ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నెదర్లాండ్స్ భాగస్వామ్యంతో పశ్చిమాఫ్రికాలోని ‘కోటె ది ఐవొరె’ (దీనిని ముందు ఐవరీ కోస్ట్ అని పిలిచేవారు) దేశంలో జరపనున్నారు. ఇది 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం. కోటె ది ఐవొరె 2014 నుంచి ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధించి, దానికి బదులుగా పునర్వినియోగ ప్యాకేజింగ్‌ను ప్రోత్సహిస్తున్నది. 2023 సంవత్సరపు ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ (విషయం) ‘ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారాలు’. ఈ థీమ్ ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కలిగి ఉన్నది.
ప్లాస్టిక్ వల్ల కలిగే పర్యావరణ హానిపై ప్రజలకు అవగాహన కల్పించి ప్లాస్టిక్‌ను వాడకుండా చేయటం ఈ థీమ్ ముఖ్య ఉద్దేశం. పర్యావరణంలోకి విడుదలయ్యే ప్లాస్టిక్ పూర్తిగా విచ్ఛిత్తి చెందడానికి సుమారు 20 నుంచి 1000 సంవత్సరాలు వరకు పడుతుంది. ఈ ప్రక్రియ వేగం ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాల స్వభావంపై, ప్లాస్టిక్ నిర్మాణంపై, సూర్యరశ్మి వంటి పర్యావరణ అంశాలపై ఆధారపడి ఉంటుంది. పేపరయితే పూర్తిగా విచ్ఛిత్తి చెంది భూమిలో కలవడానికి సుమారు రెండు నుండి ఆరు వారాల సమయం పడుతుంది. దీనిని బట్టి ప్లాస్టిక్ వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. గత దశాబ్దాల్లో గ్లోబల్ ప్లాస్టిక్ ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 400 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీంట్లో కేవలం 12శాతం మాత్ర మే కాల్చివేయబడుతుంది. 9 శాతం రీసైకిల్ చేయబడుతుంది. మిగిలిన 79 శాతం ప్లాస్టిక్.. చెత్తను పారవేసే డంపింగ్ ప్రదేశాల్లో, పల్లపు ప్రదేశాల్లో లేదా మహాసముద్రాలతో సహా పర్యావరణంలోకి విడుదల చేయబడుతుంది. అది ఆహారం, నీరు, గాలిలోకి విడుదల చేయబడి తద్వారా మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
సముద్రాల్లో ఏర్పడే ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించడానికి నాసా రూపొందించిన ఉపగ్రహ టెక్నాలజీ ఒక పరిష్కారాన్ని చూపుతుంది. కాగితం లాగా ప్లాస్టిక్‌ను తక్కువ సమయంలో విచ్ఛిన్నం చేసే సూక్ష్మజీవులను తయారు చేయడం మరొక పరిష్కారం. వినియోగించిన ప్లాస్టిక్ నుండి ద్రవ ఇంధనాలు తయారు చేయడం, ప్లాస్టిక్ రోడ్లను వేయటం, బయోప్లాస్టిక్‌ను వాడటం ద్వారా ప్లాస్టిక్‌తో కలిగే నష్టాలను తగ్గించవచ్చు. భూమి కాలు ష్య కోరల్లో చిక్కుకుంటే మానవుడు జీవించడానికి మరొక భూమి లేదు. కాబట్టి పర్యావరణ కాలుష్యాన్ని నివారిద్దాం భూమిని కాపాడుకుందాం.
(నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం)
డా. శ్రీధరాల రాము
94411 84667