వాతావరణ మార్పులు, ప్రతికూల ప్రభావాలు ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాణాంతకంగా కరిగిపోతున్న హిమాలయ హిమానీనదాల నుంచి కేరళలోని పశ్చిమ కనుమల్లో కొండచరియలు విరిగిపడుతున్న ఘటనల వరకు చూస్తూనే ఉన్నాం. మరోవైపు ప్రజలు వినియోగిస్తున్న వివిధ పరికరాల ద్వారా వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా సామాన్య కుటుంబాలతో పోల్చితే, సంపన్న కుటుంబాలే కర్బన ఉద్గారాలను ఏడు రెట్లు ఎక్కువ విడుదల చేస్తున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ఫలితంగా సమాజంలోని అందరి జీవితాలను దెబ్బతీస్తున్నాయి. అధికంగా కర్బన ఉద్గారాలను విడుదల చేస్తున్న సంపన్న కుటుంబాలు తమ జీవనశైలిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాయా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నది.
భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన వేడికి ఆటంకం ఏర్పడటం ద్వారా భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత పెరుగడాన్ని భూతాపం (గ్లోబల్ వార్మింగ్) అంటారు. బొగ్గు మండించడం ద్వారా ఉత్పత్తయ్యే కర్బన ఉద్గారాలు, అడవుల నరికివేతతో ఏర్పడే గ్రీన్హౌస్ వాయువులు భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన వేడికి ఆటంకం కలిగిస్తుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ (ఐపీసీసీ) శాస్త్రవేత్తలు, నిపుణుల అధ్యయనంలో కీలక విషయాలను గుర్తించారు. వందేండ్లలో భూమి ఉపరితల సగటు ఉష్ణోగ్రత 1.1 సెల్సియస్ పెరిగిందని నిర్ధారించారు. ఇందులో 1.07 సెల్సియస్ ఉష్ణోగ్రత పెరుగుదలకు మనుషుల కార్యకలాపాలే కారణమని అంచనావేశారు.
ముఖ్యంగా 1970 తర్వాత ఉష్ణోగ్రతల పెరుగుదల రేటు మరింత వేగవంతమైందని గుర్తించారు. వాతావరణ మార్పుతో సముద్ర మట్టంతోపాటు సముద్ర ఉపరితల, పెద్ద సరస్సుల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారీ వర్షపాతం కారణంగా వరదలు సంభవిస్తున్నాయి. కరువు పరిస్థితులు తీవ్రమై పంటలు ఎండిపోతున్నాయి. పర్యావరణ వ్యవస్థల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల హిమాలయాల్లో హిమానీనదాల క్షీణత తీవ్రం కావడమే ఇందుకు నిదర్శనం. భూతాపంతో పెనుతుఫాన్లు అంతకంతకూ ఎక్కువగా, అధిక తీవ్రతతో సంభవిస్తుంటాయి. వేడి గాలులు తరచుగా, ఎక్కువ తీవ్రతతో వీచడం వంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ మార్పుల వల్ల సున్నితమైన హిమాలయ పర్యావరణ వ్యవస్థ వేగంగా అస్థిరమవుతున్నది. హిమానీనదాల క్షీణతతో కోట్లాది మంది జీవనోపాధికి, నీటి భద్రతకు ముప్పు సంభవించే ప్రమాదం పొంచి ఉన్నది. హిమాలయాల్లో ఉద్భవించే ప్రధానమైన సింధు, గంగా, బ్రహ్మపుత్ర నదుల ప్రవాహంలో తీవ్ర హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి.
నదీ ప్రవాహాల్లోని అస్థిరతల వల్ల వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిరాశ్రయులయ్యే ప్రమాదంలోకి నెడుతున్నది. ఈ నేపథ్యంలోనే నదులను అనుసంధానం చేసే కార్యక్రమాలను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉన్నది.
గ్లోబల్ ైక్లెమేట్ రిస్క్ ఇండెక్స్-2021 ప్రకారం వాతావరణ మార్పుల వల్ల అత్యధికంగా ప్రభావితమవుతున్న ప్రపంచంలోని టాప్ 10 దేశాల్లో భారత్ కూడా ఒకటి. మరోవైపు లండన్‌కు చెందిన అంతర్జాతీయ థింక్ ట్యాంక్ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ 2021 జూన్‌లో ‘ది కాస్ట్స్ ఆఫ్ ైక్లెమేట్ చేంజ్ ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన నివేదిక కూడా సంచలన అంశాలను బయటపెట్టింది. వాతావరణ మార్పుల కారణంగా 2100 నాటికి భారత్ ఏటా జీడీపీలో 3 నుంచి 10 శాతం వరకు కోల్పోయే ప్రమాదం ఉన్నదని స్పష్టంచేసింది. 2040 నాటికి పేదరిక రేటు 3.5 శాతం పెరుగవచ్చని పేర్కొన్నది. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే ప్రమాదాలతో ఖర్చులు, సమాజంలో అసమానతలు, పేదరికం కూడా పెరుగుతాయని ఈ నివేదిక వివరించింది. జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా భారత్‌లో ఏటా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు నిరంతరం పెరుగుతున్నాయి.
సమస్యను భిన్న కోణాల్లో పరిశీలించడానికి కార్బన్ ఫుట్‌ప్రింట్ విధానం ఒక మార్గంగా పనికొస్తుంది. కార్బన్ ఫుట్‌ప్రింట్ అంటే ఒక వ్యక్తి, సమాజం, కార్యక్రమం, సంస్థ, సేవ లేదా ఉత్పత్తి కారణంగా వెలువడే మొత్తం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు. ఇందులో కార్బన్ డయాక్సైడ్, మీథేన్ కూడా ఉన్నాయి. ఇక కార్బన్ డయాక్సైడ్ను అత్యధికంగా విడుదల చేసే పది దేశాలు ఇవి. చైనా (9.3 జిగా టన్నులు-జీటీ), అమెరికా (4.8), భారత్ (2.2), రష్యా (1.5), జపాన్ (1.1), జర్మనీ (0.7), దక్షిణ కొరియా (0.6), ఇరాన్ (0.6), కెనడా (0.5). అయితే, తలసరి ఉద్గారాలను పరిశీలిస్తే భారత్ ప్రపంచ సగటు కంటే చాలా దిగువన ఉన్నది.
ప్రపంచవ్యాప్తంగా వెలువడే మొత్తం ఉద్గారాల్లో భారత్ వాటా 7.1 శాతం కాగా, భారత్‌లో తలసరి ఉద్గారాలు సుమారు 2.47 టన్నులుగా ఉన్నది. ఇది ప్రపంచ తలసరి సగటు 6.45తో పోలిస్తే చాలా తక్కువ. ఇక్కడ కూడా అభివృద్ధి చెందిన దేశాలకు, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యుమానిటీ అండ్ నేచర్ ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, భారత్‌లో అధికంగా ఖర్చు చేసే సంపన్న కుటుంబాలు, దిగువ స్థాయి కుటుంబాల కంటే దాదాపు ఏడు రెట్లు ఎక్కువగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. దేశంలోని వివిధ సామాజిక-ఆర్థిక వర్గాల్లో అత్యధిక ఉద్గారాలకు కారణమవుతున్న వ్యయాల్లో ఆహారం, విద్యుత్తు రెండు ప్రధాన రంగాలని అధ్యయనం గుర్తించింది.
వాతావరణ మార్పులకు తక్కువ కారణం అయినప్పటికీ సామాన్యులు ఎక్కువగా నష్టపోతున్నారు. అందువల్ల, ప్రస్తుత ప్రపంచంలో భూతాపాన్ని ఎదుర్కొనేందుకు సుస్థిరమైన పరిష్కారాలు అత్యంత కీలకం. వాతావరణ మార్పులతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా రెండు విధానాలను అనుసరించాల్సిన అవసరమున్నది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను, వాతావరణ మార్పుల పరిణామాల వల్ల ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. సమస్య పరిష్కారానికి తగిన విధానాలను ప్రజలు నిత్య జీవితంలో ఆచరణలో పెట్టినప్పుడే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయి.
అలాగే సమాజంలో ఆధునిక సాంకేతికత, సేవ లు, ఆర్థిక వృద్ధి, అభివృద్ధి ఒకవైపు ఉండగా, మరోవైపు పేదరికం, పోషకాహార లోపం, ఆరోగ్య సమస్యలు, సామాజిక వెలివేత, వనరుల క్షీణత సమస్యలు పీడిస్తున్నాయి. ఇది సమాజంలోని తీవ్రమై న వైరుధ్యానికి నిదర్శనం. కాబట్టి పరిష్కార మా ర్గాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, భాగస్వాములను చేసే విషయంలో ప్రభుత్వాలు, పార్టీలు ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, వ్యవసాయ, పర్యావరణ నిపుణుడు)
డాక్టర్ చెన్నమనేని రమేశ్