాంధీ కోరారు.
1959 నుంచి 1966 వరకు కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఆర్ఆర్ఐ) డైరెక్టర్‌గా, 1971 నుంచి 1978 వరకు మధ్యప్రదేశ్ వరి పరిశోధనా సంస్థ (ఎంపీఆర్ఆర్ఐ) డైరెక్టర్‌గా రిచారియా పనిచేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. కటక్‌లో పనిచేస్తున్నప్పుడు తెగుళ్ల నిరోధకతను కలిగే జపోనికా సంప్రదాయ వరి టైచుంగ్ నేటివ్ వన్ (టీఎన్ఐ) నుంచి కొన్ని రకాల వంగడాలను ఎంచుకుని పరిశోధనలు చేశారు. 1942లో వరి క్లోనింగ్పైనా దృష్టిసారించారు. ఇది దిగుబడిని అసాధారణంగా పెంచడమే కాకుండా విత్తనాలను ఆదా చేసింది. సాధారణ మార్పిడి మొక్కలతో పోల్చినప్పుడు దిగుబడిలో 17 నుంచి 61 శాతం పెరుగుల కనిపించింది. అంతేకాదు, ఇవి తెగుళ్లు, వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోగలవు కూడా. 1962లో రిచారియా పరిశోధన వ్యాసం ప్రముఖ సైన్స్ జర్నల్ ‘నేచర్’లో ప్రచురితమైంది. ఆ తర్వాత అది 1963లో అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ)కి ప్రమోట్ అయింది. సీఆర్ఆర్ఐ ప్రపంచంలోనే అత్యుత్తమ వరి పరిశోధన కేంద్రం అవుతుందని రిచారియా విశ్వసించేవారు. అయితే, అంతర్జాతీయ సమాజం మాత్రం జపోనికా క్రాసెస్పైనే సీఆర్ఆర్ఐ పనిచేయాలని ఒత్తిడి తీసుకురావడంతో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. జపోనికా వంగడాల్లో భారత్‌కు తెలియని టుంగ్రో వైరస్ వంటి తెగుళ్లు ఉన్నాయని, జపోనికా వరి భారత్‌లోకి ప్రవేశిస్తే దేశం మొత్తం ఈ తెగుళ్లు విస్తరిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ఊహించినట్టే ఇప్పుడు అదే జరుగుతున్నది.
వ్యవసాయ రంగంలో అనేక పరిశోధనలతో దేశంలోనే ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్న రిచారియాను సీఆర్ఆర్ఐ డైరెక్టర్ పదవి నుంచి ప్రభుత్వం తొలగించి అవమానించారు. ఆయన అధికారిక నివాసానికి నీటి, విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆయన ఒరిస్సా హైకోర్టుకెళ్లి విజయం సాధించారు. కోర్టు తీర్పుతో ఆయన కార్యాలయానికి వెళ్తే తాళం వేసి కనిపించింది.
అందులోని ఆయన రీసెర్చ్ పేపర్లను అధికారులు తీసుకెళ్లినట్టు గుర్తించారు.
1971లో రాయ్‌పూర్‌లోని మధ్యప్రదేశ్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎంపీఆర్ఆర్ఐ)లో డైరెక్టర్‌గా చేరారు రిచారియా. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అగ్రికల్చర్ కన్సల్టెంట్గానూ పనిచేశారు. 1976లో మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి ప్రపంచబ్యాంకు రూ. 4 లక్షల రుణం ఇచ్చి ఎంపీఆర్ఆర్ఐని జబల్పూర్లోని జవహర్లాల్ కృషి విద్యాలయలో విలీనం చేయాలని కోరింది. ఇది ఆశాజనకమైన, అధిక దిగుబడినిచ్చే దేశీయ రకాలను ప్రాచుర్యంలోకి తేవాలన్న రిచారియా ప్రయత్నానికి గండికొట్టింది.
1971-1976 మధ్య రిచారియా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 17 వేల రకాల దేశీయ వరిని సేకరించారు. 967 రకాలను ట్రయల్స్ కోసం 17 జిల్లాలకు పంపించారు. వీటిలో స్వల్ప కాలంలో చేతికి వచ్చే అరోమాటిక్ రైస్, కోర్స్, ఫైన్ వంటి 237 రకాలు వంగడాలు కూడా ఉన్నాయి. సబౌర్‌లోని బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు ‘రాటూనింగ్’ అనే వరి రకాన్ని గుర్తించారు. రాటూనింగ్ అనేది ఒక వ్యవసాయ పద్ధతి. కోత తర్వాత మొక్క పైభాగాన్ని కత్తిరించడం ద్వారా కొత్త పెరుగుదలకు ఇది బాటలు వస్తుంది. అలాగే, 44 క్లస్టర్ వరి రకాలను సేకరించారు. వీటిని ఇతర బియ్యంతో సులభంగా సంక్రమణం చేయవచ్చు. క్యాన్సర్ నివారణ మూలకాలతో కూడిన 22 రకాల పర్పుల్ లీఫ్డ్ వరి రకాలను కూడా రిచారియా గుర్తించారు.
దేశంలో వరి ఉత్పత్తిని పెంచాలని 1983లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ రిచారియాను కోరారు. 1996లో ఆయన చనిపోయే వరకు 2 వేల సంప్రదాయ వరి రకాలపై పనిచేశారు. ఇంత చేసినా ఆయన కెరీర్‌పై సైన్స్ పాలిటిక్స్ తీవ్ర ప్రభావం చూపించాయని చాలామంది నమ్ముతారు. ఇప్పటికీ ఆయన వేల రకాల దేశీయ వరి వంగడాల్లో బతికే ఉన్నారు. దేశంలో పలు చోట్ల అవి ఇంకా ప్రజల ఆకలి తీరుస్తూనే ఉన్నాయి.
– ఎడిటోరియల్ డెస్క్