కేసీఆర్ ప్రభుత్వ హయాం లో పల్లె ప్రగతి అంటే తెలంగాణకు గర్వకారణం. తెల్లవారుజామునే గ్రామంలో ట్రాక్టర్ తిరిగేది. ఇంటింటి నుంచి చెత్త సేకరించేది. వీధులు శుభ్రంగా ఉండేవి. మురుగు కాలువలు క్రమం తప్పకుండా శుభ్రం చేసేవారు. నర్సరీల్లో మొకలు కళకళలాడేవి. పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో అలరించేవి. వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, వీధి దీపాలు.. ఇలా గ్రామానికి అవసరమైన మౌలిక వసతులపై ఒక వ్యవస్థ పనిచేసేది. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో నేడు అనేక గ్రామాల్లో చెత్త కుప్పలు, పూడుకుపోయిన కాలువలు, ఎండిపోయిన మొకలు, పనిచేయని వీధి దీపాలు, నిధుల కోసం ఎదురు చూస్తున్న పంచాయతీలు కనిపిస్తున్నాయి. ఈ దుస్థితికి కారణం ఎవరో సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలను పాలనలో కేంద్ర బిందువుగా మార్చింది. పల్లె బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఆలోచనతో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది. 12,769 గ్రామ పంచాయతీలకు నెలనెలా రూ.180 కోట్లను మంజూరు చేసి మౌలిక వసతులు కల్పించింది. పల్లె ప్రగతి పేరుతో గ్రామాన్ని కేవలం పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరిగే పరిపాలనా యూనిట్‌గా కాకుండా.. పరిశుభ్రత, పచ్చదనం, మౌలిక వసతులు, ప్రజారోగ్యం కలిసిన సమగ్ర వ్యవస్థగా అభివృద్ధి చేసింది. గ్రామానికి ట్రాక్టర్.. ట్రాక్టర్‌కు ట్యాంకర్.. చెత్త సేకరణకు సిబ్బంది.. మొకల సంరక్షణకు హరితమిత్రలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు.. ఇవి ఒకొకటి వేర్వేరు పనులు కావు. గ్రామాన్ని మార్చే సమగ్ర పాలనా స్వరూపం. నెలనెలా పల్లె ప్రగతి కింద నిధులు విడుదలై, పనులు జరిగేవి. అధికారులు గ్రామాలకు వచ్చేవారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పల్లె ప్రగతి కార్యకలాపాలపై దృష్టి పెట్టడం ద్వారా గ్రామ పాలనలో చురుకుదనం తీసుకొచ్చారు.
ఒకప్పుడు తెలంగాణ గ్రామాలను దేశానికి ఆదర్శంగా చూపించిన పాలన నుంచి.. నేడు గ్రామాల్లో కనీస పారిశుధ్యం, నిర్వహణ, నిధుల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతి ఒక ఉద్యమంలా సాగితే.. కాంగ్రెస్ పాలనలో నీరుగారింది. పాలన అంటే ప్రజల జీవితాల్లో కనిపించే మార్పు. కేసీఆర్ హయాంలో పల్లె ప్రగతిలో పచ్చదనానికి ప్రత్యేక స్థానం కల్పించారు. మొక నాటడం మాత్రమే కాదు.. మొకను బతికించడం కూడా ప్రభుత్వ బాధ్యతే అనే విధానాన్ని ముందుకు తెచ్చారు. ఇంటింటికీ చెత్త సేకరణ, రోడ్ల శుభ్రత, మురుగు కాలువల నిర్వహణ వంటి పనులకు సిబ్బందిని వినియోగించారు. దీంతో తెలంగాణ గ్రామాల రూపురేఖలు మారాయి. కేంద్ర స్థాయిలోనూ తెలంగాణ గ్రామీణ అభివృద్ధి, పారిశుధ్య కార్యక్రమాలకు మంచి గుర్తింపు లభించింది. నాడు తెలంగాణ రాష్ట్రం ఎన్నో అవార్డులు సాధించింది. అప్పుడు తెలంగాణ పల్లెలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చేవారు. మరోవైపు కేసీఆర్ హయాంలో పట్టణ ప్రగతితో పట్టణాలు, నగరాలకు కొత్త రూపం తీసుకువచ్చారు. పారులు, ఫుట్ పాత్‌లు, డివైడర్లు, పచ్చదనం, వీధి దీపాలు, చెత్త సేకరణ వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా గ్రామాలు, పట్టణాలపై కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఆరోగ్య గ్రామాలుగా తీర్చిదిద్దింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. గ్రామాలకు నిధుల కొరత వెంటాడుతున్నది. స్థానిక సంస్థలకు నిధులు లేవని ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. గ్రామాల్లో పెండింగ్ బిల్లులు పేరుకుపోయాయి. పంచాయతీలకు ఆదాయం లేకపోవడం.. ప్రభుత్వం నుంచి నిధులు సకాలంలో రాకపోవడం.. ఫలితంగా గ్రామాల్లో చిన్నచిన్న పనులు కూడా నిలిచిపోతున్నాయి. గ్రామ పంచాయతీలకు నిధులు వస్తేనే గ్రామ అభివృద్ధి జరుగుతుంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలాంటి పరిస్థితి మనకు కనిపించడం లేదు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పారులు తదితరాల నిర్వహణను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. గ్రామాల్లోని ట్రాక్టర్లలో డీజిల్ ఉండటంలేదు. పంచాయతీ కార్మికులకు జీతాలు అందడంలేదు. ఇలా గ్రామంలో ప్రతి పనికీ నిధులు అవసరం. అలాంటి పరిస్థితిలో పంచాయతీకి నిధులు లేకపోతే బాధ్యతలు ఎలా నెరవేరుతాయి? పారిశుధ్య పనులు నిర్వహణ కష్టంగా మారింది. చెత్త కుప్పల మధ్య తెలంగాణ రాష్ట్రం తయారైంది. పారిశుధ్యం దెబ్బతింటే దాని ప్రభావం కేవలం గ్రామం అందంపై పడదు. ప్రజారోగ్యంపై పడుతుంది. చెత్త పేరుకుపోయి దోమలు పెరుగుతున్నాయి. వ్యాధులు వ్యాపిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో పరిస్థితి ఇలా ఉంటే పట్టణాలు కూడా సమస్యల నుంచి తప్పించుకోలేకపోతున్నాయి. పారుల నిర్వహణ లేకపోవడం.. వీధి దీపాలు పనిచేయకపోవడం.. రోడ్ల పకన చెత్త పేరుకుపోవడం.. డ్రైనేజీ సమస్యలు.. ఫుట్‌పాత్‌ల దుస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి గ్రామం పునాది. గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులను పరిషరించాలి. పారిశుధ్య కార్మికులకు వేతనాలు సకాలంలో అందేలా చూడాలి. చెత్త సేకరణ వ్యవస్థను పునరుద్ధరించాలి. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, వైకుంఠధామాలను సంరక్షించాలి. మున్సిపాలిటీలకు అవసరమైన నిధులు అందించాలి. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి మళ్లీ ఊపిరి పోయాలి. అప్పుడే గ్రామాలు పట్టణాలు ప్రగతి పట్టాలు ఎక్కుతాయి. ఆరోగ్య గ్రామాలుగా విలసిల్లుతాయి. ఇవేమీ చేయకుండా కాంగ్రెస్ పాలకులు వెయ్యి రోజుల సంబురాలు చేసుకోవడం వృథా.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
కత్తుల శ్రీనివాస్‌రెడ్డి