సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట లలితా కళాతోరణంలో జరుగుతున్న మ్యాజిక్ షోను చూస్తూ నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పొట్టపగిలేటట్టు నవ్వుతున్నారు. మ్యాజిక్ షో పూర్తయిన తర్వాత మెజీషియన్ డాక్టర్ పట్టాభిరామ్‌ను నందమూరి తారక రామారావు గుండెలకు హత్తుకున్నారు. మ్యాజిక్‌ను ఒక కళగా గుర్తించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాలని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారానికి ఉపయోగించుకోవాలని ప్రభుత్వాధికారులను నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ఆదేశించారు. ఆ సందర్భంగా ఈనాడులో 1987 నవంబర్ రెండో తేదీన ప్రచురించిన ఫొటో నాకు ఇప్పటికీ జ్ఞాపకం. ఆ ఫొటోలో ఎన్.టి.ఆర్ హాయిగా, నిష్కల్మషంగా నవ్వుతూ కనిపిస్తారు.
నందరమూరి తారకరామారావుని మాత్రమే కాదు, కాసు బ్రహ్మానందరెడ్డి, ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరినీ, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంనీ, మాజీ ప్రధానులు రాజీవ్‌గాంధీనీ, అబ్దుల్ కలాంనీ, దేశదేశాల్లో ప్రముఖులెందరినో పట్టాభిరామ్ తన ప్రతిభతో అలరించారు. మ్యాజిక్, హిప్నాటిజం తర్వాత వ్యక్తిత్వ వికాసంపై రచనలతో తెలుగునాటనే కాదు, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అఖండ కీర్తిప్రతిష్టలు సముపార్జించిన భావరాజు వెంకట పట్టాభిరామ్ హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం ఈ లోకం వదిలి వెళ్లిపోయారు.
నేను వార్త ఎడిటర్‌గా పని చేస్తున్న రోజుల్లో పట్టాభిరామ్ మా కార్యాలయానికి వచ్చి నన్ను కలిశారు. ‘మీరు వ్యక్తిత్వ వికాసంపై వ్యాసాలు రాయవచ్చు కదా!’ అని నేనడిగాను. ‘అయ్యబాబోయ్. రాతలు రావు. మనవి కోతలే’ అన్నారు నవ్వుతూ. ‘మీరు వ్యక్తిత్వ వికాసం గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో అదే రాసి నాకు పంపించండి. నేను చూసుకుంటా’ అని అన్నాను. తర్వాత నాలుగు రోజులకు ఆయన నిజంగానే రాసి పంపించారు. కొద్దిపాటి సవరణలతో ప్రచురించాం. వ్యాసం చాలా బాగుంది. ఈ విషయం అయనకు చెప్పి, అభినందించి, ప్రతీ వారం రాయమన్నాను. ఆయన రాశారు. పాఠకులు మెచ్చారు. వారానికి ఒక వ్యాసం చొప్పున చాలా నెలలు ఆయన కాలమ్ నడిచింది.
ఇప్పటి వరకూ వందకు పైగా పుస్తకాలు రాసిన అగ్రశ్రేణి రచయిత పట్టాభిరామ్. ‘చాణక్యతంత్రం’, ‘మ్యాజిక్ ఆఫ్ మహాత్మా’, ‘విజయం మీదే’, ‘నాయకత్వ లక్షణం విజయానికి తొలిమెట్టు’ వంటి పుస్తకాలు చాలా మంది చేతుల్లో కనిపిస్తాయి. వేలు కాదు, లక్షల కాపీలు విక్రయించే రచయిత ఆయన. విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించే పట్టాభిరామ్.. తల్లిదండ్రులకు అవగాహన తరగతులు నడిపేవారు.
సమాజంలోని అన్ని రకాల వారికీ, జీవితంలో ఉండే సకల సందర్భాలకీ అవసరమయ్యే అంశాలను ఎంపిక చేసుకొని విషయాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. కష్టబడి చదవొద్దు, ఇష్టపడి చదవండి, మాటే మంత్రం, నేర్చుకోవడం ఒక కళ, నో చెప్పడం నేర్చుకోండి, విద్యార్థుల్లో ఒత్తిడికి 7 కారణాలు, ఈ 8 విషయాలు పాటిస్తే ఒత్తిడికి లోనుకారు, పతనానికి దారితీసే 11 చెడు అలవాట్లు, బద్ధకం పోవాలంటే ఇది ఒక్కటి పాటించండి చాలు, గుడ్ టీచర్, జీనియస్, మీ మైండ్‌ని ఎలా ఉపయోగించాలి, ఆనందానికి 10 చిట్కాలు వంటి పుస్తకాలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఆయన పుస్తకాలు తెలుగులో, ఇంగ్లీషులో, కన్నడంలో, తమిళంలో, మరాఠీలో ప్రచురితమయ్యాయి. 2013లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పురస్కారం అందజేసింది. ఆయన అందుకున్న పురస్కారాలు ఎన్నో ఉన్నాయి. పట్టాభిరామ్ ఫేస్‌బుక్‌కు 45 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన పేరుతో పెట్టిన యూట్యూబ్ చానెల్‌కు 4.8 లక్షల మంది సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. 804 వీడియోలు ఆ చానెల్ ద్వారా ప్రసారమయ్యాయి.
పట్టాభిరామ్ గొప్ప మెజీషియన్, ప్రసిద్ధుడైన రచయిత మాత్రమే కాదు, అద్భుతమైన వక్త కూడా. సికింద్రాబాద్‌లో రెండువేల మంది కూర్చోడానికి వీలైన హాలు ఒకటుంది. అందులో ఏడాదికి ఒకసారి పట్టాభిరామ్ శిష్యబృందం సమావేశాలు నిర్వహిస్తుంది. ఆ సమావేశాల్లో ప్రధాన ఆకర్షణ పట్టాభిరామ్ ప్రసంగాలే. ఉపన్యాసాన్ని ఎట్లా ప్రారంభించాలో, ఎట్లా కొనసాగించాలో, ఎట్లా ముగించాలో ఆయనకు చాలా బాగా తెలుసు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన డాక్టర్ పట్టాభిరామ్ సైకాలజీలో, ఫిలాసఫీలో, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మూడు ఎంఏలు చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, అరబ్ దేశాల్లో మ్యాజిక్ షోలు నిర్వహించారు. 1983లోనే అమెరికాలోని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. నాష్ విల్లీ, న్యూఆర్లియన్స్ నగరాల మేయర్లు పట్టాభిరామ్ షోలు చూసి, ముగ్ధులై ఆయనకు గౌరవ పౌరసత్వం ఇచ్చారు. మన దేశంలోని రాష్ర్టాలన్నింటిలో పట్టాభిరామ్ అభిమానులు అనేకమంది ఉన్నారు.
‘జీవితం ఒక ఉత్సవం- నా బతుకు కథ’ అనే టైటిల్‌తో ఎమెస్కొ ప్రచురించిన పట్టాభిరామ్ జీవిత కథ 2024లో ఆవిష్కరించిన సందర్భం నా మనసులో సజీవంగా ఉంది. అప్పటికే పట్టాభిరామ్ ఆరోగ్యం చెడిపోయింది.
1991లోనే ప్రశాంతి కౌన్సిలింగ్ అండ్ హెచ్.ఆర్.డి సెంటర్‌ను నెలకొల్పారు. అప్పటి నుంచి వ్యక్తిత్వ వికాసంలోనూ, జీవితంలో రాణించడానికి అవసరమైన అంశాలు బోధించడంలోనూ ఆయన ఎనలేని సేవలు చేస్తూ వచ్చారు. పిల్లలు మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు ముదిరి సంక్షోభం ఏర్పడినా ఆయన దగ్గరికి వెళ్తే పరిష్కారం లభించేది. ఆయన సతీమణి సైతం ఈ సంస్థలో సహాయసహకారాలు అందించేవారు. పట్టాభిరామ్ది ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వం. విద్యాధికుడు. సమాజ వికాసానికీ, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లడానికి అవసరమైన పనులు చేస్తూ అహరహం పాటుపడేవారు. సమాజంలో ఆయనకు ఒక సమున్నత స్థానం ఉన్నది. పరోపకారిగా, విషయపరిజ్ఞానం పుష్కలంగా ఉన్నవ్యక్తిగా, మనోవైజ్ఞానిక రంగంలో మేటిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది.
(వ్యాసకర్త: పూర్వ సంపాదకులు)
-కె.రామచంద్రమూర్తి