ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు క్రీమీలేయర్ నిబంధనలే ఇప్పుడు ఓబీసీ వర్గాలకు ప్రతిబంధకాలవుతున్నాయి. రిజర్వేషన్ ఫలాలను అందకుండా దూరం చేస్తున్నాయి. క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని గత ఎనిమిదేండ్లుగా పెంచకపోవడం ఒక కారణమైతే, మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో క్రీమీలేయర్ నిర్ధారణ చేయకపోవడం మరొకటి. వీటిపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. వెరసి ఓబీసీ ఉద్యోగులకు చెందిన పిల్లలు రిజర్వేషన్ ఫలాలను పొందకుండా పోతున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారు. దీనిపై సత్వరమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలె. నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు పూనుకోవాలె.
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశమే దేశంలో రిజర్వేషన్ల ఏర్పాటుకు పునాది. అయితే ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ, ఓబీసీ వర్గాలకు మాత్రం ప్రభుత్వాలే కల్పిస్తున్నాయి. దీనిపై ఓబీసీ వర్గాలు సుదీర్ఘకాలం పాటు పోరాటాలు చేశారు. ఫలితంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 27 శాతం రిజర్వేషన్‌ను 1990లో మండల్ కమిషన్ కల్పించింది. అయితే, దాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్లను సమర్థించినా క్రీమీలేయర్ (సంపన్నశ్రేణి) అంశాన్ని తెరమీదికి తీసుకువచ్చింది. విశ్రాంత జస్టిస్ ఆర్ఎన్ ప్రసాద్ నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయగా, అది క్రీమీలేయర్ పదాన్ని నిర్వచించింది. ఓబీసీల్లో ఉన్నత ఉద్యోగులు, సంపన్న శ్రేణికి రిజర్వేషన్ వర్తింపజేయరాదని వెల్లడించింది. నాన్ క్రీమీలేయర్‌కు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందాలని నిర్ణయించింది. అంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు క్రీమీలేయర్ నిబంధనలే ఓబీసీ వర్గాలకు శాపంగా పరిణమిస్తున్నాయి. ఆదాయ పరిమితిని పెంచకపోవడం, క్రీమీలేయర్ నిబంధనలపై అధికారు ల అవగాహన రాహిత్యంతో రిజర్వేషన్ ఫలా లు దక్కని దుస్థితి నేడు నెలకొన్నది. దీనిపై ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.
క్రీమీలేయర్ నిబంధనల్లో ప్రధానమైంది ఓబీసీ వర్గాల వార్షిక ఆదాయ పరిమితి. ప్రభు త్వ ఉద్యోగులు, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని మినహాయించి ప్రొఫెషనల్స్, వాణిజ్య, వ్యాపారస్థులు, ప్రైవేటుగా ప్రాక్టీసు చేస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇన్‌కమ్‌టాక్స్ కన్సల్టెంట్లు, ఆర్కిటెక్టులు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, సినీ ఆర్టిస్టులు, రచయితలు, జర్నలిస్టులు, క్రీడాకారులు, వ్యవసాయదారులు చాలామందికి దీన్ని వర్తింపజేస్తారు. ఇక క్రీమిలేయర్ విధానాలను నిర్దేశిస్తూ 1993లో డీవోపీటీ స్పష్టం గా నోటిఫికేషన్ ఇచ్చింది. వ్యవసాయ ఆదాయాన్ని మినహాయించి ఇతరత్రా మార్గాల ద్వారా వచ్చే వార్షిక ఆదాయాన్ని పరిగణన లోకి తీసుకోవాల్సి ఉన్నది. ఆ ప్రకారం నాడు వ్యవసాయేతర వార్షిక ఆదాయ పరిమితి రూ.లక్షగా నిర్ధారించారు. ఆ తర్వాత 2004 లో క్రీమీలేయర్‌కు సంబంధించి వార్షిక ఆదా య పరిమితిలో పలు మార్పులు చేశారు. ప్రతీ మూడేండ్లకు ఒకసారి ఈ పరిమితిని సమీక్షించాల్సి ఉన్నది. జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు, డీవోపీటీ, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆమోదంతో వార్షి క పరిమితిని పెంచుతూ రావడం పరిపాటిగా మారింది.
తలసరి ఆదాయం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ), ద్రవ్యోల్బణం ఆధారం గా ఆదాయాన్ని నిర్ధారిస్తారు. అందులో భాగంగా 2004లో ఓబీసీ క్రీమీలేయర్ ఆదా య పరిమితిని రూ.లక్ష నుంచి రూ.2.5 లక్షలకు, 2008లో రూ.4.5 లక్షలకు, 2013లో రూ.6 లక్షలకు, చివరిసారిగా 2017లో రూ.8 లక్షలకు పెంచారు. నాటినుంచి నేటి వరకూ ఎనిమిదేండ్లు గడిచినా ఆదాయ పరిమితిని సమీక్షించలేదు. దీంతో ఓబీసీ వర్గాలు తీవ్రం గా నష్టపోతున్నాయి. వాస్తవంగా గతంలోనే ఓబీసీల క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని సమీక్షించి రూ.8 లక్షల నుంచి 15 లక్షల కు పెంచాలని డీవోపీటీ కమిటీ నిర్ణయించింది. అంతేకాదు, పార్లమెంటరీ కమిటీ సైతం అనేక సార్లు ఇదే విషయమై సిఫారసు చేసింది. కానీ, కేంద్రం మాత్రం క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని సవరించేందుకు ససేమిరా అంటున్నది. కమిటీ సిఫారసు ఆధారంగా కేంద్రం జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ఒక డ్రాఫ్ట్ నోట్‌ను గతంలోనే పంపింది. క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని రూ.15 లక్షలకు కాకుండా, రూ.12 లక్షల పరిమితికి అంగీకరించింది. అయితే, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా అందులో కలపాలనే షరతును కేంద్రం విధించింది. దాన్ని పార్లమెంట రీ కమిటీ వ్యతిరేకించడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తర్వాత క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని సవరించేది లేదని కేంద్రం కరాకండిగా తేల్చిచెప్పింది.
గడిచిన ఎనిమిదేండ్లలో తలసరి ఆదాయం, ద్రవ్యోల్బణం రేటు గణనీయంగా పెరిగింది. ధరలు కూడా దాదాపు 100 శాతానికి పైగా పెరిగాయి. కానీ క్రీమీలేయర్ వార్షిక ఆదాయ పరిమితిని మాత్రం పెంచడం లేదు. దీంతో ఓబీసీ వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారమే 2015-2019 వరకు దాదాపు ఓబీసీ వర్గాలకు చెందినవారు 62 మంది మాత్రమే సివిల్ సర్వీసెస్‌కు ఎంపికయ్యారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆదాయ పరిమితి అంశం తర్వాత ప్రధానమైనది సామాజిక స్థితిగతులను గుర్తించడం. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల కు సంబంధించింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వార్షిక ఆదాయాలు కాకుండా వారి ర్యాంక్, హోదాను పరిగణనలోకి తీసుకొని క్రీమీలేయర్, నాన్ క్రీమీలేయర్ అనేది నిర్ధారించాల్సి ఉంది. కానీ, ఆచరణలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ర్యాంకు, హోదాను బట్టి కాకుండా వార్షిక ఆదాయ పరిమితి ఆధారంగానే క్రీమీలేయర్‌ను నిర్ధారిస్తున్నారు. ఉదాహరణకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో) స్థాయిలో తొలుత నియామకమై, తదుపరి ప్రమోషన్ ద్వారా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ స్థాయికి చేరుకున్న ఉద్యోగి నెలకు రూ.1,20,000 జీతం పొందుతున్నారు. వార్షిక ఆదాయం రూ.14,40,000 దాటుతుంది. ఈ నేపథ్యంలో సదరు ఉద్యోగి, అత ని పిల్లలను క్రీమీలేయర్‌గా పరిగణిస్తున్నారు. కానీ, వాస్తవం ఏమంటే హెచ్‌డబ్ల్యూవో పోస్ట్ గ్రూప్-3 స్థాయి ఉద్యోగం కాగా, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది గ్రూప్-1 స్థాయి ఉద్యోగం. తొలి నియామకాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నది. ఆ ప్రకా రం నాన్ క్రీమీలేయర్ పరిధిలోకి వస్తారు. కానీ, అందుకు విరుద్ధంగా ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ క్రీమీలేయర్‌గా నిర్ధారిస్తున్నారు. వెరసి అనేక మం ది ఓబీసీ ఉద్యోగుల పిల్లలు రిజర్వేషన్ కోటా కు నోచుకోవడం లేదు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై దృష్టిసారించాలి. వార్షిక ఆదాయ పరిమితిని రూ.15 లక్షలకు సవరించాలి. క్రీమీలేయర్ నిబంధనలను పక్కాగా అమలుచేసేలా అధికారులకు ఆదేశాలను జారీచేయాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం)
చంద్రశేఖర్ గౌడ్
94933 21546