అమెరికాలో శాశ్వత నివాసం కోసం ఏండ్లుగా వేచిచూస్తున్న భారతీయులకు తీపి కబురు. గ్రీన్‌కార్డుల జారీలో జరుగుతున్న
తీవ్ర జాప్యాన్ని నివారించే దిశగా అగ్రరాజ్యం అమెరికా ప్రతినిధుల సభ అడుగులు వేస్తున్నది. అస్తవ్యస్తంగా మారిన గ్రీన్‌కార్డుల
జారీ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించిన కాంగ్రెస్ సభ్యులు కొందరు అందుకు అనుగుణంగా ఓ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు ఆమోదం పొంది చట్ట రూపం దాలిస్తే భారతీయులకు భారీగా లబ్ధి చేకూరనున్నది.
గ్రీన్‌కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు భారతీయ మూలాలున్న కాంగ్రెస్ సభ్యులు రాజా కృష్ణమూర్తి, ప్రమీలా జయపాల్ ప్రత్యేక చొరవ తీసుకోవడం గమనార్హం. దేశాల వారీ గా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి ముగింపు పలికేందుకు అమెరికా చట్ట సభలో ముందడుగు పడటంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడంలో మరో సభ్యుడు రిచ్మెక్ కార్మిక్ వీరికి సహకరించడం విశేషం.
అమెరికా కంపెనీలకు భారతీయ నిపుణుల సేవలు చాలా అవసరం. కానీ గ్రీన్‌కార్డుల జారీలో జాప్యం వల్ల ఎక్కువ మంది నిపుణులను నియమించుకునే వెసులుబాటు లేకుండాపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న
లక్షలాది మంది తాత్కాలిక నివాసితులే కావడం గమనార్హం.
తాజాగా ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందితే ఒక దేశానికి ఏడు శాతానికి మించి గ్రీన్‌కార్డుల జారీ చేయకూడదన్న నిబంధన తుడిచిపెట్టుకుపోతుంది. దీని వల్ల అత్యధికంగా భారతీయులకు ప్రయోజనం కలుగుతుంది. ఒక దేశానికి ఏడు శాతానికి మించి గ్రీన్‌కార్డులు జారీ చేయకూడదన్న నిబంధన వల్ల గ్రీన్‌కార్డు ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఇప్పటికే సుమారు 11 లక్షల మంది భారతీయులు గ్రీన్‌కార్డుల కోసం వేచిచూస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ఏటా సుమారుగా 1,40,000 ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులను మాత్రమే జారీ చేస్తున్నది. ఒక్కో దేశానికి 7 శాతం లెక్కన 9,800 మంది భారతీయులకు మాత్రమే గ్రీన్‌కార్డులు అందే అవకాశం ఉండటం శోచనీయం. అయితే వాస్తవ పరిస్థితులను బేరిజు వేసుకుంటే 7 వేల నుంచి 8 వేల మంది మాత్రమే గ్రీన్‌కార్డులు పొందుతున్నారు. వీరిలోనూ అత్యధికులు ప్రాథమిక దరఖాస్తుదారుడిపై ఆధారపడిన వారే ఉండటం గమనార్హం. అందువల్ల ఏటా 2 వేల మందికి మాత్రమే ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు అందుతున్నట్టు లెక్క. క్యాటో ఇన్స్టిట్యూట్ అనే సంస్థ అంచనా ప్రకారం 11 లక్షల మంది ఆశావహులకు గ్రీన్‌కార్డులు అందాలంటే సుమారు 134 ఏండ్లు భారతీయులు ఎదురుచూడాల్సి రావడం శోచనీయం. అయితే తాజాగా తీసుకొచ్చిన బిల్లు వల్ల భారతీయులకు లబ్ధి చేకూరే అవకాశం ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం.
మరోవైపు ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల సంఖ్యను కూడా పెంచాలని ఈ బిల్లులో పొందుపరచడం విశేషం. ఏడు శాతం నుంచి 15 శాతానికి ఈ తరహా గ్రీన్‌కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటం చెప్పుకోదగ్గ విషయం. ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డులు కలిగి ఉన్నవారు స్పాన్సర్ చేయడం ద్వారా అత్యధిక కుటుంబ సభ్యులు శాశ్వతం నివాసితులుగా మారే అవకాశం ఉంది. ఫ్యామిలీ స్పాన్సర్డ్ క్యాటగిరీలో అమెరికా ప్రభుత్వం ఏటా 2,26,000 గ్రీన్‌కార్డులనే జారీ చేస్తుండగా.. ఈ కోటాలో కూడా భారతీయులకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. ఉపాధి ఆధారిత, ఫ్యామిలీ స్పాన్సర్డ్ గ్రీన్‌కార్డుల కోటా కలిపి ఇప్పటివరకు సుమారుగా 25,620 మందికి మాత్రమే ఏటా గ్రీన్‌కార్డులు అందుతున్నాయి. తాజా బిల్లు ఆమోదం పొందితే ఈ రెండు క్యాటగిరీల్లో కలిపి మరింత మంది భారతీయులు శాశ్వత నివాసితులుగా మారనున్నారు. అయితే బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది వేచిచూడాల్సి ఉన్నది.
– ఎడిటోరియల్ డెస్క్